ఈబే టాప్-5 దేశాల్లో భారత్
వాల్యుయేషన్ల కోసం నిధులు సేకరించబోం
ఈబే ఇండియా డెరైక్టర్ విద్మయ్ నైని
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేగంగా వృద్ధి చెందుతున్న టాప్-5 దేశాల్లో భారత్ ఒకటని ఈబే ఇండియా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు 15.7 కోట్ల మంది యాక్టివ్ యూజర్లున్నారు. వీరిలో 45 లక్షల మంది భారత్‌కు చెందినవారని ఈబే ఇండియా డెరైక్టర్ విద్మయ్ నైని బుధవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. భారత్‌లో టాప్-6 ఇ-కామర్స్ కేంద్రంగా నిలిచిన హైదరాబాద్ నుంచి 2.7 లక్షల మంది వినియోగదార్లు ఉన్నారని చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కస్టమర్లు 50 శాతంపైగా ఉంటారని అన్నారు. స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరగడం, ఇంటర్నెట్ వ్యయాలు దిగిరావడం, రవాణా సౌకర్యం ఇందుకు కారణాలని వివరించారు. మారుమూల ప్రాంతంలో ఉన్నవారు ఐఫోన్ వంటి ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను సైతం ఒక్క క్లిక్‌తో చేజిక్కించుకుంటున్నారని గుర్తు చేశారు. 50 శాతం ఆర్డర్లు మొబైల్ ద్వారా జరుగుతున్నాయని చెప్పారు.
పనితీరు మెరుగుకు..
తాము నిధుల సమీకరణకు దూరమని విద్మయ్ స్పష్టం చేశారు. ఉత్పత్తులను అన్ని దేశాలకూ పరిచయం చేయడం, రవాణా, విక్రేతలకు సులభ వ్యాపార విధానాల అమలుపై తాము పెట్టుబడి పెడతామన్నారు. అయితే పరిశ్రమలో డీప్ (భారీ) డిస్కౌంట్లు కొద్ది కాలమేనని, రానున్న రోజుల్లో విలువకు తగ్గట్టుగా ధరలు ఉంటాయని అన్నారు. రిటర్న్ పాలసీని కొందరు కస్టమర్లు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారని చెప్పారు. కట్టుదిట్టమైన వ్యవస్థతోనే మోసాలను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక రీఫర్‌బిష్డ్ (పునరుద్ధరించిన) మొబైల్స్‌పై కంపెనీ వారంటీతోపాటు 60 శాతం దాకా డిస్కౌంట్ ఇస్తున్నట్టు చెప్పారు. దీపావళికి నగలు, వాచీలు ఎక్కువగా అమ్ముడయ్యే అవకాశం ఉందన్నారు.