ఆ విలీనాన్ని పూర్తిచేసిన ఫ్లిప్‌కార్ట్
ఆ విలీనాన్ని పూర్తిచేసిన ఫ్లిప్‌కార్ట్
Published Tue, Aug 1 2017 11:26 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, ఈబే ఇండియా కార్యకలాపాలను పూర్తిగా తనలో కలిపేసుకుంది. ఈ విలీనాన్ని విజయవంతగా పూర్తిచేయడంతో ఈబే.ఇన్ ఇక ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ కంపెనీగా మారినట్టు ఈకామర్స్ దిగ్గజం ప్రకటించింది. గత ఏప్రిల్ నెలలో ఈ డీల్‌ను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఈ కంపెనీలో మైక్రోసాఫ్ట్, ఈబే, టెన్ సెంట్ కంపెనీలు దాదాపు రూ.9,030 కోట్లను పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్‌లో విలీనమయ్యే అన్ని చర్చలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ఒక్క రోజుల్లోనే ఈబే విలీనం పూర్తయిన ప్రకటనను ఈ ఈ-కామర్స్ దిగ్గజం వెలువరించింది. గత ఐదు నెలలుగా జరుగుతున్న విలీన చర్చలను ఆపివేస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేరును ప్రస్తావించకుండా స్నాప్‌డీల్ సోమవారం ఓ ప్రకటనను వెలువరించిన సంగతి తెలిసిందే.
వెంటనే ఫ్లిప్‌కార్ట్ కూడా ఈబే.ఇన్ ఇండియా విలీనాన్ని తాము పూర్తిచేసినట్టు, ఫ్లిప్‌కార్ట్‌లో భాగంగా ఓ స్వతంత్ర సంస్థగా ఈబే కార్యకలాపాలు నిర్వహించనున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు ప్రొడక్ట్ ఛాయిస్‌లు పెరుగుతాయి. ఈబేలో గ్లోబల్ ఇన్వెంటరీ కూడా లభ్యమవుతోంది. ఈ భాగస్వామ్యంతో అంతర్జాతీయంగా తమ విక్రయాలను పెంచుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్ విక్రయదారులకు ఎంతో సహకరించనుంది. అటు ఫ్లిప్ కార్ట్ వినియోగదారులు అంతర్జాతీయ ఈబే ఉత్పత్తులను, ఇటు ఈబే వినియోగదారులు ఫ్లిప్ కార్ట్ దేశీయ ఉత్పత్తులను కొనుగోలుచేసేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఉన్నతమైన ఈకామర్స్ అనుభవాన్ని కోరుకునే భారతీయ కస్టమర్లకు, విక్రయదారులకు తాము కలిసి నడవడం ఎంతో ప్రయోజానాన్ని చేకూరుస్తుందని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు.
Advertisement
Advertisement