ఫ్లిప్‌కార్ట్ భారీ రియల్టీ డీల్
30 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకున్న ఈ కామర్స్ దిగ్గజం
ఏటా రూ. 300 కోట్ల కిరాయి
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. తాజాగా భారీ రియల్టీ డీల్‌కు తెరతీసింది. తమ కార్యకలాపాల కోసం బెంగళూరులో 30 లక్షల చ.అ. ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీనికి ఏటా రూ. 300 కోట్ల అద్దె చెల్లించనుంది. ఇందుకు సంబంధించి బెంగళూరుకి చెందిన రియల్టీ సంస్థ ఎంబసీ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆసక్తి వ్యక్తీకరణ పత్రంపై సంతకాలు చేసింది. 90 రోజుల్లోగా తుది ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుందని ఈ డీల్ విషయంలో తోడ్పాటు అందించిన ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ ఇండియా కంట్రీ హెడ్ అనుజ్ పురి తెలిపారు.
దేశీయంగా రియల్ ఎస్టేట్ ఆఫీస్ మార్కెట్ రికవరీ బాట పడుతోందనడానికి ఈ డీల్ నిదర్శనమని ఆయన వివరించారు. ఈ ఒప్పందం ఒక కొలిక్కి రావడానికి దాదాపు ఏడాది పైగా పట్టిందని పురి చెప్పారు. మొత్తం 10 మంది డెవలపర్లను షార్ట్‌లిస్ట్ చేసి, చివరికి ఎంబసీ గ్రూప్‌ను ఎంపిక చేసినట్లు వివరించారు. అయితే, దీనిపై స్పందించడానికి ఫ్లిప్‌కార్ట్ నిరాకరించింది. స్నాప్‌డీల్, అమెజాన్ తదితర షాపింగ్ సైట్లతో పోటీపడేందుకు ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాలు భారీగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాగంగా ఈ ఏడాది 12,000 మంది ఉద్యోగులను కూడా తీసుకోనుంది.
చ.అ.కు నెలకు రూ. 90 అద్దె..
30 లక్షల చ. అ. ఆఫీస్ స్థలాన్ని ఫ్లిప్‌కార్ట్‌కు దశలవారీగా లీజుకు అందచేస్తామని ఎంబసీ గ్రూప్ సీఎండీ జితు విర్వానీ తెలిపారు. ఫుల్లీ ఫర్నిష్డ్ ఆఫీస్ స్పేస్‌కి అద్దె నెలకు చ.అ.కు రూ. 90గా ఉంటుందని విర్వానీ పేర్కొన్నారు. 24 నెలల్లో ప్రాథమికంగా 15 లక్షల చ.అ. స్థలాన్ని అందచేస్తామన్నారు. ఆ తర్వాత 3-5 ఏళ్లలో 32.5 లక్షల చ.అ.కు పెంచే అవకాశం ఉందని తెలిపారు. బెంగళూరులోని అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ‘ఎంబసీ ఆఫీస్ పార్క్’ పేరిట ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌తో కలిసి ఎంబసీ గ్రూప్ నిర్మిస్తున్న ప్రాజెక్టులో ఈ ఆఫీస్ స్పేస్ ఉంటుంది.