సారీ.. ఫెయిలయ్యాం: ఫ్లిప్‌కార్ట్
అంచనాలు అందుకోలేకపోయాం
బిగ్ బిలియన్ డే వైఫల్యంపై ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం
న్యూఢిల్లీ: బిగ్ బిలియన్ డే పేరిట నిర్వహించిన సేల్స్ స్కీమ్‌పై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ .. కొనుగోలుదారులకు క్షమాపణలు చెప్పింది. పనితీరులో అంచనాలను అందుకోవడంలో విఫలమైనట్లు పేర్కొంది. ఈసారి మరింత మెరుగ్గా నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. ‘ఇంత పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు మాపై విశ్వాసముంచడం సంతోషం కలిగించింది. అయితే, మా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయాలనుకున్న మరెన్నో కోట్ల మంది అంచనాలకు తగ్గట్లుగా పనితీరు కనపర్చలేకపోవడం మమ్మల్ని నిరాశపర్చింది. ఇది మాకు ఎంత మాత్రం ఆమోదయోగ్యంగా లేదు.
ఇకపై ఇలా జరగకుండా, మా బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంటున్నాం. ఈసారి మరింత మెరుగ్గా నిర్వహిస్తాం’ అంటూ ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ కస్టమర్లకు సంయుక్తంగా పంపిన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. కస్టమర్ల నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా స్పందన కనిపించిందని, ఇంత భారీ స్థాయిలో ట్రాఫిక్‌ను ఊహించకపోవడంతో తగినన్ని ఏర్పాట్లు చేసుకోలేకపోయామని చెప్పారు. అవసరానికి తగ్గ స్థాయిలో ఉత్పత్తులను అందుబాటులో ఉంచలేకపోయామని పేర్కొన్నారు. తాము సాధ్యమైనంత వరకూ పలు ఉత్పత్తులను వందలు, లక్షల సంఖ్యలో అందుబాటులో ఉంచినప్పటికీ.. అవి ఏ మూలకు సరిపోలేదన్నారు.
ఇకపై మరిన్ని జాగ్రత్తలు..: సర్వర్‌పై ఒక్కసారిగా భారం పడటంతో వెబ్‌సైట్ పలుమార్లు క్రాష్ కావడం, షాపింగ్ అనుభూతిపై ప్రతికూల ప్రభావం చూపడం జరిగిందని సచిన్, బిన్నీ తెలిపారు. దీనివల్ల కొనుగోలుదారులు తమపై ఉంచిన నమ్మకం సడలిపోతుంది కనుక.. ఇకపై ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అవుటాఫ్ స్టాక్ సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తామని వారు వివరించారు.
భారీ అమ్మకాలు..
పండుగ సీజన్ సందర్భంగా ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు భారీ స్థాయిలో డిస్కౌంట్లు ఆఫర్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 6న ఒక్క రోజే చెరి రూ. 600 కోట్ల మేర వ్యాపారం చేసినట్లు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వెల్లడించాయి. ఫ్లిప్‌కార్ట్ 6వ తారీఖు ఉదయం 8 నుంచి మర్నాడు ఉదయం 8 గం.ల దాకా బిగ్ బిలియన్ డే పేరుతో నిర్వహించిన సేల్‌లో దాదాపు 15 లక్షల మంది పైగా కొనుగోలుదారులు షాపింగ్ చేసినట్లు అంచనా. కేవలం పది గంటల్లోనే రూ. 600 కోట్ల విలువ చేసే ఉత్పత్తులను విక్రయించినట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.
ఈ లెక్కన చూస్తే.. రూ. 18,000 కోట్ల వార్షిక అమ్మకాల లక్ష్యాన్ని సులువుగా సాధించవచ్చని అంచనాలు నెలకొన్నాయి. అటు స్నాప్‌డీల్ సైతం నిమిషానికి రూ. 1 కోటి మేర విక్రయాలు జరిపినట్లు చెప్పుకొచ్చింది. అయితే, సదరు కంపెనీలు తమ డిస్కౌంట్ స్కీములు భారీగా హిట్టయ్యాయి అంటున్నా.. మెజారిటీ షాపర్లు ఫ్లాప్ ముద్ర వేశారు.
ఫిర్యాదుల వెల్లువ ..
బిగ్ బిలియన్ డేలో ఫ్లిప్‌కార్ట్.. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, బంగారం నాణేలు, ఇతరత్రా ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఉదాహరణకు నోకియా 1020 మొబైల్‌ని రూ. 19,999కే అందిస్తున్నట్లు పేర్కొంది. ఇది సదరు మొబైల్ అసలు లాంచింగ్ ధర కన్నా 60% తక్కువ. అలాగే, రూ. 13,990 విలువ చేసే శామ్‌సంగ్ ట్యాబ్2ని అసలు ధరలో పదో వంతు రూ. 1,390కే అందిస్తున్నామంటూ ఫ్లిప్‌కార్ట్ ఊదరగొట్టింది. కొందరు కస్టమర్లకు డిస్కౌం ట్లపై కొన్ని ఉత్పత్తులు లభించినా.. మిగతా వారి నుంచి బిగ్ బిలియన్ డేపై భారీ స్థాయిలోనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
పేరుకు డిస్కౌంటు ఆఫర్ అయినా ఒకే ఉత్పత్తి వివిధ సమయాల్లో వివిధ రకాల రేట్లలో దర్శనమివ్వడం ఇందుకు కారణం. పెపైచ్చు వెబ్‌సైట్ క్రాష్ కావడం పలువురికి అసహనం కలిగించింది. అయి తే, 100 కోట్లకు పైగా హిట్స్ రావడంతో సాంకేతిక సమస్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఫ్లిప్‌కార్ట్ సమర్థించుకుంది. బిగ్ బిలియన్ డే భారీ ఈవెంట్ కోసం సాధారణం కంటే 20 రెట్లు అధిక ట్రాఫిక్‌ను అంచనా వేసి 5,000 సర్వర్లను ఉపయోగించినట్లు పేర్కొంది.