ఫ్లిప్‌‘కార్ట్‌’లోకి ఈబే ఇండియా? | Flipkart may buy eBay's India operations as part of its $2bn fund raising | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌‘కార్ట్‌’లోకి ఈబే ఇండియా?

Published Sat, Mar 25 2017 12:53 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ఫ్లిప్‌‘కార్ట్‌’లోకి ఈబే ఇండియా? - Sakshi

ఫ్లిప్‌‘కార్ట్‌’లోకి ఈబే ఇండియా?

భారత విభాగం  విక్రయంపై ఈబే చర్చలు
ఫ్లిప్‌కార్ట్‌లో మైనారిటీ వాటాలు కొనుగోలు యోచన
500 మిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడి ప్రతిపాదన


ముంబై: దేశీ ఈ–కామర్స్‌ మార్కెట్లో ప్రస్తుతం కన్సాలిడేషన్‌ పర్వం నడుస్తోంది. ఇప్పటికే స్నాప్‌డీల్‌ విక్రయం వార్తలు నడుస్తుండగా.. తాజాగా ఈబే కూడా ఈ జాబితాలో చేరింది.  మార్కెట్లోకి ప్రవేశించి దశాబ్దం పైగా దాటిపోయినా.. ఇప్పటికీ నిలదొక్కుకోలేకపోయిన ఈబే తాజాగా తమ భారత విభాగాన్ని మరో ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

ప్రతిపాదిత డీల్‌ ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌లో మైనారిటీ వాటాల కోసం 500 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం 1.5–2 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు సమీకరించే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే చైనాకి చెందిన టెన్సెంట్, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ నుంచి సుమారు 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఖరారయ్యాయి. ఒకప్పుడు 15 బిలియన్‌ డాలర్ల పైగా పలికిన ఫ్లిప్‌కార్ట్‌ వేల్యుయేషన్‌ తాజా నిధుల సమీకరణ సమయంలో సుమారు 11 బిలియన్‌ డాలర్ల స్థాయికి తగ్గిపోయింది. ప్రస్తుతం సమీకరిస్తున్న పెట్టుబడులు.. అత్యంత వేగంగా విస్తరిస్తున్న అమెజాన్‌కి గట్టి పోటీనిచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్‌కి చాలా కీలకం కానున్నాయి.

సంపన్న మార్కెట్లపై దృష్టి..
ప్రస్తుతమున్న చాలా మటుకు ఈకామర్స్‌ సంస్థల కన్నా ముందుగా భారత మార్కెట్లోకి ఈబే అడుగుపెట్టినప్పటికీ.. అంతగా విజయవంతం కాలేకపోయింది. 2004లో బాజీడాట్‌కామ్‌ను కొనుగోలు చేసిన ఈబే 2005లో అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. కానీ కొనుగోలుదారులకు పెద్దగా చేరువకాలేకపోయింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి దిగ్గజాలే కాకుండా చాన్నాళ్ల తర్వాత వచ్చిన స్నాప్‌డీల్, పేటీఎం, షాప్‌క్లూస్‌ వంటి సంస్థలు కూడా దూసుకెడుతుండగా.. ఈబే మాత్రం రాణించలేక చతికిలబడింది.

2015లో రూ. 172 కోట్లు, గతేడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం రూ. 262 కోట్ల మేర నష్టాలు నమోదు చేసింది. అంతర్జాతీయంగా కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరించుకుంటున్న ఈబే ప్రధానంగా మళ్లీ అమెరికా, యూరప్‌ వంటి సంపన్న మార్కెట్లపై దృష్టి సారిస్తోంది. భారత్‌ మార్కెట్‌పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే, అలాగని పూర్తిగా వైదొలగాలని కూడా భావించడం లేదు. ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడుల ద్వారా అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఈ–కామర్స్‌ మార్కెట్లో ఎంతో కొంత వాటాలతో కొనసాగాలని ఈబే యోచిస్తోంది.

దూకుడుగా అమెజాన్‌ ..
అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశీ ఈకామర్స్‌ మార్కెట్‌ విలువ గతేడాది 18 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 2030 నాటికి ఇది 228 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో భారత ఈకామర్స్‌ మార్కెట్లో కార్యకలాపాలు విస్తరించడంపై అమెజాన్‌ దూకుడుగా ఉంది. దాదాపు 5 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయబోతోంది. దేశీయంగా సీ2సీ ఈ–కామర్స్‌ మార్కెట్లో ప్రస్తుతం క్వికర్, ఓఎల్‌ఎక్స్‌ సంస్థలు ఇందులో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. స్నాప్‌డీల్‌ ఇటీవలే షాపో సంస్థను మూసివేయడం ద్వారా ఈ విభాగం నుంచి వైదొలిగినప్పటికీ.. అమెజాన్‌ మాత్రం ఈ మార్కెట్‌పై ఆశావహంగా ఉంది. మరోవైపు వివిధ మార్గాల్లో చైనాకి చెందిన ఆలీబాబా, జపాన్‌ సంస్థ రకుటెన్‌ మొదలైనవి కూడా భారత ఈ–కామర్స్‌ మార్కెట్లో చొరబడేందుకు పోటీపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement