రూ.6 వేల కోట్లకు ‘జన ధన’ డిపాజిట్లు | Banks collect Rs 6,000 crore in deposits from 7.9 crore accounts under Jan Dhan Yojana | Sakshi
Sakshi News home page

రూ.6 వేల కోట్లకు ‘జన ధన’ డిపాజిట్లు

Published Wed, Nov 26 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

రూ.6 వేల కోట్లకు ‘జన ధన’ డిపాజిట్లు

రూ.6 వేల కోట్లకు ‘జన ధన’ డిపాజిట్లు

మంగళూర్: ప్రధానమంత్రి జనధన యోజన కింద ప్రారంభమైన అకౌంట్ల ద్వారా ఇప్పటికి దాదాపు రూ.6,000 కోట్ల డిపాజిట్ల సేకరణ జరిగింది. మొత్తం దాదాపు 7.9 కోట్ల అకౌంట్లు ప్రారంభమయ్యాయి. ఈ యోజన కింద  వచ్చే ఏడాది జనవరి 26 నాటికి 7.5 కోట్ల అకౌంట్లు ప్రారంభం కావాలన్నది కేంద్రం లక్ష్యం కాగా,  ఇప్పటికే ఈ సంఖ్యను అధిగమించడం సానుకూలాంశం. ఆర్థిక సేవల శాఖ అదనపు కార్యదర్శి స్నేహలతా శ్రీవాస్తవ మంగళవారం ఈ విషయాలను వెల్లడించారు.  

ఆమె అంతకుముందు మంగళూరులో కార్పొరేషన్ బ్యాంక్ నిర్వహించిన జనధన యోజన మెగా ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్పొరేషన్ బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్‌ఆర్ బన్సాల్ మాట్లాడుతూ, ఈ యోజన కింద తమ బ్యాంక్ ఇప్పటివరకూ 12.83 లక్షల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లను ప్రారంభించిందన్నారు.

 రెండవ దశపై దృష్టి...: జన ధన మొదటిదశ విజయవంతమయిన నేపథ్యంలో ఇక రెండవ దశపై కేంద్రం ఇప్పటికే దృష్టి సారించింది. రెండవ దశ జనవరి 26 నుంచీ ప్రారంభం కానుంది. ఈ దశలో ఖాతాదారులకు అమ్మాల్సిన సూక్ష్మ బీమా ప్రొడక్టులను ఖరారు చేయాలని దేశంలో దిగ్గజ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ, ప్రభుత్వ రంగంలోని సాధారణ బీమా సంస్థలకు ఇప్పటికే  కేంద్రం సూచించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలన్న లక్ష్యంగా ఆగస్టు 28న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు.

 బ్యాంకు ఖాతా ఉన్న వారు కూడా జనవరి 26లోగా తమ బ్యాంకు శాఖల నుంచి రూపే కార్డు తీసుకుంటే జన ధన యోజన కింద ఇస్తున్న రూ. 1 లక్ష ప్రమాద బీమా, రూ. 30,000 జీవిత బీమా పొందడానికి అర్హులవుతారు. ఆధార్ అనుసంధాన అకౌంట్లకు  రూ.5,000 ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం (అకౌంట్ నిర్వహణ ప్రాతిపదికగా) కల్పించడం ఈ పథకం ప్రత్యేకత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement