జన ధన ‘లైఫ్’ ప్రీమియం కోసం రూ. 50 కోట్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన ధన యోజన(పీఎంజేడీవై) ఖాతాదారులకు జీవిత బీమా కవర్‌కు సంబంధించి ప్రీమియం చెల్లింపు ఏర్పాటును ఆర్థిక శాఖ ఖరారు చేసింది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజ సంస్థ- ఎల్‌ఐసీతో సంప్రదింపుల అనంతరం ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎల్‌ఐసీ నిర్వహిస్తున్న రూ.1,800 కోట్ల సామాజిక భద్రతా నిధి(ఎస్‌ఎస్‌ఎఫ్) నుంచి రూ.50 కోట్లను ప్రత్యేకంగా పీఎంజేడీవై పథకం ప్రీమియం కోసం కేటాయింపులు జరిగాయి.
ఈ నిర్ణయాన్ని త్వరలో ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆమోదించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, ఆగస్టు 28న ప్రవేశపెట్టిన జన ధన యోజన కింద వచ్చే ఏడాది జనవరి 26 నాటికి బ్యాంక్ అకౌంట్ ప్రారంభించిన వారు రూ. 30,000 జీవిత బీమా పొందడానికి అర్హులవుతారు. అప్పటికి 7.5 కోట్ల అకౌంట్లు తెరవడం ప్రభుత్వ లక్ష్యం అని ఇప్పటికే ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. సెప్టెంబర్ 8 నాటికి బ్యాంకులు ఈ పథకం కింద దాదాపు 3.02 కోట్ల అకౌంట్లు ప్రారంభించాయి.