అమ్మకానికి ఏది అడ్డుకాదు. అందుకే అమ్మేయ్ గురు అంటుంది ఓ పాత సామాన్ల అమ్మకం వెబ్‌సైట్. పాపం పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తీరు కూడా ఎవరో ఓ నెటిజన్‌కు నచ్చనట్టు ఉంది. అందుకే ఏకంగా అమెరికన్ ఈ కామర్స్ వెబ్‌సైట్ 'ఈ బే'లో ఆయనను అమ్మకానికి పెట్టాడు. అమ్మకమంటే అలాంటి ఇలాంటి అమ్మకం కాదు.. షరీఫ్ పేరిట పెద్ద ప్రకటనే ఇచ్చాడు. ' పనికిరాని పాకిస్థానీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను అమ్మేస్తున్నాం' అంటూ ఆయన ఫొటోను పెట్టి.. 66,200 పౌండ్ల (రూ. 62.41 లక్షల) వేలం ప్రాథమిక ధరగా నిర్ణయించాడు. మరో ఆరు రోజుల్లో ఈ బిడ్డింగ్ ముగియనుంది.
ఇక ప్రకటనలో ఇచ్చిన విస్తారమైన వివరణలో షరీఫ్‌ను ఎడాపెడా ఏకీపారేశాడు సదరు అమ్మకందారుడు. 'ఇప్పటికే వాడేసిన ప్రధాని షరీఫ్‌ను అమ్మేస్తున్నాం. ఇంక ఎంతమాత్రం మాకు అవసరం లేదు. ఈ అమ్మకం
కోసం బాక్స్ కానీ ఇన్‌స్ట్రక్షన్స్ కానీ ఇవ్వబడవు. కొనుగోలుదారుడే వచ్చి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐటెం అమ్మకందారుడు ఇంతవరకు టచ్ చేయలేదు. సెంట్రల్ లండన్ నుంచి ఐటెంను కలెక్ట్ చేసుకోవచ్చు. కొనుగోలు పూర్తికాగానే పూర్తి చిరునామా తెలియజేస్తాం. కొనుగోలుదారుడే రవాణా ఏర్పాట్లు చేసుకోవాలి' అని ప్రకటనలో పేర్కొన్నాడు.
' ఈ ప్రొడక్ట్‌లో, దీని కుటుంబంలో జన్యుపరంగా లోపమున్నది. అవినీతితో భ్రష్టుపట్టినది. పనిచేసే పరిస్థితిలో లేదు. ఎప్పుడూ పనిచేయలేదు. పుట్టుకతోనే ఇది అవినీతితో లోపభూయిష్టమైనది. ఈ ప్రొడక్ట్‌ను కొంటే దీనిలాగే ఉండే షాబాష్ షరీఫ్ (సోదరుడు)ను కూడా ఉచితంగా ఇచ్చేస్తాం. భావోద్వేగమైన ఉపన్యాసాలతో నాటకీయతతో మీకు మంచి వినోదాన్ని ఇది అందిస్తుంది' అని ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే ఓ ప్రధానమంత్రిని 'ఈ బే'లో అమ్మకానికి పెట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్‌ను కూడా ఇలాగే 'ఈ బే'లో 65,900 పౌండ్లకు అమ్మకానికి పెట్టారు.
'మా ప్రధాని పనికిరాడు.. అమ్మేస్తున్నాం'
Published Thu, Apr 14 2016 3:50 PM | Last Updated on Sat, Mar 23 2019 8:29 PM
Advertisement
Advertisement