breaking news
Young Global Leaders
-
యంగ్ గ్లోబల్ లీడర్స్‌లో హైదరాబాదీ!
న్యూఢిల్లీ: ఇప్పటివరకు నోబెల్ బహుమతి గ్రహీతలు, పులిట్జర్ అవార్డ్ విజేతలు, దేశాధినేతలు, కంపెనీ సీఈఓలు చోటు దక్కించుకున్న యంగ్ గ్లోబల్ లీడర్స్ (వైజీఎల్)లో 2021 సంవత్సరానికి గాను హైదరాబాద్‌కు చెందిన బోలంట్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ సీఈఓ శ్రీకాంత్ బొల్లా ఎంపికయ్యారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్రెయిన్ అండ్ కాగ్నిటివ్ సైన్స్ అండ్ బిజినెస్‌లో తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థి అయిన శ్రీకాంత్ 2012లో హైదరాబాద్ కేంద్రంగా పర్యావరణహితమైన ప్యాకేజింగ్ కంపెనీ బోలంట్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించారు. ఇందులో పనిచేసేవారంతా ఏదో ఒక అంగవైకల్యం ఉన్నవారే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో జన్మించిన ఈయన హైదరాబాద్‌లోని దేవ్నార్ బ్లైండ్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. మన దేశంలో ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్ అధ్యయనం చేసిన మొదటి విద్యార్థి కూడా శ్రీకాంతే. వైజీఎల్–2021లో బెంగళూరు కేంద్రంగా పిల్లల మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టే లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ ఫౌండర్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి దీపికా పదుకొనే కూడా ఎంపికయ్యారు. -
డబ్ల్యూఈఎఫ్ ‘యంగ్ గ్లోబల్ లీడర్స్’లో ఐదుగురు భారతీయులు
న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వంద మంది యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితా–2017లో ఐదుగురు భారతీయులు స్థానం దక్కించుకున్నారు. వీరిలో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ.. హాస్పిటాలిటీ బ్రాండ్ తమర కూర్జ్ డైరెక్టర్ శ్రుతి శిబులాల్ ఉన్నారు. వీరితోపాటు బ్లిప్పర్ వ్యవస్థాపకుడు అంబరిశ్ మిత్రా, ఫార్చూన్ ఇండియా ఎడిటర్ హిందోల్ సేన్‌గుప్తా, స్వానిటి ఫౌండేషన్ సీఈవో రిత్విక భట్టాచార్య కూడా జాబితాలో స్థానం పొందారు. కాగా డబ్ల్యూఈఎఫ్ ప్రతి ఏడాది 40 ఏళ్లలోపు వయస్సున్న 100 మందితో ఈ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. వినూత్నమైన ఆవిష్కరణలతో ప్రపంచంలోని క్లిష్టమైన సవాళ్లకు పరిష్కారం చూపిన వారికి సంస్థ ఈ జాబితాలో స్థానం కల్పిస్తుంది.