ఒక్కో లక్ష్యానికి ఒక్కో ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలా?
నా వయస్సు 35 సంవత్సరాలు. సొంత ఇంటిని సమకూర్చుకోవడం, నా పాపను డాక్టర్ చదివించడం, రిటైరైన తర్వాత ప్రశాంత జీవనం గడపటానికి కావలసిన నిధిని సమకూర్చుకోవడం... నా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు. ఈ మూడు లక్ష్యాల కోసం మూడు వేర్వేరు ఫండ్స్‌ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా? ఎన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటే అన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా? వివరించగలరు.
–సుందర్, విశాఖపట్టణం
ఎన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటే అన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని అలోచన మంచిదే. కానీ వివిధ ఆర్థిక లక్ష్యాల కోసం వివిధ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సొంత ఇంటిని సమకూర్చుకోవడం, మీ పాపను ఎంబీబీఎస్‌ను చదివించడం, రిటైరైన తర్వాత ప్రశాంత జీవనం గడపటానికి కావలసిన నిధిని సమకూర్చుకోవడం...ఈ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం వేర్వేరు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒకటి లేదా రెండు మంచి ఫండ్స్‌ను ఎంచుకొని వాటిల్లోనే సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం కావలసిన ఆర్ధిక వనరులను మీరు పొందగలరు.
నేను కొన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను, వాటిల్లో నష్టాలు వచ్చాయి. ఈ డెట్ ఫండ్స్ సమీప కాలంలో కోలుకునే అవకాశాలు ఉన్నాయా? లేకుంటే ఈ డెట్ ఫండ్స్ నుంచి వైదొలగమంటారా? తగిన సూచనలివ్వండి.
–లక్ష్మీరాజ్, హైదరాబాద్
డెట్ ఫండ్స్ కోలుకునే అవకాశాలు బాగానే ఉన్నాయి. మెచ్యురిటీ కాలం అధికంగా ఉన్న డెట్ ఫండ్స్‌కు ఇటీవలిS కాలంలో బాగానే నష్టా లు వచ్చాయి. అయితే ఈ ఫండ్స్ రికవరీ అయ్యే అవకాశాలు అధికంగానే ఉన్నాయి. మీరు డైనమిక్ బాండ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే ఈ ఫండ్స్ రికవరీ కావడానికి 4–5 నెలల సమయం పడుతుంది. ఒకవేళ మీరు షార్ట్‌టర్మ్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే నెలన్నర కాలంలోనే మీ ఇన్వెస్ట్‌మెంట్స్ రికవరీ అవుతాయి. ఆల్ట్రా షార్ట్‌టర్మ్ ఫండ్స్ ఇప్పటికే రికవరీ బాట పట్టాయి. లిక్విడ్ ఫండ్స్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదు. మొత్తం మీద 1–6 నెలల కాలవ్యవధిలో డెట్ ఫండ్స్ రికవరీ అవుతాయని అంచనా వేస్తున్నాం. మీరు కనుక ఏడాది క్రితం డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు ఎలాంటి నష్టాలు వచ్చే అవకాశాలే లేవు. పైగా ఒకింత లాభాల్లో ఉండి ఉంటారు.
మిడ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ మిడ్‌క్యాప్ ఫండ్స్.. తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎంత శాతం మిడ్‌క్యాప్ కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి ?
–సుధీర్, నిజామాబాద్
సాధారణంగా చాలా మిడ్–క్యాప్ ఫండ్స్,.. మిడ్ క్యాప్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే కొన్ని మిడ్‌క్యాప్ ఫండ్స్ లార్జ్ క్యాప్ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు చెప్పాలంటే హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్‌ను తీసుకుంటే, ఈ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ కేటాయింపుల్లో 30 శాతం వరకూ లార్జ్ క్యాప్ కంపెనీల షేర్లు ఉన్నాయి. లార్జ్ క్యాప్ కంపెనీల షేర్లు ఎక్కువ సంఖ్యలో ట్రేడ్ కావడమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు మార్కెట్ కష్ట సమయంలో ఉన్నప్పుడు మిడ్–క్యాప్ షేర్లను విక్రయించడం చాలా కష్టసాధ్యమైన విషయం. దీంతో పలు మిడ్ క్యాప్ ఫండ్స్‌కు నష్టాలు తప్పవు. దీనిని నివారించడానికి పలు మిడ్–క్యాప్ ఫండ్స్ 10–30 శాతం రేంజ్‌లో లార్జ్ క్యాప్ కంపెనీల షేర్లలో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. భారత స్టాక్ మార్కెట్లో మిడ్‌క్యాప్ కంపెనీలు 330 వరకూ ఉంటాయని అంచనా. తమ ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తంలో ఇలాంటి మిడ్ క్యాప్ కంపెనీల షేర్లలో 60 శాతం వరకూ ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను మిడ్‌క్యాప్ ఫండ్స్‌గా పరిగణిస్తారు.
ఏదైనా మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎన్‌ఎఫ్‌ఓను తెచ్చిందనుకోండి. దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? న్యూ ఫండ్ ఆఫర్(ఎన్‌ఎఫ్‌ఓ)లో ఇన్వెస్ట్ చేయడానికి ఏ యే విషయాలు చూడాలి ?
–అంజాద్, హైదరాబాద్
అసలు న్యూ ఫండ్ ఆఫర్(ఎన్‌ఎఫ్‌ఓ)లోనే ఇన్వెస్ట్ చేయకూడదు. కాదు కూడదు తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం.. కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఏదైనా మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎన్‌ఎఫ్‌ఓను అందుబాటులోకి తెచ్చిందనుకోండి. ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థ ట్రాక్ రికార్డ్ ఏమిటి ? ఈ ఎన్‌ఎఫ్‌ఓను నిర్వహించే ఫండ్ మేనేజర్ ఎవరు ? ఈ ఎన్‌ఎఫ్‌ఓ విధి విధానాలు ఏమిటి అనే విషయాలు చూడాలి. దీనికంటే కూడా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌నే ఎంచుకొని ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. వాటిల్లో సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఎన్‌ఎఫ్‌ఓ పనితీరు ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం. అదే అప్పటికే రంగంలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పనితీరును మదింపు చేయడానికి ఆ ఫండ్ ట్రాక్ రికార్డ్‌ను చూస్తే సరిపోతుంది. గత కొన్నేళ్లలో ఆ ఫండ్ ఏ మేరకు రాబడులనిచ్చిందో పరిశీలించి భవిష్యత్తులో ఏ మేరకు రాబడులు వస్తాయో అంచనా వేయడం సులభమే. అదే ఎన్‌ఎఫ్‌ఓలో ఆ అవకాశం ఉండదు. అందుకని ఎన్‌ఎఫ్‌ఓలో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది అని మేము భావిస్తాం.