డబ్ల్యూఈఎఫ్ ‘యంగ్ గ్లోబల్ లీడర్స్’లో ఐదుగురు భారతీయులు
న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వంద మంది యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితా–2017లో ఐదుగురు భారతీయులు స్థానం దక్కించుకున్నారు. వీరిలో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ.. హాస్పిటాలిటీ బ్రాండ్ తమర కూర్జ్ డైరెక్టర్ శ్రుతి శిబులాల్ ఉన్నారు. వీరితోపాటు బ్లిప్పర్ వ్యవస్థాపకుడు అంబరిశ్ మిత్రా, ఫార్చూన్ ఇండియా ఎడిటర్ హిందోల్ సేన్‌గుప్తా, స్వానిటి ఫౌండేషన్ సీఈవో రిత్విక భట్టాచార్య కూడా జాబితాలో స్థానం పొందారు. కాగా డబ్ల్యూఈఎఫ్ ప్రతి ఏడాది 40 ఏళ్లలోపు వయస్సున్న 100 మందితో ఈ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. వినూత్నమైన ఆవిష్కరణలతో ప్రపంచంలోని క్లిష్టమైన సవాళ్లకు పరిష్కారం చూపిన వారికి సంస్థ ఈ జాబితాలో స్థానం కల్పిస్తుంది.