ebay India
-
1,000 మంది ఉద్యోగులను తొలగించిన మరో దిగ్గజ కంపెనీ!
ఐటీ కంపెనీల్లో ఇటీవల కాలంలో ఉద్యోగాల తొలగింపు పదం తరచూ వినిపిస్తోంది. అమెరికా టెక్ కంపెనీలు మెటా, ట్విటర్, గూగుల్ వంటివి ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. 2023లో భారత టెక్నాలజీ కంపెనీలు 2022తో పోలిస్తే అత్యధిక మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించినట్లు ఇటీవలే లేఆఫ్స్.ఎఫ్‌వైఐ నివేదిక తెలిపింది. 2023లో దాదాపు 14,418 మందికి వివిధ సంస్థలు ఉద్వాసన పలికినట్లు ఈ నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఈ సంఖ్య 14,224గా ఉంది. 2024లో ఈ పర్వం కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ 1000 మంది ఉద్యోగులును తొలిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఈబే లేఆఫ్ ప్రకటించింది. వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. రాబోయే నెలల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసనపలికే అవకాశం ఉన్నట్లు ఈబే ప్రెసిడెంట్, సీఈవో జామీ ఇయానోన్ పేర్కొన్నారు. గత త్రైమాసికంలో కంపెనీ 1.3 బిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేసినప్పటికీ సంస్థలో కొన్ని మార్పులు అవసరమని భావిస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తొలగింపు విషయాన్ని ఇ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది. ఇదీ చదవండి: జనరేటివ్ ఏఐతో కొత్త ఉద్యోగాలు కంపెనీ లక్ష్యాలకు వ్యతిరేకంగా పరిస్థితులు మారినప్పుడు వ్యాపార వృద్ధిని మించి ఉద్యోగులు, ఖర్చులు ఉంటాయి. దాంతో కంపెనీకు మరింత నష్టం వాటిల్లుతుందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని ప్రధాన మార్పులు అవసరం అవుతాయి. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది. -
పాత వస్తువులు కొత్తగా.. ఫ్లిప్‌కార్ట్ న్యూ ప్లాట్‌ఫామ్
బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ మెజార్టీ వాటాను కొనుగోలు చేసిన అనంతరం.. పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్ అంతకముందు తాను దక్కించుకున్న ఈబే ఇండియాను మూసివేసింది. ఈబేను మూసివేసిన ఫ్లిప్‌కార్ట్.. రీఫర్బిష్డ్ గూడ్స్(పాతవాటినే మళ్లీ కొత్తగా మార్చిన వస్తువుల) కోసం సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను తెరిచింది. అదే 2గుడ్. రీఫర్బిష్డ్ గూడ్స్ కోసం కంపెనీ ఏర్పాటు చేసిన తొలి ప్లాట్‌ఫామ్. వచ్చే ఐదు నుంచి ఆరేళ్లలో ఈ మార్కెట్ 20 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ ఈ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ 2గుడ్ ప్లాట్‌ఫామ్ తొలుత రీఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఎలక్ట్రానిక్ యాక్ససరీస్‌ను అందుబాటులో ఉంచనుంది. ఆ తర్వాత హోమ్ అప్లియెన్స్‌కు కూడా దీన్ని విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ ప్లాట్‌ఫామ్ లైవ్‌గా కస్టమర్లకు అందుబాటులో ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ 2గుడ్ వస్తువును కొనుగోలు చేసిన తర్వాత 3 నెలల నుంచి 12 నెలల వారెంటీ ఇస్తుంది. మొబైల్ వెబ్ ద్వారా మాత్రమే తొలుత ఇది అందుబాటులో ఉంటుంది. కానీ తర్వాత తర్వాత డెస్క్‌టాప్ వెబ్ ఇంటర్ఫేస్, మొబైల్ యాప్ యూజర్లకు కూడా చేరువ చేయాలని ఫ్లిప్‌కార్ట్ యోచిస్తోంది. ఈబే ఇండియాను మూసివేసే సమయంలో ఈ కొత్త ప్లాట్‌ఫామ్ గురించి ఆ కంపెనీ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి ప్రస్తావించారు. ఈబే.ఇన్ నుంచి పలు విషయాలు బోధపడ్డాయని, అవే రీఫర్బిష్డ్ గూడ్స్ కోసం కొత్త ప్లాట్‌ఫామ్‌కు దోహదం చేసిందని పేర్కొన్నారు. ఆగస్టు 14 నుంచి ఈబే ఇండియా అధికారికంగా మూతపడింది. మార్కెట్ లీడర్‌గా.. ఫ్లిప్‌కార్ట్ మరింత షాపింగ్ అనుభవాన్ని అందించడానికే కృషిచేస్తుందన్నారు. రీఫర్బిష్డ్ గూడ్స్ మార్కెట్ విషయంలో ఉన్న నమ్మకపు లోపాన్ని తాము 2గుడ్ ద్వారా తొలగించనున్నామని పేర్కొన్నారు. సరసమైన ధరల్లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అందజేస్తామని కల్యాణ్ కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. -
ఈబే ఇండియా ఇక లేదు
బెంగళూరు : చాలా సంవత్సరాలుగా భారత్ ఈ-కామర్స్ మార్కెట్లో తన సేవలను అందించిన ఆన్లైన్ సంస్థ ఈబే.ఇన్ మూతపడింది. నేటి నుంచి అంటే ఆగష్టు 14 నుంచి తన ఈబే.ఇన్ కార్యకలాపాలను దిగ్గజ ఈ-రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ మూసివేసింది. అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటా దక్కించుకున్న మూడు నెలల అనంతరం ఫ్లిప్‌కార్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ‘క్షమించండి, ఈబే.ఇన్‌లో ఇక ఏ లావాదేవీలు జరుపడానికి వీలుండదు. కానీ ఆందోళన చెందాల్సివసరం లేదు. ఫ్లిప్‌కార్ట్ త్వరలో మరో కొత్త బ్రాండ్ షాపింగ్ అనుభవాన్ని అందించనుంది’ అని ఈబే ఇండియా తన వెబ్సైట్లో పేర్కొంది. ఏ కొత్త ఆర్డర్లను ఇక ఈబే స్వీకరించదు. కొనుగోలుదారులు తమ క్లయిమ్స్‌ను పొందడానికి చివరి తేదీ ఆగస్టు 30గా కంపెనీ నిర్ణయించింది. జూలై 26 నుంచే 250 రూపాయల కంటే తక్కువ, 8000 రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగిన ఉత్పత్తులను డీలిస్ట్ చేయడం ప్రారంభించింది. కాగా, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సంవత్సరం క్రితం 1.4 బిలియన్ డాలర్లకు ఈబేను కొనుగోలు చేసింది. 1995లో ఈబేను స్థాపించారు. ఇది కాలిఫోర్నియాకు చెందినది. 2004లో ఈబే భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే ఈబే బ్రాండ్‌ను మూసేసి.. ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్ పైనే కొత్త పేరుతో ఈబే అమ్మకాలను సాగించాలని ఫ్లిప్‌కార్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే కొత్త వెబ్సైట్ లాంచింగ్‌పై మాత్రం ఫ్లిప్‌కార్ట్ స్పందించలేదు. -
ఫ్లిప్‌కార్ట్‌లో ఈబే ఇండియా విలీనం పూర్తి
న్యూఢిల్లీ: దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈబే ఇండియా కార్యకలాపాల విలీనం పూర్తయినట్టు కంపెనీ ప్రకటించింది. ఇక నుంచి ‘ఈబే డాట్ ఇన్’ ఫ్లిప్‌కార్టు గ్రూపు కంపెనీగా స్వతంత్రంగా కొనసాగుతుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఈ ఒప్పందం ఈ ఏడాది ఏప్రిల్‌లో కుదిరింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈబే 500 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడంతోపాటు ‘ఈబే డాట్ ఇన్’ను ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించేందుకు కూడా ఒప్పందం చేసుకుంది. అలాగే, అంతర్జాతీయ లావాదేవీల విషయంలో రెండు సంస్థలు సహకరించుకోనున్నాయి. ఈబేలో లభించే ప్రపంచ వ్యాప్త ఉత్పత్తులు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయని, అదే సమయంలో ఈబే కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ విక్రేతల నుంచి భారతీయ వస్తువుల కొనుగోలుకు వీలు పడుతుందని ఫ్లిప్‌కార్ట్ తన ప్రకటనలో తెలిపింది. ఒక విధంగా ఫ్లిప్‌కార్ట్ ప్లాట్ఫామ్లో నమోదైన విక్రయదారులు తమ ఉత్పత్తులను ఈబే ద్వారా అంతర్జాతీయంగా ఆఫర్ చేసే అవకాశం అందిరానుంది. మరో ప్రత్యర్థి స్నాప్‌డీల్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేయాలనుకోగా... ఆఫర్, షరతులు నచ్చక స్నాప్‌డీల్ చర్చల నుంచి వైదొలగడం విదితమే. ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌తో చైనాకు చెందిన మొబైల్ ఉత్పత్తుల కంపెనీ ట్రాన్సిషన్ హోల్డింగ్స్ చేతులు కలిపింది. నోట్ 4, హాట్ 4 ప్రో మోడళ్లను ‘ఇన్ఫినిక్స్’ బ్రాండ్ కింద ఫ్లిప్‌కార్ట్ వేదికగా భారత్‌లో విక్రయించనుంది. ఇన్ఫినిక్స్ నోట్ 4 మోడల్ ధర రూ.8,999, హాట్ 4 ప్రో మోడల్ ధరను రూ.7,499గా ఖరారు చేసింది. -
ఆ విలీనాన్ని పూర్తిచేసిన ఫ్లిప్‌కార్ట్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, ఈబే ఇండియా కార్యకలాపాలను పూర్తిగా తనలో కలిపేసుకుంది. ఈ విలీనాన్ని విజయవంతగా పూర్తిచేయడంతో ఈబే.ఇన్ ఇక ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ కంపెనీగా మారినట్టు ఈకామర్స్ దిగ్గజం ప్రకటించింది. గత ఏప్రిల్ నెలలో ఈ డీల్‌ను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఈ కంపెనీలో మైక్రోసాఫ్ట్, ఈబే, టెన్ సెంట్ కంపెనీలు దాదాపు రూ.9,030 కోట్లను పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్‌లో విలీనమయ్యే అన్ని చర్చలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ఒక్క రోజుల్లోనే ఈబే విలీనం పూర్తయిన ప్రకటనను ఈ ఈ-కామర్స్ దిగ్గజం వెలువరించింది. గత ఐదు నెలలుగా జరుగుతున్న విలీన చర్చలను ఆపివేస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేరును ప్రస్తావించకుండా స్నాప్‌డీల్ సోమవారం ఓ ప్రకటనను వెలువరించిన సంగతి తెలిసిందే. వెంటనే ఫ్లిప్‌కార్ట్ కూడా ఈబే.ఇన్ ఇండియా విలీనాన్ని తాము పూర్తిచేసినట్టు, ఫ్లిప్‌కార్ట్‌లో భాగంగా ఓ స్వతంత్ర సంస్థగా ఈబే కార్యకలాపాలు నిర్వహించనున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు ప్రొడక్ట్ ఛాయిస్‌లు పెరుగుతాయి. ఈబేలో గ్లోబల్ ఇన్వెంటరీ కూడా లభ్యమవుతోంది. ఈ భాగస్వామ్యంతో అంతర్జాతీయంగా తమ విక్రయాలను పెంచుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్ విక్రయదారులకు ఎంతో సహకరించనుంది. అటు ఫ్లిప్ కార్ట్ వినియోగదారులు అంతర్జాతీయ ఈబే ఉత్పత్తులను, ఇటు ఈబే వినియోగదారులు ఫ్లిప్ కార్ట్ దేశీయ ఉత్పత్తులను కొనుగోలుచేసేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఉన్నతమైన ఈకామర్స్ అనుభవాన్ని కోరుకునే భారతీయ కస్టమర్లకు, విక్రయదారులకు తాము కలిసి నడవడం ఎంతో ప్రయోజానాన్ని చేకూరుస్తుందని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. -
ఈబే టాప్-5 దేశాల్లో భారత్
వాల్యుయేషన్ల కోసం నిధులు సేకరించబోం ఈబే ఇండియా డెరైక్టర్ విద్మయ్ నైని హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేగంగా వృద్ధి చెందుతున్న టాప్-5 దేశాల్లో భారత్ ఒకటని ఈబే ఇండియా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు 15.7 కోట్ల మంది యాక్టివ్ యూజర్లున్నారు. వీరిలో 45 లక్షల మంది భారత్‌కు చెందినవారని ఈబే ఇండియా డెరైక్టర్ విద్మయ్ నైని బుధవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. భారత్‌లో టాప్-6 ఇ-కామర్స్ కేంద్రంగా నిలిచిన హైదరాబాద్ నుంచి 2.7 లక్షల మంది వినియోగదార్లు ఉన్నారని చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కస్టమర్లు 50 శాతంపైగా ఉంటారని అన్నారు. స్మార్ట్ఫోన్ల వాడకం పెరగడం, ఇంటర్నెట్ వ్యయాలు దిగిరావడం, రవాణా సౌకర్యం ఇందుకు కారణాలని వివరించారు. మారుమూల ప్రాంతంలో ఉన్నవారు ఐఫోన్ వంటి ఖరీదైన స్మార్ట్ఫోన్లను సైతం ఒక్క క్లిక్‌తో చేజిక్కించుకుంటున్నారని గుర్తు చేశారు. 50 శాతం ఆర్డర్లు మొబైల్ ద్వారా జరుగుతున్నాయని చెప్పారు. పనితీరు మెరుగుకు.. తాము నిధుల సమీకరణకు దూరమని విద్మయ్ స్పష్టం చేశారు. ఉత్పత్తులను అన్ని దేశాలకూ పరిచయం చేయడం, రవాణా, విక్రేతలకు సులభ వ్యాపార విధానాల అమలుపై తాము పెట్టుబడి పెడతామన్నారు. అయితే పరిశ్రమలో డీప్ (భారీ) డిస్కౌంట్లు కొద్ది కాలమేనని, రానున్న రోజుల్లో విలువకు తగ్గట్టుగా ధరలు ఉంటాయని అన్నారు. రిటర్న్ పాలసీని కొందరు కస్టమర్లు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారని చెప్పారు. కట్టుదిట్టమైన వ్యవస్థతోనే మోసాలను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక రీఫర్బిష్డ్ (పునరుద్ధరించిన) మొబైల్స్‌పై కంపెనీ వారంటీతోపాటు 60 శాతం దాకా డిస్కౌంట్ ఇస్తున్నట్టు చెప్పారు. దీపావళికి నగలు, వాచీలు ఎక్కువగా అమ్ముడయ్యే అవకాశం ఉందన్నారు. -
ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు
న్యూఢిల్లీ: ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే అమ్మకాలను భారత్‌లో పరిచయం చేస్తోంది. షాప్యువర్వరల్డ్డాట్కామ్ సంస్థతో కలిసి ఈ అమ్మకాలను ఆఫర్ చేస్తున్నామని ఈబే ఇండియా డెరైక్టర్, బిజినెస్ హెడ్ విద్మే నైని తెలిపారు. శుక్రవారం నుంచే ప్రారంభమైన ఈ అమ్మకాల ఆఫర్లు ఈ నెల 30 వరకూ అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ ఆఫర్లో భాగంగా అమెరికా ఉత్పత్తులను రూపాయల్లో (అన్ని దిగుమతి సుంకాలు కలుపుకొని) అందిస్తామని, గ్లోబల్ ఈజీ బై ద్వారా కొనుగోలు చేస్తే రవాణా చార్జీలు ఉచితమని పేర్కొన్నారు. దాదాపు 10వేల డీల్స్ అందుబాటులో ఉన్నాయని, టెక్నాలజీ, జీవనశైలి ఉత్పత్తులు 80 శాతం డిస్కౌంట్‌కే లభించే అవకాశాలున్నాయని వివరించారు. అమెరికాలో థాంక్స్ గివింగ్ డే తర్వాత వచ్చే శుక్రవారాన్ని బ్లాక్ ఫ్రైడేగా వ్యవహరిస్తారు. సాధారణంగా క్రిస్మస్ షాపింగ్ సీజన్ ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఈ రోజున కంపెనీలు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తాయి. షాపింగ్ కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. కాగా వచ్చే నెలలో గూగుల్ సంస్థ గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్(జీఓఎస్ఎఫ్) ను ఆఫర్ చేయనున్నది. -
టాటా సఫారి స్టార్మ్ ఆన్లైన్ బ్రాండ్ స్టోర్
హైదరాబాద్: టాటా మోటార్స్, ఈబే ఇండియాలు కలిసి టాటా సఫారి స్టార్మ్ ఆన్లైన్ బ్రాండ్ స్టోర్‌ను ఏర్పాటు చేశాయి. దీంతో దేశవ్యాప్తంగా వినియోగదారులు టాటా సఫారి మర్కండైజ్(లెదర్ కీ-చెయిన్స్, ట్రెక్కింగ్ బ్యాగ్‌లు, టి-షర్ట్స్, క్యాంపింగ్ స్విస్ నైవ్స్, మ్యాగ్నెటిక్ కంపాస్... మొదలైన వస్తువుల)ను ఈబే ఇండియాలో కొనుగోలు చేయవచ్చని ఈబే ఇండియా హెడ్ (స్ట్రాటజీ) రతుల్ ఘోష్ ఒక ప్రకటనలో తెలిపారు. టాటా నానో బ్రాండ్ స్టోర్ విజయవంతం కావడంతో ఆ బాటలోనే సఫారి స్టార్మ్ ఆన్లైన్ బ్రాండ్స్టోర్ను ఏర్పాటు చేశామని వివరించారు. టాటా సఫారి మర్కండైజ్‌ను ఈ ఆన్లైన్ బ్రాండ్ స్టోర్ ద్వారా అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని టాటా మోటార్స్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ హెడ్(ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్) డెల్నా అవ్రి పేర్కొన్నారు.