ఫ్లిప్‌కార్ట్‌లో ఈబే ఇండియా విలీనం పూర్తి
న్యూఢిల్లీ: దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈబే ఇండియా కార్యకలాపాల విలీనం పూర్తయినట్టు కంపెనీ ప్రకటించింది. ఇక నుంచి ‘ఈబే డాట్ ఇన్’ ఫ్లిప్‌కార్టు గ్రూపు కంపెనీగా స్వతంత్రంగా కొనసాగుతుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఈ ఒప్పందం ఈ ఏడాది ఏప్రిల్‌లో కుదిరింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈబే 500 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడంతోపాటు ‘ఈబే డాట్ ఇన్’ను ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించేందుకు కూడా ఒప్పందం చేసుకుంది. అలాగే, అంతర్జాతీయ లావాదేవీల విషయంలో రెండు సంస్థలు సహకరించుకోనున్నాయి.
ఈబేలో లభించే ప్రపంచ వ్యాప్త ఉత్పత్తులు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయని, అదే సమయంలో ఈబే కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ విక్రేతల నుంచి భారతీయ వస్తువుల కొనుగోలుకు వీలు పడుతుందని ఫ్లిప్‌కార్ట్ తన ప్రకటనలో తెలిపింది. ఒక విధంగా ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లో నమోదైన విక్రయదారులు తమ ఉత్పత్తులను ఈబే ద్వారా అంతర్జాతీయంగా ఆఫర్ చేసే అవకాశం అందిరానుంది. మరో ప్రత్యర్థి స్నాప్‌డీల్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేయాలనుకోగా... ఆఫర్, షరతులు నచ్చక స్నాప్‌డీల్ చర్చల నుంచి వైదొలగడం విదితమే.
ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్లు
ఫ్లిప్‌కార్ట్‌తో చైనాకు చెందిన మొబైల్ ఉత్పత్తుల కంపెనీ ట్రాన్సిషన్ హోల్డింగ్స్ చేతులు కలిపింది. నోట్ 4, హాట్ 4 ప్రో మోడళ్లను ‘ఇన్ఫినిక్స్’ బ్రాండ్ కింద ఫ్లిప్‌కార్ట్ వేదికగా భారత్‌లో విక్రయించనుంది. ఇన్ఫినిక్స్ నోట్ 4 మోడల్ ధర రూ.8,999, హాట్ 4 ప్రో మోడల్ ధరను రూ.7,499గా ఖరారు చేసింది.