న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఖరీదైనవి, విలువైనవి ఎవరికైనా ఆసక్తి ఎక్కువే. అందులోనూ పురాతనమైన వైన్, షాంపైన్ ఖరీదైన లగ్జరీ డ్రింక్స్‌గా మందుబాబులను ఊరిస్తూ ఉంటాయి. తాజాగా ఒక బీరు బాటిల్ అంత్యంత ఖరీదైన ధరతో వార్తల్లో నిలిచింది. ఈ బీరు బాటిల్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. అవును ఈ బీరు బాటిల్ ధర అక్షరాలా ఐదు లక్షల డాలర్ల అంటే మన భారతీయ కరెన్సీలో రూ.4 కోట్ల పైనే అన్నమాట.
140 సంవత్సరాల క్రితం నాటి ‘అల్ సాప్స్ ఆర్కిటిక్ అలె’ వేలంలో అత్యంత ధర పలికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా చరిత్ర కెక్కింది. ఒక వ్యక్తి ఈ బీరు బాటిల్‌ని 5,03,300 డాలర్లకు కొనుగోలు చేయడం విశేషం. అల్‌సాప్స్ అనే బీర్ల తయారు కంపెనీ దీన్ని తయారుచేసింది. దీంటోల ఆల్కహాల్ 10 శాతం ఉండటమే దీని ప్రత్యేకత అట.
లండన్‌లోని పురాతన వస్తువులు, ఆర్ట్‌వర్క్‌కి సంబంధించిన ఆంటిక్‌ట్రేడ్ సమాచారం ప్రకారం, ఓక్లహోమాకు చెందిన ఒక కస్టమర్ 2007లో ఈబే ఆన్‌లైన్ వేలంలో దీన్ని 304 డాలర్లకు సొంతం చేసుకున్నాడు. ఈ బీరు బాటిల్‌ని స్టోర్‌లో వేలానికి పెడితే 157 మంది పోటీపడ్డారు. మసాచుసెట్స్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యాపారి ఈ బీరు బాటిల్‌కి డెలివరీ ఛార్జి కింద 19.5 డాలర్లు తీసుకున్నాడని వెల్లడించింది. ఈ బీరు బాటిల్‌పైన పాత పేపర్‌తో లామినేటెడ్ కవర్ ఉంది. ఆ కాగితం మీద చేతితో రాసిన అక్షరాలు, పెస్సీ జి.బోల్‌స్టర్ అనే పేరుతో సంతకం ఉంది. అందులో ‘ఈ బాటిల్ 1919లో నా దగ్గర ఉంది’ అని రాసి ఉంది. ఆ నోట్‌ని బట్టి ఈ బీరు బాటిల్‌ని ధ్రువ ప్రాంతాలకు వెళ్లేవాళ్ల కోసం 1852లో ప్రత్యేకంగా తయారుచేశారు అన్నట్లుగా తెలుస్తోంది.
కాగా సర్ ఎడ్వర్డ్ బెల్‌చర్ అనే నౌకాదళం అధికారి ఆర్కిటిక్ చల్లటి వాతావరణానికి తగ్గట్టుగా ఒక బీరు బాటిళ్లను తయారుచేయాలని 1852లో అల్‌సాప్స్ కంపెనీని కోరాడట. అందుకని ఆర్కిటిక్ ధ్రువంలో గడ్డకట్టకుండా ఉండేందుకు ఆల్కహాల్ శాతం ఎక్కువ (10శాతం) ఉండేలా ఈ బీరుని తయారుచేశారు. ఎడ్వర్డ్ ఈ బీరు బాటిళ్లను బ్రిటీష్ నౌకాదళం అధికారి, ఆర్కిటిక్ యాత్రికుడు సర్ జాన్ ఫ్రాంక్లిన్, అతని టీం కోసం ఆర్కిటిక్ ధ్రువానికి పంపించాడని యాంటిక్ ట్రేడ్ వెబ్‌సైట్ తెలియజేస్తోంది.ఎరేబస్, టెర్రర్ , వారి సిబ్బందిని కనుగొనడానికి రెస్క్యూ ప్రయత్నాల తర్వాత బీర్ బాటిల్ కనుగొన్నారట. దురదృష్టవశాత్తు, ఇద్దరు సిబ్బందికి సంబంధించిన ఆధారాలు ఎప్పుడూ కనిపించలేదు.
Comments
Please login to add a commentAdd a comment