Pradhan Mantri Jan Dhan Yojana
-
రూ.1.46 లక్షల కోట్ల డిపాజిట్లు..43 కోట్ల ఖాతాలు
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీఐ) ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ పథకం కింద ప్రారంభించిన బ్యాంకు అకౌంట్ల సంఖ్య 43 కోట్లకు చేరుకోగా డిపాజిట్ల మొత్తం రూ.1.46 లక్షల కోట్లున్నట్లు శనివారం కేంద్రం ఆర్థిక శాఖ వెల్లడించింది. సామాన్య ప్రజలకు బ్యాంకింగ్, చెల్లింపులు, క్రెడిట్, బీమా, పింఛను వంటి ఆర్థిక సేవలు సులభంగా అందుబాటులో ఉండే లక్ష్యంతో 2014 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. అనంతరం ఈ పథకాన్ని అదే ఏడాది ఆగస్టు 28వ తేదీ నుంచి ప్రారంభించారు. 2014లో ఈ పథకం కింద ప్రారంభించిన బ్యాంకు ఖాతాల సంఖ్య 17.90 కోట్లు కాగా, ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీ నాటికి ఇవి 43.04 కోట్లకు పెరిగాయి. వీటిలో 55.47% అంటే, 23.87 కోట్ల ఖాతాలు మహిళలవే. మొత్తం ఖాతాల్లో 66.69% అంటే 28.70 కోట్ల ఖాతాలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారివేనని ఆర్థిక శాఖ పేర్కొంది. 43.04 కోట్ల ఖాతాల్లో 85.6% అంటే, 36.86 కోట్ల ఖాతాలు యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిలో సరాసరి డిపాజిట్ మొత్తం రూ.3,398గా ఉంది. అంతేకాదు, ఈ ఖాతాల్లో సరాసరి డిపాజిట్ మొత్తం పెరుగుతూ వస్తోందనీ, దీనర్థం వీటిని ప్రజలు వినియోగించుకుంటున్నారనీ, వారిలో పొదుపు అలవాటైందని ఆర్థిక శాఖ వివరించింది. ఈ అకౌంట్లు కలిగిన వారికి ప్రమాద బీమా మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచినట్లు తెలిపింది. ఇందుకోసం 31.23 కోట్ల రూపే కార్డులను జారీ చేసినట్లు తెలిపింది. జన్‌ధన్ యోజన అమలుతో దేశం అభివృద్ధి పథం ఒక్కసారిగా మారిపోయిందని పీఎంజేడీఐ ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. పారదర్శకతను పెంచిన ఈ పథకంతో కోట్లాదిమంది భారతీయులకు సాధికారిత, ఆర్థికపరమైన గౌరవం దక్కాయని తెలిపారు. చదవండి : నాణేల చెలామణీ..ప్రోత్సహకాల్ని పెంచిన ఆర్బీఐ -
సంపాదనలో సగానికి పైగా ఆదా చేస్తున్న మహిళలు
న్యూఢిల్లీ: పట్టణ మహిళలు (ఉద్యోగం, ఆర్జనలో ఉన్నవారు) పొదుపునకు, పెట్టుబడులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్.. మహిళలను తమ విశ్రాంత జీవనం గురించి ఆలోచింపజేసినట్టు మ్యాక్స్‌లైఫ్ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. విచక్షణారహితంగా ఖర్చు పెట్టడానికి బదులు పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వడమే కాదు.. సంపాదనలో 52 శాతాన్ని తమ లక్ష్యాల కోసం మహిళా ఉద్యోగులు కేటాయిస్తున్నారు. కనీస అవసరాలకు వారు కేటాయిస్తున్న మొత్తం 39 శాతం మించడం లేదు. ఇక దుబారా, ఖరీదైన వాటి కోసం వారు చేస్తున్న ఖర్చు కేవలం 9 శాతంగానే ఉందని మ్యాక్స్‌లైఫ్ ఇండియా సర్వే స్పష్టం చేసింది. సర్వేలో అభిప్రాయం తెలిపిన మహిళల్లో.. 56 శాతం మంది తమ వృద్ధాప్య జీవన అవసరాలు, భద్రత కోసం పొదుపు చేస్తున్నట్టు చెప్పారు. 64 శాతం మంది పిల్లల విద్య కోసం పక్కన పెట్టగా.. అకాల మరణం చెందితే కుటుంబానికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో 39 శాతం మంది రక్షణాత్మక చర్యలు తీసుకున్నారు. 40 శాతం మంది వైద్య అత్యవసరాల కోసం పొదుపు చేసినట్టు చెప్పారు. జన్ ధన్ అకౌంట్లలో మెజారిటీ ‘మహిళ’దే!: ఆర్థికశాఖ ప్రకటన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద అకౌంట్లు కలిగివున్న వారిలో 55 శాతం మంది మహిళలేనని ఆర్థికశాఖ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములుగా చేయాలని, ప్రభుత్వ పథకాలు ప్రత్యక్షంగా లబ్దిదారులకు అందాలని లక్ష్యంగా 2014 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రకటించారు. అదే ఏడాది ఆగస్టు 28న పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పథకాల్లో మహిళా భాగస్వామ్యానికి సంబంధించి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థికశాఖ ఒక ప్రకటన చేసింది. మహిళల సాధికారితను పెంచే క్రమంలో జన్ ధన్ యోజన కీలకమైనదని ఈ ప్రకటనలో వ్యాఖ్యానించింది. 2018లో ఈ పథకం ప్రయోజనాలను మరింత పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ప్రమాద బీమా రెట్టింపు, ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితి పెంపు వంటి పలు కీలక ప్రయోజనాలు రెండవ వెర్షన్ కింద ప్రవేశపెట్టడం జరిగింది. 2021 ఫిబ్రవరి 24వ తేదీ నాటికి జన్ ధన్ యోజన కింద అకౌంట్ల సంఖ్య 41.93 కోట్లుగా పేర్కొంది. ఇందులో 23.21 కోట్లు మహిళలకు చెందినవని వివరించింది. ముద్రా యోజన ద్వారా మహిళలకు రూ.6.36 లక్షల కోట్లు కాగా, ప్రధానమంత్రి ముంద్ర యోజన (పీఎంఎంవై) అకౌంట్ల విషయంలో 68శాతం(19.04 కోట్లు)తో మహిళలే మందున్నారని ఆర్థికశాఖ ప్రకటన పేర్కొంది. 2021 ఫిబ్రవరి 26వ తేదీనాటికి రూ.6.36 లక్షల కోట్లను మహిళా పారిశ్రామికవేత్తలకు మంజూరు చేసినట్లు తెలిపింది. 2015 ఏప్రిల్ 8వ తేదీన ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. లఘు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షలవరకూ రుణం అందజేయాలన్నది ఈ పథకం ఉద్దేశ్యం. వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్బీలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఈ రుణాలను మంజూరుచేస్తాయి. స్టాండ్–అప్ ఇండియా స్కీమ్‌లోనూ అగ్రస్థానం స్టాండ్–అప్ ఇండియా స్కీమ్‌కు సంబంధించి 81 శాతానికిపైగా (91,109 అకౌంట్లు) అకౌంట్ల విషయంలో రూ.20,749 కోట్లను మహిళలకు మంజూరుచేసినట్లు ఆర్థికశాఖ పేర్కొంది. 2016 ఏప్రిల్ 5వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. క్రింది స్థాయి మహిళలు, బలహీన వర్గాల ఆర్థిక సాధికారత, ఉపాధి కల్పన లక్ష్యంగా 2016 ఏప్రిల్ 5న ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం బ్యాంక్ ద్వారా కింద రూ.10 లక్షల నుంచి కోటి వరకూ రుణ సౌలభ్యం పొందే వెసులుబాటు ఉంది. ప్రత్యేకించి మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చాలన్నది లక్ష్యం. -
రూ.6 వేల కోట్లకు ‘జన ధన’ డిపాజిట్లు
మంగళూర్: ప్రధానమంత్రి జనధన యోజన కింద ప్రారంభమైన అకౌంట్ల ద్వారా ఇప్పటికి దాదాపు రూ.6,000 కోట్ల డిపాజిట్ల సేకరణ జరిగింది. మొత్తం దాదాపు 7.9 కోట్ల అకౌంట్లు ప్రారంభమయ్యాయి. ఈ యోజన కింద వచ్చే ఏడాది జనవరి 26 నాటికి 7.5 కోట్ల అకౌంట్లు ప్రారంభం కావాలన్నది కేంద్రం లక్ష్యం కాగా, ఇప్పటికే ఈ సంఖ్యను అధిగమించడం సానుకూలాంశం. ఆర్థిక సేవల శాఖ అదనపు కార్యదర్శి స్నేహలతా శ్రీవాస్తవ మంగళవారం ఈ విషయాలను వెల్లడించారు. ఆమె అంతకుముందు మంగళూరులో కార్పొరేషన్ బ్యాంక్ నిర్వహించిన జనధన యోజన మెగా ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్పొరేషన్ బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్ఆర్ బన్సాల్ మాట్లాడుతూ, ఈ యోజన కింద తమ బ్యాంక్ ఇప్పటివరకూ 12.83 లక్షల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లను ప్రారంభించిందన్నారు. రెండవ దశపై దృష్టి...: జన ధన మొదటిదశ విజయవంతమయిన నేపథ్యంలో ఇక రెండవ దశపై కేంద్రం ఇప్పటికే దృష్టి సారించింది. రెండవ దశ జనవరి 26 నుంచీ ప్రారంభం కానుంది. ఈ దశలో ఖాతాదారులకు అమ్మాల్సిన సూక్ష్మ బీమా ప్రొడక్టులను ఖరారు చేయాలని దేశంలో దిగ్గజ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ, ప్రభుత్వ రంగంలోని సాధారణ బీమా సంస్థలకు ఇప్పటికే కేంద్రం సూచించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలన్న లక్ష్యంగా ఆగస్టు 28న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. బ్యాంకు ఖాతా ఉన్న వారు కూడా జనవరి 26లోగా తమ బ్యాంకు శాఖల నుంచి రూపే కార్డు తీసుకుంటే జన ధన యోజన కింద ఇస్తున్న రూ. 1 లక్ష ప్రమాద బీమా, రూ. 30,000 జీవిత బీమా పొందడానికి అర్హులవుతారు. ఆధార్ అనుసంధాన అకౌంట్లకు రూ.5,000 ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం (అకౌంట్ నిర్వహణ ప్రాతిపదికగా) కల్పించడం ఈ పథకం ప్రత్యేకత. -
జన ధన ‘లైఫ్’ ప్రీమియం కోసం రూ. 50 కోట్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన ధన యోజన(పీఎంజేడీవై) ఖాతాదారులకు జీవిత బీమా కవర్‌కు సంబంధించి ప్రీమియం చెల్లింపు ఏర్పాటును ఆర్థిక శాఖ ఖరారు చేసింది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజ సంస్థ- ఎల్ఐసీతో సంప్రదింపుల అనంతరం ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎల్ఐసీ నిర్వహిస్తున్న రూ.1,800 కోట్ల సామాజిక భద్రతా నిధి(ఎస్ఎస్ఎఫ్) నుంచి రూ.50 కోట్లను ప్రత్యేకంగా పీఎంజేడీవై పథకం ప్రీమియం కోసం కేటాయింపులు జరిగాయి. ఈ నిర్ణయాన్ని త్వరలో ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆమోదించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, ఆగస్టు 28న ప్రవేశపెట్టిన జన ధన యోజన కింద వచ్చే ఏడాది జనవరి 26 నాటికి బ్యాంక్ అకౌంట్ ప్రారంభించిన వారు రూ. 30,000 జీవిత బీమా పొందడానికి అర్హులవుతారు. అప్పటికి 7.5 కోట్ల అకౌంట్లు తెరవడం ప్రభుత్వ లక్ష్యం అని ఇప్పటికే ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. సెప్టెంబర్ 8 నాటికి బ్యాంకులు ఈ పథకం కింద దాదాపు 3.02 కోట్ల అకౌంట్లు ప్రారంభించాయి. -
'జన్ ధన్' కోసం ఘర్షణ, కాల్పులు
లక్నో: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఎగబడడంతో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో మహిళతో పాటు ముగ్గురు గాయపడ్డారు. ముఫార్డ్ గంజ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ వద్ద గురువారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బ్యాంకు ఖాతాల కోసం పేద ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడకు తరలివచ్చారు. క్యూ లైను నుంచి ఇద్దరు యువకులను గెంటేయడంతో గొడవ ప్రారంభమైంది. వారిపై దాడి జరగడంతో ఓ యువకుడు కాల్పులు జరిపాడు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకామె పరిస్థితి విషమంగా ఉంది. -
'అభివృద్ధి కోసం ఐదు గ్రిడ్ లు ఏర్పాటు'
రాజమండ్రి: రాష్ట్ర అభివృద్ధి కోసం ఐదు గ్రిడ్ లు ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వాటర్, పవర్, గ్యాస్, బ్రాడ్ బ్యాంగ్ గ్రిడ్ లు నెలకొల్పుతామని చెప్పారు. ప్రధానమంత్రి జనధన యోజన కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీయిచ్చారు. ఇసుక ర్యాంపుల నిర్వహణ డ్వాక్రా సంఘాలకు అప్పగించి వచ్చే లాభంలో 25 శాతం వాటికే ఇస్తామని వెల్లడించారు. రుణమాఫీకి బ్యాంకులు సహకరించాలని చంద్రబాబు కోరారు. -
స్పీకర్ హుందాగా ఉండాలి: మేకపాటి
నెల్లూరు: వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో రైతులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మభ్యపెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. శాసనసభలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు హుందాగా వ్యవహరించాలని సూచించారు. నిష్పక్షపాతంగా ఉండాలన్నారు. ప్రధానమంత్రి జనధన యోజన కార్యక్రమాన్ని నెల్లూరులో గురువారం మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు. -
జయలలితతో రవిశంకర్ ప్రసాద్ భేటీ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం కలిశారు. ఆమెతో చర్చలు జరిపిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి జనధన యోజన గురించి జయలలితకు వివరించినట్టు మంత్రి తెలిపారు. ఈ పథకం వల్ల ప్రజలకు కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి కూడా చెప్పానని అన్నారు. ప్రధానమంత్రి జనధన యోజన పథకాన్ని ఈ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రారంభించారు. 'డిజిటల్ ఇండియా' కార్యక్రమం ద్వారా సాంకేతిక ఫలితాలు సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.