EBay
-
1,000 మంది ఉద్యోగులను తొలగించిన మరో దిగ్గజ కంపెనీ!
ఐటీ కంపెనీల్లో ఇటీవల కాలంలో ఉద్యోగాల తొలగింపు పదం తరచూ వినిపిస్తోంది. అమెరికా టెక్ కంపెనీలు మెటా, ట్విటర్, గూగుల్ వంటివి ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. 2023లో భారత టెక్నాలజీ కంపెనీలు 2022తో పోలిస్తే అత్యధిక మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించినట్లు ఇటీవలే లేఆఫ్స్.ఎఫ్‌వైఐ నివేదిక తెలిపింది. 2023లో దాదాపు 14,418 మందికి వివిధ సంస్థలు ఉద్వాసన పలికినట్లు ఈ నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఈ సంఖ్య 14,224గా ఉంది. 2024లో ఈ పర్వం కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ 1000 మంది ఉద్యోగులును తొలిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఈబే లేఆఫ్ ప్రకటించింది. వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. రాబోయే నెలల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసనపలికే అవకాశం ఉన్నట్లు ఈబే ప్రెసిడెంట్, సీఈవో జామీ ఇయానోన్ పేర్కొన్నారు. గత త్రైమాసికంలో కంపెనీ 1.3 బిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేసినప్పటికీ సంస్థలో కొన్ని మార్పులు అవసరమని భావిస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తొలగింపు విషయాన్ని ఇ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది. ఇదీ చదవండి: జనరేటివ్ ఏఐతో కొత్త ఉద్యోగాలు కంపెనీ లక్ష్యాలకు వ్యతిరేకంగా పరిస్థితులు మారినప్పుడు వ్యాపార వృద్ధిని మించి ఉద్యోగులు, ఖర్చులు ఉంటాయి. దాంతో కంపెనీకు మరింత నష్టం వాటిల్లుతుందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని ప్రధాన మార్పులు అవసరం అవుతాయి. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది. -
భారీషాక్, దేశం వదిలి వెళ్లిపోతున్న మరో దిగ్గజ కంపెనీ.. కారణం అదే!
భారీ వ్యాపారాల ఆశలతో భారత మార్కెట్లో ప్రవేశించిన పలు బహుళ జాతి దిగ్గజాలు (ఎంఎన్సీ) .. తమ అంచనాలకు తగ్గట్లుగా ఇక్కడ పరిస్థితులు కనిపించక పోతుండటంతో ఆలోచనలో పడుతున్నాయి. నిష్క్రమించడమో లేక వ్యాపారాల పరిమాణాన్ని తగ్గించుకోవడమో చేస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో నిష్క్రమించిన హోల్సిమ్, ఫోర్డ్, కెయిర్న్, దైచీ శాంక్యో, మెట్రో వంటి సంస్థల బాటలోనే తాజాగా అమెరికా పెట్టుబడుల దిగ్గజం ఒమిడియార్ నెట్వర్క్ చేరింది. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం ఒమిడియార్ నెట్వర్క్ భారత్‌కు భారీ షాకిచ్చింది. వచ్చే ఏడాదిలో ఆ సంస్థ భారత్‌లో తన కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా చర్యల్ని ముమ్మరం చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈకామర్స్ సంస్థ ఈబే ఫౌండర్లు పియర్ ఒమిడ్యార్, పామ్ ఒమిడ్యార్‌లు..భారత్ కేంద్రంగా ఒమిడ్యార్ నెట్వర్క్ ఇండియా పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ ఎంటర్ ప్రైజెస్ విభాగాల్లో వ్యాపారాలు చేసే సంస్థలకు పెట్టుబడులు పెడుతుంది. దీంతో పాటు స్వచ్ఛంద సంస్థలకు, డ్యూ యల్ చెక్ బుక్ అనే మోడల్ పేరుతో ఇన్నోవేటీవ్ ఆంత్రప్రెన్యూర్లకు,సెక్టార్ లెవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల కంపెనీలకు నిధులు సమకూర్చుతుంది. ఏదైనా కంపెనీ చట్టపరమైన అడ్డంకుల్ని ఎదుర్కొంటుంటే.. దేశీయ చట్టాల్ని అనుసరిస్తూ వాటి నుంచి ఎలా భయటపడాలో సలహా ఇస్తుంది. పెట్టుబడులు నిలిపివేస్తూ ఈ తరుణంలో ఒమిడియార్ నెట్వర్క్ వచ్చే ఏడాది చివరి నాటికి భారత్‌ను వదిలి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా, ఇప్పటికే ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టడాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఒమిడియార్ యాజమాన్యం, బోర్డ్ సభ్యులు వచ్చే రెండు నెలల్లో ప్రస్తుతం ఒప్పందం కుదర్చుకున్న సంస్థలతో కొనసాగింపు, పోర్ట్‌పోలియో వంటి అంశాలపై వ్యూహరచన చేయనుంది. ఒమిడ్యార్ నెట్వర్క్ భారత్‌ను ఎందుకు వదిలి వెళ్తుందనే విషయంపై ఎలాంటి కారణాల్ని వివరించలేదు. మార్పులు అనేకం ఈ సందర్భంగా ‘‘గత దశాబ్దంలో ఒమిడ్యార్ నెట్వర్క్ ఇండియా పెట్టుబడులు పెట్టే విషయంలో కీలక పాత్రపోషించింది. అయితే వ్యాపారం పరంగా తమ లక్ష్యాల్ని చేరుకునేందుకు ఇకపై భారత్‌లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు చేయడం లేదు. 2010 నుంచి భారత్‌లో సేవలందిస్తున్నాం. ఆర్ధికంగా, వ్యాపార పరంగా అప్పటి ఇప్పటికి అనేక మార్పులు చోటుచేసుకున్నాయి’’ అని ఓ ప్రకటనలో వెల్లడించింది. 2010లో అడుగు పెట్టి.. 2010 నుండి భారతదేశంలో పనిచేస్తున్న ఒమిడ్యార్ గ్రూప్ 500 మిలియన్లకు పైగా పెట్టుబడులను అందించింది. ముఖ్యంగా, దాదాపు 150 మిలియన్లను స్వచ్ఛంద సంస్థలకు అందించింది. దాదాపు 70 శాతం ఆయా సంస్థల్లో ఇన్వెస్ట్ చేసినట్లు పలు నివేదికలు హైలెట్ చేశాయి. చదవండి👉 'వర్క్ ఫ్రమ్ హోం'పై ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం -
ప్రపంచంలోనే ఖరీదైన బీరు ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఖరీదైనవి, విలువైనవి ఎవరికైనా ఆసక్తి ఎక్కువే. అందులోనూ పురాతనమైన వైన్, షాంపైన్ ఖరీదైన లగ్జరీ డ్రింక్స్‌గా మందుబాబులను ఊరిస్తూ ఉంటాయి. తాజాగా ఒక బీరు బాటిల్ అంత్యంత ఖరీదైన ధరతో వార్తల్లో నిలిచింది. ఈ బీరు బాటిల్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. అవును ఈ బీరు బాటిల్ ధర అక్షరాలా ఐదు లక్షల డాలర్ల అంటే మన భారతీయ కరెన్సీలో రూ.4 కోట్ల పైనే అన్నమాట. 140 సంవత్సరాల క్రితం నాటి ‘అల్ సాప్స్ ఆర్కిటిక్ అలె’ వేలంలో అత్యంత ధర పలికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా చరిత్ర కెక్కింది. ఒక వ్యక్తి ఈ బీరు బాటిల్‌ని 5,03,300 డాలర్లకు కొనుగోలు చేయడం విశేషం. అల్సాప్స్ అనే బీర్ల తయారు కంపెనీ దీన్ని తయారుచేసింది. దీంటోల ఆల్కహాల్ 10 శాతం ఉండటమే దీని ప్రత్యేకత అట. లండన్‌లోని పురాతన వస్తువులు, ఆర్ట్వర్క్కి సంబంధించిన ఆంటిక్ట్రేడ్ సమాచారం ప్రకారం, ఓక్లహోమాకు చెందిన ఒక కస్టమర్ 2007లో ఈబే ఆన్లైన్ వేలంలో దీన్ని 304 డాలర్లకు సొంతం చేసుకున్నాడు. ఈ బీరు బాటిల్‌ని స్టోర్‌లో వేలానికి పెడితే 157 మంది పోటీపడ్డారు. మసాచుసెట్స్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యాపారి ఈ బీరు బాటిల్‌కి డెలివరీ ఛార్జి కింద 19.5 డాలర్లు తీసుకున్నాడని వెల్లడించింది. ఈ బీరు బాటిల్‌పైన పాత పేపర్‌తో లామినేటెడ్ కవర్ ఉంది. ఆ కాగితం మీద చేతితో రాసిన అక్షరాలు, పెస్సీ జి.బోల్స్టర్ అనే పేరుతో సంతకం ఉంది. అందులో ‘ఈ బాటిల్ 1919లో నా దగ్గర ఉంది’ అని రాసి ఉంది. ఆ నోట్‌ని బట్టి ఈ బీరు బాటిల్‌ని ధ్రువ ప్రాంతాలకు వెళ్లేవాళ్ల కోసం 1852లో ప్రత్యేకంగా తయారుచేశారు అన్నట్లుగా తెలుస్తోంది. కాగా సర్ ఎడ్వర్డ్ బెల్చర్ అనే నౌకాదళం అధికారి ఆర్కిటిక్ చల్లటి వాతావరణానికి తగ్గట్టుగా ఒక బీరు బాటిళ్లను తయారుచేయాలని 1852లో అల్సాప్స్ కంపెనీని కోరాడట. అందుకని ఆర్కిటిక్ ధ్రువంలో గడ్డకట్టకుండా ఉండేందుకు ఆల్కహాల్ శాతం ఎక్కువ (10శాతం) ఉండేలా ఈ బీరుని తయారుచేశారు. ఎడ్వర్డ్ ఈ బీరు బాటిళ్లను బ్రిటీష్ నౌకాదళం అధికారి, ఆర్కిటిక్ యాత్రికుడు సర్ జాన్ ఫ్రాంక్లిన్, అతని టీం కోసం ఆర్కిటిక్ ధ్రువానికి పంపించాడని యాంటిక్ ట్రేడ్ వెబ్సైట్ తెలియజేస్తోంది.ఎరేబస్, టెర్రర్ , వారి సిబ్బందిని కనుగొనడానికి రెస్క్యూ ప్రయత్నాల తర్వాత బీర్ బాటిల్ కనుగొన్నారట. దురదృష్టవశాత్తు, ఇద్దరు సిబ్బందికి సంబంధించిన ఆధారాలు ఎప్పుడూ కనిపించలేదు. -
ఒక్క ఆలూ చిప్.. ధర ఏకంగా రూ.14 లక్షలు
వెబ్‌డెస్క్: అదృష్టం ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో ఊహించడం కష్టం. కొందరు ఎంత కష్టపడ్డా తగిన ఫలితం లభించక బాధపడతారు.. కానీ కొందరి జీవితంలో జరిగే సంఘటనలు చూస్తే.. చాలా ఆశ్చర్యం వేస్తుంది. సరదాకి చేసే పనులు కూడా వారికి బాగా కలసివస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబేయే వార్త కూడా ఈ కోవకు చెందినదే. తినే చిప్స్‌లో ఒకటి కాస్త వింతగా ఉండటంతో దాన్ని దాచుకోవాలని నిర్ణయించుకుంది ఓ బాలిక. ఆ తర్వాత దాన్ని వీడియో తీసి టిక్‌టాక్‌లో అప్లోడ్ చేయడంతో చాలామంది దాన్ని వేలం వేయమని సూచించారు. వేలంలో ఆ చిన్న ఆలూ చిప్ ఏకంగా 14 లక్షల రూపాయల ధర పలికింది. నమ్మశక్యంగా లేని ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌కి చెందిన 13 ఏళ్ల బాలిక రైలీ స్టువార్ట్‌కు బంగాళాదుంప చిప్స్ తినడం అంటే ఇష్టం. అందులోనూ ప్రముఖ బ్రాండ్ డోరిటోస్ ఆలూ చిప్స్ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో ఓసారి రైలీ డోరిటోస్ చిప్స్ ప్యాకెట్ తీసుకువచ్చింది. దానిలో ఆమెకు ఓ చిత్రమైన చిప్ ముక్క కనిపించింది. అది మిగతా చిప్స్ ముక్కల్లా కాకుండా... సమోసాలాగా ఉబ్బినట్లు ఉంది. వెరైటీగా ఉండటంతో రైలీ దాన్ని దాచుకోవాలని భావించింది. ఈ క్రమంలో ఆ చిప్ ముక్కను వీడియో తీసి... టిక్‌టాక్‌లో ఉబ్బిన స్నాక్ పేరుతో అప్లోడ్ చేసింది. సమోసాలా భిన్నంగా ఉన్న ఈ ఆలూ చిప్ వీడియో తెగ వైరలయ్యింది. ఆ తర్వాత ఇది కాస్త ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా షేర్ అయ్యింది. ఇక టిక్‌టాక్‌లో దీనికి మిలియన్ల వ్యూస్ వచ్చాయి. విభిన్నంగా ఉన్న ఈ చిప్‌ని కొనేందుకు నెటిజనులు ఆసక్తి కనపర్చడంతో.. రిలే దాన్ని వేలం వేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో దాన్ని ఈబే సైట్లో లిస్ట్ చేసింది. చిప్ ఖరీదు ఒక్క డాలర్ కంటే తక్కువ కోట్ చేసింది. అయితే ఆశ్చర్యంగా గంటల వ్యవధిలోనే దాని విలువ 2 వేల డాలర్లకు చేరింది. ఆ చిప్ ముక్కకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది భారీగా డబ్బులిచ్చి కొనేందుకు ముందుకొచ్చారు. ఇలా వేలం కొనసాగుతూ ఉండగా... డోరిటోస్ కంపెనీకి ఈ విషయం తెలిసింది. ఆశ్చర్యపోయిన కంపెనీ... బిడ్డింగ్‌లో పాల్గొని అందరికంటే చాలా ఎక్కువగా 20,100 డాలర్లు(14,90,251 రూపాయలు) ఇచ్చేందుకు ముందుకొచ్చింది. విషయం తెలిసి రిలే కుటుంబం సంతోషంతో ఉబితబ్బయ్యింది. ఇక ఏదో సరదాకు చేసిన పనికి ఇంత భారీ ఎత్తున డబ్బు వస్తుందని అస్సలు ఊహించలేదు అంటూ సంతోషంతో గంతులు వేస్తుంది రిలే. ఎందుకు అంత ధరంటే.. ఒక చిన్న ఆలూ చిప్ ముక్కను రూ.14 లక్షలు పెట్టి కొనేందుకు డోరిటోస్ ముందుకు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనిపై కంపెనీ వివరణ ఇచ్చింది. "మరెవరైనా అయితే... ఆ ముక్కను కూడా తినేవారేమో... కానీ ఆ బాలిక క్రియేటివ్‌గా ఆలోచించింది. దాన్ని కూడా వ్యాపార కోణంలో చూసింది. దానితో బిజినెస్ చేసింది. ఆమె ధైర్యం మాకు నచ్చింది. ఆమెలో ఓ వ్యాపారవేత్తను మేం చూశాం. పైగా ఆమె కుటుంబం మా చిప్స్‌కి అభిమానులు. అందుకే ఇలా చేశాం" అని తెలిపింది. This 13-year-old was paid $20,000 by Doritos after finding a perfectly puffy chip 😱 pic.twitter.com/mFRfWVr5F0 — NowThis (@nowthisnews) August 20, 2021 -
పిచ్చా.. వెర్రా అసలు ఏం అనాలి?!
బెర్లిన్: పిచ్చి పలు రకాలు.. వెర్రి వేయి రకాలు అంటారు. నిజమే కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొ రకమైన పిచ్చి ఉంటుంది. కొందరికి ఉన్న పిచ్చి గురించి మనం తెలుసుకుంటే.. మనకు కూడా పిచ్చి పీక్స్‌కు వెళ్తుంది. ఓ వ్యక్తి చేసిన పని వల్ల ఇప్పుడు ఈ పిచ్చి పురాణాన్ని స్మరించుకోవాల్సి వచ్చింది. ఏమా పని అంటే ఇది చదవాల్సిందే. స్మార్ట్ఫోన్లకు బ్యాక్ కవర్ తప్పని సరి. ఎప్పుడైనా ఫోన్ కిందపడితే పగలకూడదని.. గీతలు పడకూడదనే ఉద్దేశంతో బ్యాక్ కవర్ వేస్తాం. అది పాతది అయితే పడేసి కొత్తది కొంటాం. అంతేతప్ప వాడేసిన ఈ బ్యాక్ కవర్ని అమ్మే సాహసం ఎవరు చేయరు. ఒకవేళ చేస్తే.. తిట్లు తినాల్సి వస్తుంది. యూట్యూబ్ ఇన్ఫ్లూయేంజర్గా పని చేస్తున్న జర్మనీకి చెందిన బియాంకా క్లాసెన్ మాత్రం పాత ఫోన్ కవర్ని ఏకంగా కోటి రూపాయలకు అమ్మింది. బియాంకా ఓ సారి అండర్ వాటర్ ఫోటో షూట్లో పాల్గొన్నప్పుడు ఆమె ఫోన్ తడిసిపోయింది. (చదవండి: ట్రూ లవ్.. ఆలస్యంగా నడిచిన 23 రైళ్లు ) దాంతో దాని బ్యాక్ కవర్ తీసి కప్‌బోర్డ్‌లో పడేసింది. ఇక దాని గురించి మర్చిపోయింది. అలా పడేయడం వల్ల ఆ బ్యాక్ కవర్ రంగు పోయి.. ఓ పెయింటింగ్‌లా కనిపించింది. ఓ రోజు ఎందుకో కప్బోర్డ్ ఒపెన్ చేసిన బియాంకాకి ఫోన్ బ్యాక్ కవర్ కనిపించింది. పూర్తిగా పాడయిన దాన్ని పడేద్దామనుకుంటుండగా ఆమెకు ఓ వింత ఐడియా వచ్చింది. దీన్ని అమ్మకానికి పెడితే ఎలా ఉంటుందని భావించింది. దాంతో తన ఫోన్ బ్యాక్ కవర్ని ఈబేలో అమ్మకానికి పెట్టింది. ఆమె చేసిన పనే వింత అనుకుంటే ఆమె కన్నా వింత వ్యక్తి ఒకరు ఈ పాత వాడేసిన కవర్‌కి ఏకంగా 1,62,907 డాలర్లు(1,19,22,153.31 రూపాయలు) చెల్లించేందుకు సిద్ధపడ్డాడు. ఏదో సరదాకి చేసిన పనికి ఇంత మంచి ధర పలకడంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది బియాంకా. ఈ మొత్తం డబ్బుని ఓ చారిటీకి ఇచ్చి.. ఇళ్లు లేని వారికోసం ఖర్చు చేస్తానని వెల్లడించింది. ఇక వీరి పనికి నెటిజనులు మీరు, మీ పిచ్చికి ఓ దండం సామీ అంటున్నారు. -
3.8 బిలియన్ డాలర్ల వస్తువులు కొట్టేసి..
మనిషికి డబ్బు ఆశ ఉండడం సహజం. అది ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో బయటికి వస్తుంది. కొందరు కష్టపడి డబ్బు సంపాదించాలనుకుంటే.. మరికొంతమంది అడ్డదారుల్లో సంపాదించాలని చూస్తారు. దీంట్లో కొంతమంది సక్సెస్ చూస్తారు.. ఓటములు చూస్తారు. కానీ అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన 63 ఏళ్ల కిమ్ రిచర్డ్సన్ మాత్రం 19 ఏళ్లుగా సక్సెస్‌ను మాత్రమే చూస్తు వచ్చింది. ఆమె కేవలం కొట్టేసిన వస్తువులను ఆన్లైన్లో అమ్మేయడం ద్వారా కోట్లను కొల్లగొట్టింది. ఇంతకీ ఆమె కొట్టేసిన వస్తువుల విలువ ఎంతో తెలుసా.. అక్షరాల 3.8 బిలియన్ డాలర్లు. (చదవండి : వామ్మో ! పొడవంటే పొడువు కాదు..) ఇక అసలు విషయంలోకి వెళితే.. కిమ్ రిచర్డ్సన్ తనకు కావాల్సిన వస్తువులను కొట్టేయడంలో ఆరితేరిన వ్యక్తి. ఒకషాపులోకి వెళ్లిందంటే ఎదుట ఎలాంటి సీసీ కెమెరాలు ఉన్నా వాటి నుంచి చాకచక్యంగా తప్పించుకొని తనకు కావాల్సిన వస్తువులను కొట్టేసేది. 44 ఏళ్ల వయసులో దొంగతనాలు చేయడం ప్రారంభించిన రిచర్డ్సన్ 2000 ఆగష్టు నుంచి 2019 వరకు 19 ఏళ్లపాటు అమెరికాలోని అనేక స్టోర్స్ లోని వస్తువులను కొట్టేసింది. ఒకటి,రెండు సంవత్సరాలు కాదు.. ఏకంగా 19 ఏళ్లలో 3.8 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొట్టేసింది. అలా కొట్టేసిన వస్తువులను ఈబేలో అమ్మకానికి పెట్టి దానికి రెట్టింపు సంపాదించేది. (చదవండి : అక్కడ 36 వేల మందికి ప్రాణాపాయం!) అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా.. ఇటీవలే రిచర్డ్సన్ చేసిన దొంగతనాలను పోలీసులు పసిగట్టారు. పెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వస్టిగేషన్తో రిచర్డ్సన్పై సీక్రెట్‌గా విచారణ చేయించగా ఆమె చేసిన పనులు పోలీసులను ఆశ్చర్యపరిచాయి. కాగా రిచర్డ్సన్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిచర్డ్సన్కు 54 నెలల పాటు జైలు శిక్ష విధించడంతో పాటు 3.8 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.27 కోట్ల ) జరిమానా వేసింది. -
డబ్బులిచ్చి మరి పాత నోట్లను కొంటున్నారట..!
‘డిమానిటైజేషన్’.. ‘పెద్ద నోట్ల రద్దు’ జరిగి రెండేళ్లు పూర్తయ్యాయి. పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ డిమానిటైజేషన్ ప్రభావం నేటికి కూడా ఉంది. అయితే పనికి రాకుండా పోయిన ఈ పాత నోట్లను ఆన్లైన్లో ఆర్డర్ చేసి మరి కొంటున్నారట జనాలు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ‘ఇ-బే’లో ఈ పాత నోట్లను 6 డాలర్ల(రూ. 423)కి అమ్ముతున్నారు. అమెరికాలో నివసిస్తున్నట్లు చెప్పుకొంటున్న ఓ వ్యక్తి ఇ-బేలో ఈ పాత రూ. 500 నోట్లను అమ్మకానికి పెట్టాడు. ఇప్పటికే 15 పాత నోట్ల అమ్ముడు పోయాయి.. మరో 9 మాత్రమే ఉన్నాయి త్వరపడండి అంటున్నాడు సదరు వ్యక్తి. అయితే పనికి రావని తెలిసి కూడా ఈ పాత నోట్లను జనాలు ఎందుకు కొంటున్నారు.. అది కూడా దానికి సమానమైన విలువ చెల్లించి.. అంటే పాత కరెన్సీని, కాయిన్స్‌ని సేకరించే అలవాటు ఉన్న వారే ఇలా కొంటుంటారని అంటున్నారు నిపుణులు. అయితే పాత నోట్లను ఇలా అమ్మకానికి పెట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు చాలా మంది తమ దగ్గర ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లను ఇండియామార్ట్, ఓఎల్ఎక్స్ వంటి ఆన్లైన్ సైట్లలో అమ్మకానికి పెట్టారు. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా కరెన్సీ ట్రేడింగ్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తారు. -
ఫ్లిప్‌కార్ట్‌లో 5.4 శాతం వాటా ఈ-బేకి
సాక్షి, ముంబై: భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఇ-కామర్స్ విభాగం లో పాగా వేస్తున్న గ్లోబల్ మల్టీ నేషనల్ ఈ కామర్స్కార్పొరేషన్ ఈ-బే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనంతో ఇండియా భారీగా లాభపడింది. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా వాటాను సొంతం చేసుకుంది. ఇటీవలి చేసుక్ను విలీనం ఒప్పందంలో భాగంగా ఈ వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఈ-బే భారత్‌లో తన వ్యాపార విస్తరణను మరింత వేగవంతం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లోఈ బే ఇండియా విలీనం ద్వారా 167 మిలియన్ల డాలర్లు( సుమారు. రూ.1083 కోట్లు) లాభం చేకూరిందని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈబే తెలిపింది. తద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో 5.44 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు తెలిపింది. కాగా ఈ ఏడాది ఆగస్టులో పూర్తయిన విలీనంలో ఈక్విటీ స్టేక్ మార్పిడిలో భాగంగా.. ఈ-బే ఫ్లిప్‌కార్ట్‌లో 500 మిలియన్ డాలర్ల (రూ.3,242కోట్ల) ద్రవ్యపెట్టుబడులు పెట్టింది. దీంతో పాటు ఈ-బే ఇండియా బిజినెస్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించింది. తద్వారా ఫ్లిప్‌కార్ట్ గ్లోబల్ పేరుతో కొత్త పథకాన్ని ఇరు సంస్థలు లాంచ్ చేశాయి. దీంతో సుమారు 200 అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌కు అవకాశం లభించిన సంగతి తెలిసిందే. -
ఆ విలీనాన్ని పూర్తిచేసిన ఫ్లిప్‌కార్ట్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, ఈబే ఇండియా కార్యకలాపాలను పూర్తిగా తనలో కలిపేసుకుంది. ఈ విలీనాన్ని విజయవంతగా పూర్తిచేయడంతో ఈబే.ఇన్ ఇక ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ కంపెనీగా మారినట్టు ఈకామర్స్ దిగ్గజం ప్రకటించింది. గత ఏప్రిల్ నెలలో ఈ డీల్‌ను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఈ కంపెనీలో మైక్రోసాఫ్ట్, ఈబే, టెన్ సెంట్ కంపెనీలు దాదాపు రూ.9,030 కోట్లను పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్‌లో విలీనమయ్యే అన్ని చర్చలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ఒక్క రోజుల్లోనే ఈబే విలీనం పూర్తయిన ప్రకటనను ఈ ఈ-కామర్స్ దిగ్గజం వెలువరించింది. గత ఐదు నెలలుగా జరుగుతున్న విలీన చర్చలను ఆపివేస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేరును ప్రస్తావించకుండా స్నాప్‌డీల్ సోమవారం ఓ ప్రకటనను వెలువరించిన సంగతి తెలిసిందే. వెంటనే ఫ్లిప్‌కార్ట్ కూడా ఈబే.ఇన్ ఇండియా విలీనాన్ని తాము పూర్తిచేసినట్టు, ఫ్లిప్‌కార్ట్‌లో భాగంగా ఓ స్వతంత్ర సంస్థగా ఈబే కార్యకలాపాలు నిర్వహించనున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు ప్రొడక్ట్ ఛాయిస్‌లు పెరుగుతాయి. ఈబేలో గ్లోబల్ ఇన్వెంటరీ కూడా లభ్యమవుతోంది. ఈ భాగస్వామ్యంతో అంతర్జాతీయంగా తమ విక్రయాలను పెంచుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్ విక్రయదారులకు ఎంతో సహకరించనుంది. అటు ఫ్లిప్ కార్ట్ వినియోగదారులు అంతర్జాతీయ ఈబే ఉత్పత్తులను, ఇటు ఈబే వినియోగదారులు ఫ్లిప్ కార్ట్ దేశీయ ఉత్పత్తులను కొనుగోలుచేసేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఉన్నతమైన ఈకామర్స్ అనుభవాన్ని కోరుకునే భారతీయ కస్టమర్లకు, విక్రయదారులకు తాము కలిసి నడవడం ఎంతో ప్రయోజానాన్ని చేకూరుస్తుందని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. -
అమెజాన్‌కు చెక్..ఫ్లిప్‌కార్ట్ మెగాడీల్
-
అమెజాన్‌కు చెక్..ఫ్లిప్‌కార్ట్ మెగాడీల్
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే మెగా డీల్ సాధించింది. ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఈబేను కొనుగోలు చేసింది. ఇటీవల భారీగా నిధుల సమీకరణను చేపట్టబోతోందన్న ఊహాగాలను తెరదించుతూ ఫ్లిప్ కార్ట్ ఈ మెగాడీల్ వివరాలను సోమవారం ప్రకటించింది. టెన్సెంట్, ఇ-బే, మైక్రెసాఫ్ట్ల నుంచి భారీ పెట్టుబడులను సాధించినట్టు వెల్లడించింది. సుమారు 11.6బిలియన్ డాలర్లు(75 వేలకోట్ల రూపాయలు) ఎన్ఎస్ఇ లోఅన్ని రిటైల్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించనుంది. ఈ డీల్‌తో తన ప్రధాన ప్రత్యర్థి అమెజాన్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. అలాగే దేశీయ ఈ కామర్స్ వ్యాపారంలో అతిపెద్ద ఒప్పందంగా నిలవనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఈ–కామర్స్ మార్కెట్ వాటా కన్నేసిన ఈబే భారత్‌లోని వ్యాపారాన్ని ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించింది. ఈ డీల్ ద్వారా భారీ పెట్టుబడులకు తెరలేచింది. సుమారు1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఫ్లిప్‌కార్ట్ సమకూర్చుకోనుంది. చైనాకి చెందిన టెన్సెంట్, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ , ఈబే నుంచి సుమారు 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించింది. టెన్సెంట్ వ్యూహాత్మకంగా భాగస్వామిగా ఉండనుంది. ఈబే ఫ్లిప్‌కార్ట్ లో స్వతంత్ర సంస్థగా కొనసాగనుంది. తన వాటాను విక్రయించిన సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఇకపై నగదు పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. ప్రతిపాదిత డీల్ ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌లో మైనారిటీ వాటాల కోసం 500 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. తమతో ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌లు జత కలవడం చాలా సంతోషంగా ఉందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. తమకు సంబంధించిఇది ఒక ఒక మైలురాయి ఒప్పందమని ఫౌండర్లు సచిన్ బన్సల్, బిన్నీ బన్స్ల్ ప్రకటించారు. కాగా 2007 లో లాంచ్ అయిన ఫ్లిప్క్లార్ 100 మిలియన్ల యూజర్లను కలిగి ఉంది. ఇటీవల భారీ నష్టాలను మూటగట్టుకుంటున్న ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ విస్తరణలో భాగంగా 1.5–2 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు సమీకరించే ప్రణాళికలు రచించిన సంగతి తెలిసిందే. -
గ్లోబల్ జర్నలిజం కోసం రూ.650 కోట్లు
వాషింగ్టన్ : స్వతంత్ర మీడియా, స్వేచ్ఛాయుత జర్నలిజం కోసం రాబోయే మూడేళ్లలో రూ.650 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు ఈబే సంస్థ వ్యవస్థాపకుడు పెర్రీ ఒమిడియార్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని తప్పుడు సమాచారంతో పాటు, విద్వేష ప్రసంగాలను నిరోధించడానికి వినియోగిస్తామన్నారు. గతంలో పనామా పేపర్ల కుంభకోణాన్ని బయటపెట్టిన ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం (ఐసీఐజే) సంస్థకు తన దాతృత్వ సంస్థ ఒమిడియార్ నెట్వర్క్ ఇనిషియేటివ్(ఓఎన్ఐ) ద్వారా పెర్రీ 4.5 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించారు. ప్రస్తుతం ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా స్పందించకపోవడంతో పాటు, మీడియా సంస్థలు నమ్మకాన్ని కోల్పోవడం, తప్పుడు సమాచార వ్యాప్తి ఎక్కువగా ఉంటున్నాయని ఓఎన్ఐ సభ్యుడు మ్యాట్ బెన్నిక్ తెలిపారు. సమాచార స్వేచ్ఛతో పాటు ప్రజల భాగస్వామ్యం, బాధ్యతాయుత జర్నలిజంకు తాము కట్టుబడి ఉన్నట్లు మాట్ స్పష్టం చేశారు. ఒమిడియార్ తన సొంత వార్తా నెట్వర్క్ ‘ది ఇంటర్సెప్ట్’లో రానున్న కాలంలో 250 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతానని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు వల్ల యూదులపై విద్వేషాన్ని నిరోధించడానికి పోరాడే యాంటి డిఫమేషన్ లీగ్(ఏడీఎల్), లాటిన్ అమెరికాలో ప్రభుత్వాల జవాబుదారి కోసం పోరాడే లాటిన్ అమెరికన్ అలయెన్స్ ఫర్ సివిక్ టెక్నాలజీ(ఏసీటీ) సంస్థలు లబ్ధి పొందనున్నాయి. ఫ్రాన్స్‌లో జన్మించిన ఒమిడియార్ ఇరానియన్-అమెరికన్ పౌరుడు. -
ఫ్లిప్‘కార్ట్’లోకి ఈబే ఇండియా?
⇒ భారత విభాగం విక్రయంపై ఈబే చర్చలు ⇒ ఫ్లిప్‌కార్ట్‌లో మైనారిటీ వాటాలు కొనుగోలు యోచన ⇒ 500 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడి ప్రతిపాదన ముంబై: దేశీ ఈ–కామర్స్ మార్కెట్లో ప్రస్తుతం కన్సాలిడేషన్ పర్వం నడుస్తోంది. ఇప్పటికే స్నాప్‌డీల్ విక్రయం వార్తలు నడుస్తుండగా.. తాజాగా ఈబే కూడా ఈ జాబితాలో చేరింది. మార్కెట్లోకి ప్రవేశించి దశాబ్దం పైగా దాటిపోయినా.. ఇప్పటికీ నిలదొక్కుకోలేకపోయిన ఈబే తాజాగా తమ భారత విభాగాన్ని మరో ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రతిపాదిత డీల్ ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌లో మైనారిటీ వాటాల కోసం 500 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం 1.5–2 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు సమీకరించే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే చైనాకి చెందిన టెన్సెంట్, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి సుమారు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఖరారయ్యాయి. ఒకప్పుడు 15 బిలియన్ డాలర్ల పైగా పలికిన ఫ్లిప్‌కార్ట్ వేల్యుయేషన్ తాజా నిధుల సమీకరణ సమయంలో సుమారు 11 బిలియన్ డాలర్ల స్థాయికి తగ్గిపోయింది. ప్రస్తుతం సమీకరిస్తున్న పెట్టుబడులు.. అత్యంత వేగంగా విస్తరిస్తున్న అమెజాన్‌కి గట్టి పోటీనిచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్‌కి చాలా కీలకం కానున్నాయి. సంపన్న మార్కెట్లపై దృష్టి.. ప్రస్తుతమున్న చాలా మటుకు ఈకామర్స్ సంస్థల కన్నా ముందుగా భారత మార్కెట్లోకి ఈబే అడుగుపెట్టినప్పటికీ.. అంతగా విజయవంతం కాలేకపోయింది. 2004లో బాజీడాట్కామ్ను కొనుగోలు చేసిన ఈబే 2005లో అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. కానీ కొనుగోలుదారులకు పెద్దగా చేరువకాలేకపోయింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజాలే కాకుండా చాన్నాళ్ల తర్వాత వచ్చిన స్నాప్‌డీల్, పేటీఎం, షాప్‌క్లూస్ వంటి సంస్థలు కూడా దూసుకెడుతుండగా.. ఈబే మాత్రం రాణించలేక చతికిలబడింది. 2015లో రూ. 172 కోట్లు, గతేడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం రూ. 262 కోట్ల మేర నష్టాలు నమోదు చేసింది. అంతర్జాతీయంగా కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుకుంటున్న ఈబే ప్రధానంగా మళ్లీ అమెరికా, యూరప్ వంటి సంపన్న మార్కెట్లపై దృష్టి సారిస్తోంది. భారత్ మార్కెట్‌పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే, అలాగని పూర్తిగా వైదొలగాలని కూడా భావించడం లేదు. ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడుల ద్వారా అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఈ–కామర్స్ మార్కెట్లో ఎంతో కొంత వాటాలతో కొనసాగాలని ఈబే యోచిస్తోంది. దూకుడుగా అమెజాన్ .. అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశీ ఈకామర్స్ మార్కెట్ విలువ గతేడాది 18 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2030 నాటికి ఇది 228 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో భారత ఈకామర్స్ మార్కెట్లో కార్యకలాపాలు విస్తరించడంపై అమెజాన్ దూకుడుగా ఉంది. దాదాపు 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయబోతోంది. దేశీయంగా సీ2సీ ఈ–కామర్స్ మార్కెట్లో ప్రస్తుతం క్వికర్, ఓఎల్ఎక్స్ సంస్థలు ఇందులో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. స్నాప్‌డీల్ ఇటీవలే షాపో సంస్థను మూసివేయడం ద్వారా ఈ విభాగం నుంచి వైదొలిగినప్పటికీ.. అమెజాన్ మాత్రం ఈ మార్కెట్‌పై ఆశావహంగా ఉంది. మరోవైపు వివిధ మార్గాల్లో చైనాకి చెందిన ఆలీబాబా, జపాన్ సంస్థ రకుటెన్ మొదలైనవి కూడా భారత ఈ–కామర్స్ మార్కెట్లో చొరబడేందుకు పోటీపడుతున్నాయి. -
పావు డాలరు... పాతిక లక్షలా...!
కాలిఫోర్నియా: ఔను ఇది నిజమే...! కానీ అది మామూలు పావుడాలరు కాదు. 1970వ సంవత్సరం నాటిది. అయితే ఈ నాణాన్ని కేవలం ముద్రించి వదిలేశారని, ఇది వాడుకలోకి రాలేదని ఈ నాణెం యజమాని మైక్ బయర్స్ చెబుతున్నాడు. అతను ఈ నాణేన్ని ఈబే సైట్లో రూ. 25 లక్షలకు వేలానికి ఉంచాడు. ఇవి ఎన్ని తయారయ్యాయనే విషయంపై ఎవరికీ స్పష్టత లేదు. తనకు మాత్రం కాలిఫోర్నియా ప్రభుత్వం నిర్వహించిన ఓ వేలంలో ఇది లభించిందన్నాడు. దీన్ని మన దగ్గర ఉంచుకోవడానికి సీక్రెట్ సర్వీస్ వారు ఇచ్చే అనుమతి కూడా తన దగ్గర ఉందని చెబుతున్నాడు. అయితే ఈ నాణేన్ని సొంతం చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నపటికీ ఇతగాడు చెబుతున్న ధర విని బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటివరకు ఇతని ప్రకటనను 445 మంది చూశారు. తొమ్మిది మంది బేరమాడారు. అయితే ఈ నాణెం అసలు వాడుకలోకే రాలేదు కాబట్టి అంత ధర పెట్టడంలో తప్పు లేదనేది బయర్స్ వాదన. -
ఈబేలో అమ్మకానికి పాక్ ప్రధాని షరీఫ్
లండన్: ‘పనికిరాని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్’ అంటూ ఆయనను ఒకరు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. ఈ-కామర్స్ వెబ్సైట్ ఈబేకు చెందిన లండన్ పేజీలో షరీఫ్ విక్రయానికి ప్రకటన ఇచ్చారు. 66,200 బ్రిటన్ పౌండ్ల(దాదాపు రూ.62లక్షలు)కు కొనుక్కోవచ్చన్న పోస్ట్‌కు దాదాపు 100 బిడ్లు కూడా వచ్చాయి. షరీఫ్ పేరుతో పెట్టిన పోస్ట్‌లో.. ‘కొత్త బ్రాండ్, ఇంతవరకు వాడని సరికొత్త వస్తువు’ అని అడ్వర్ట్టైజ్మెంట్లో వివరించారు. ‘పాక్లోకంటే ఇంగ్లాండ్, అమెరికా, టర్కీ దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తారు. వ్యాపారాలు, ఆస్తులు అన్నీ లండన్‌లో ఉంటాయిగానీ పాక్‌కు ప్రధానిగా ఉండేందుకు ఇష్టపడతారు.’ అని పోస్టులో ఉంది. ‘ఈ వస్తువుకు పుట్టుకతోనే జన్యులోపముంది. ఇప్పుడే కొన్నవారు వెంటనే ఈరోజే లండన్‌లో వస్తువును తీసుకోవచ్చు. దీన్ని కొంటే షరీఫ్ తమ్ముడు షాబాజ్‌ను ఉచితంగా ఇస్తాం’ అని ప్రకటనలో ఉంది. కొద్దిసేపటికి ఈ పోస్టును ఈబే నుంచి తొలగించారు. -
'మా ప్రధాని పనికిరాడు.. అమ్మేస్తున్నాం'
అమ్మకానికి ఏది అడ్డుకాదు. అందుకే అమ్మేయ్ గురు అంటుంది ఓ పాత సామాన్ల అమ్మకం వెబ్సైట్. పాపం పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తీరు కూడా ఎవరో ఓ నెటిజన్‌కు నచ్చనట్టు ఉంది. అందుకే ఏకంగా అమెరికన్ ఈ కామర్స్ వెబ్సైట్ 'ఈ బే'లో ఆయనను అమ్మకానికి పెట్టాడు. అమ్మకమంటే అలాంటి ఇలాంటి అమ్మకం కాదు.. షరీఫ్ పేరిట పెద్ద ప్రకటనే ఇచ్చాడు. ' పనికిరాని పాకిస్థానీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను అమ్మేస్తున్నాం' అంటూ ఆయన ఫొటోను పెట్టి.. 66,200 పౌండ్ల (రూ. 62.41 లక్షల) వేలం ప్రాథమిక ధరగా నిర్ణయించాడు. మరో ఆరు రోజుల్లో ఈ బిడ్డింగ్ ముగియనుంది. ఇక ప్రకటనలో ఇచ్చిన విస్తారమైన వివరణలో షరీఫ్‌ను ఎడాపెడా ఏకీపారేశాడు సదరు అమ్మకందారుడు. 'ఇప్పటికే వాడేసిన ప్రధాని షరీఫ్‌ను అమ్మేస్తున్నాం. ఇంక ఎంతమాత్రం మాకు అవసరం లేదు. ఈ అమ్మకం కోసం బాక్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవ్వబడవు. కొనుగోలుదారుడే వచ్చి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐటెం అమ్మకందారుడు ఇంతవరకు టచ్ చేయలేదు. సెంట్రల్ లండన్ నుంచి ఐటెంను కలెక్ట్ చేసుకోవచ్చు. కొనుగోలు పూర్తికాగానే పూర్తి చిరునామా తెలియజేస్తాం. కొనుగోలుదారుడే రవాణా ఏర్పాట్లు చేసుకోవాలి' అని ప్రకటనలో పేర్కొన్నాడు. ' ఈ ప్రొడక్ట్‌లో, దీని కుటుంబంలో జన్యుపరంగా లోపమున్నది. అవినీతితో భ్రష్టుపట్టినది. పనిచేసే పరిస్థితిలో లేదు. ఎప్పుడూ పనిచేయలేదు. పుట్టుకతోనే ఇది అవినీతితో లోపభూయిష్టమైనది. ఈ ప్రొడక్ట్‌ను కొంటే దీనిలాగే ఉండే షాబాష్ షరీఫ్ (సోదరుడు)ను కూడా ఉచితంగా ఇచ్చేస్తాం. భావోద్వేగమైన ఉపన్యాసాలతో నాటకీయతతో మీకు మంచి వినోదాన్ని ఇది అందిస్తుంది' అని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఓ ప్రధానమంత్రిని 'ఈ బే'లో అమ్మకానికి పెట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్‌ను కూడా ఇలాగే 'ఈ బే'లో 65,900 పౌండ్లకు అమ్మకానికి పెట్టారు. -
యూనిఫామ్స్ అమ్ముకుంటున్న పోలీసులు
వెస్ట్ మిడ్ ల్యాండ్: విధులు నిర్వర్తించేందుకు తమకు ఇచ్చిన పోలీసు వస్తువులను వేలానికి పెట్టిన ఘటన వెస్ట్ మిడ్‌ల్యాండ్‌లో చోటుచేసుకుంది. దీనిపట్ల పలువురు విస్మయం వ్యక్తం చేయడంతో ప్రస్తుతానికి ఆ చర్యకు దిగిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ ఇద్దరు పోలీసులు కూడా ఆన్ లైన్ వ్యాపార సంస్థ ఈబే ద్వారా విక్రయించారు. దీంతో ఆ వస్తువులను ఈ బే సంస్థ అమ్మకానికి పెట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఒక పోలీసు అధికారి 1960నాటి హెల్మెట్స్, హ్యాండ్ కప్స్ అమ్మకానికి పెట్టగా.. మరో పోలీసు అధికారి తన మోటర్ సైకిల్ బూట్లు వేలానికి పెట్టాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా పోలీసు వస్తువులు ప్రస్తుతం ఈ బేలో వేలానికి పెట్టారు. ఈ బే సంస్థ తొలుత వాటిని విక్రయానికి ఉంచేందుకు నిరాకరించినా అది తమ వ్యక్తిగత వస్తువులు, విషయాలంటూ విక్రయాలకు పెడుతున్నారని ఇది ఇప్పుడే తమ దృష్టికి వచ్చిందని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పాడు. విక్రయాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని, మిగితా అధికారులెవరూ ఈ పనులకు దిగొద్దని హెచ్చరించారు. -
అక్టోబర్ 8 కల్లా మీచేతిలో ఐఫోన్6!
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ ద్వారా ఇండియాలో త్వరలో ప్రవేశపెట్టే 'ఐఫోన్ 6' ధర సుమారు 56 వేల రూపాయలు ఉండవచ్చని తెలుస్తోంది. ఎప్పటి నుంచి భారత్ లో అమ్మకాలు ప్రారంభించే అంశంపై ఆపిల్ కంపెనీ వివరణ ఇవ్వలేదు. ఈ కామర్స్ లో ఈబే సంస్థ ఐఫోన్ 6 ధర 55954 రూపాయలుగా నిర్ణయించింది. ఐఫోన్ అమ్మకాలు అక్టోబర్ 8 తేది నుంచి ప్రారంభించే అవకాశం ఉందని ఆ కంపెనీ నిర్వహకులు వెల్లడించారు. షాప్ క్లూ.కామ్ అనే మరో సంస్థ 16 జీబీ కెపాసిటి ఐఫోన్6 ధర 59999 వేల రూపాయలుగా, షిప్పింగ్ చార్జీలు 148 రూపాయలుగా నిర్ణయించింది. అక్టోబర్ 8 తేదికల్లా 'ఐఫోన్ 6'ను అందిస్తామని షాప్ క్లూ.కామ్ భరోసానిస్తోంది. సెప్టెంబర్ 9 తేదిన మార్కెట్ లోకి విడుదల చేసిన ఆపిల్ కంపెనీ... భారత్ లో అక్టోబర్ చివర్లోగాని, నవంబర్ లోకాని ఐఫోన్6 అమ్మకాల్ని కొనసాగిస్తామని వెల్లడించింది. అమెజాన్, ఇతర కంపెనీలు కూడా ఐఫోన్6 అమ్మకాల్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. -
ఐదేళ్లలో 50 హోల్‌సేల్ స్టోర్లు
న్యూఢిల్లీ: భారత్‌లో సొంతంగా కార్యకలాపాల విస్తరణకు అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధానంగా క్యాష్ అండ్ క్యారీ(హోల్‌సేల్) విభాగంపై దృష్టిసారించిన ఈ సంస్థ... వచ్చే 4-5 ఏళ్లలో 50 వరకూ ఈ తరహా స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. భారతీ గ్రూప్‌తో భాగస్వామ్యంతో దేశంలోకి ప్రవేశించిన వాల్‌మార్ట్.. బెస్ట్‌ప్రైస్ మోడల్ హోల్‌సేల్ బ్రాండ్ పేరుతో స్టోర్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఆరు నెలల క్రితం భారతీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత మళ్లీ ఇప్పుడు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. భారత్‌లో కార్యకలాపాల కోసం ముడుపులు ముట్టజెప్పిందన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో తమ వ్యాపార విధానాల నిబద్ధతను మరింత పటిష్టం చేయనున్నట్లు కూడా పేర్కొంది. ఆరేళ్లపాటు భారతీతో కలిసి దాదాపు 20 స్టోర్లను నిర్వహించిన వాల్‌మార్ట్... ఆ సంస్థతో విడిపోయాక ప్రకటించిన కీలక వ్యాపార వృద్ధి ప్రణాళికలు ఇవే కావడం గమనార్హం. మల్టీబ్రాండ్ రిటైల్ ప్రణాళికలపై మౌనం... ‘భారత్‌లో పెట్టుబడులకు మేం కట్టుబడి ఉన్నాం. ఇక్కడ వ్యాపార వృద్ధి ప్రణాళికల విషయంలోనూ చాలా ఉత్సుకతతో ముందుకెళ్తున్నాం. ప్రధానంగా క్యాష్ అండ్ క్యారీ విభాగంలో మా ప్రస్థానం కొనసాగుతుంది. గడిచిన కొన్నేళ్లలో ఇక్కడ రిటైల్ రంగంలో వచ్చిన మార్పుల పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విభాగంలో మరింత భారీ వృద్ధికి అవకాశాలున్నాయి. అందుకే రానున్న 4-5 ఏళ్లలో కొత్తగా 50 క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను ఏర్పాటు చేయనున్నాం. మా కస్టమర్లకు మరింత చేరువయ్యేలా... వర్చువల్ షాపింగ్ అవకాశాన్ని కల్పించేందుకు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను కూడా విస్తరించనున్నాం’ అని వాల్‌మార్ట్ ఏషియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ స్కాట్ ప్రైస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరఫరా మౌలికవసతులు, సరఫరాదారుల అభివృద్ధికి సంబంధించి కూడా పెట్టుబడులపైనా కంపెనీ దృష్టిసారిస్తోంది. అయితే, భారత్‌లో మల్టీబ్రాండ్ రిటైల్ విభాగంలోకి ఎప్పుడు ప్రవేశిస్తారన్న అంశంపై వివరాలను మాత్రం వాల్‌మార్ట్ వెల్లడించలేదు.