ఆ లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి...
క్యూ3 జీడీపీ గణాంకాలపై ఫిచ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మూడవ త్రైమాసిక గణాంకాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ఫిచ్ పేర్కొంది. ఈ గణాంకాలు వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా ఉన్నాయని ఫిచ్ తాజా నివేదిక ఒకటి విశ్లేషించింది. మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–నవంబర్–డిసెంబర్) జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. అయితే రూ.500, రూ.1,000 రద్దు ప్రతికూలతను ఎదుర్కొన్న ఈ త్రైమాసికంలో 7 శాతం వృద్ధి నమోదుకావడం పలువురు ఆర్థిక విశ్లేషకులకు ఆశ్చర్యాన్ని మిగిల్చింది.
ఇప్పుడు తాజాగా ఫిచ్ సైతం ఇదే వ్యాఖ్యలు చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. డీమోనిటైజేషన్ సమయంలో వాస్తవంగా సేవలు అలాగే వినియోగ డిమాండ్ తీవ్ర విఘాతానికి గురయిన సంగతినీ ఫిచ్ ప్రస్తావించింది. దీనికి విరుద్ధంగా ప్రైవేటు డిమాండ్ భారీగా 10 శాతం పెరిగిందని అధికారిక క్యూ3 గణాంకాలు పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తున్నట్లు వివరించింది. తన తాజా గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌లుక్ (జీఈఓ) నివేదికలో ఈ అంశాలను ఫిచ్ ప్రస్తావించింది.
వచ్చే మూడేళ్లలో వృద్ధి 7 శాతం పైనే...
క్యూ3 జీడీపీ గణాంకాలపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17) వృద్ధి 7.1 శాతం ఆ తరువాతి రెండు ఆర్థిక సంవత్సరాల్లో 7.7 శాతం వృద్ధి నమోదవుతుందని ఫిచ్ అంచనా వేసింది. వ్యవస్థాగత సంస్కరణలను క్రమంగా అమలులోకి తీసుకురావడం భవిష్యత్తులో వృద్ధికి దహదపడే అంశమని ఫిచ్ విశ్లేషణ వివరించింది. దీనికితోడు దాదాపు 24 శాతం మేర పెరిగిన ఉద్యోగుల వేతనాలు, భారీ వ్యయ అవకాశాలు మొత్తంగా దేశంలో వృద్ధి మెరుగుదలకు దోహపడే అంశాలని పేర్కొంది.
నోట్ల రద్దు నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు: బాష్
కాగా, భారత్ పరిశ్రమలు పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని జర్మన్ ఆటో కంపోనెంట్ తయారీ సంస్థ– బాష్ భారత్ హెడ్ సౌమిత్రా భట్టాచార్య పేర్కొన్నారు. పూర్తి మామూలు పరిస్థితికి మరో రెండు నెలలు పట్టే వీలుందనీ విశ్లేషించింది.