సాక్షి, ముంబై: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. గత రెండేళ్లుగా ఉద్యోగులను తగ్గించుకుంటూ వస్తున్న తాజాగా నియామకాలకు తెరతీసింది. ఫ్లిప్‌కార్ట్‌లో కీలకమైన పలు రంగాల్లో ఉద్యోగుల సంఖ‍్యను పెంచుకునేందుకు సిద్ధమైంది. డేటా సైన్స్ అండ్ ఎనలిటిక్స్ సహా ఇతర ఏరియాల్లో ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనుంది.
హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ సంస్థల తాజా నివేదికల ప్రకారం ఫ్లిప్‌కార్ట్ లో 700కు పైగా ఉద్యోగావకాశాలను కల్పించనుంది. వీటిలో అధికంగా టెక్నాలజీరంగంలోనే ఈ నియామకాలు చేపట్టనుంది. ముఖ్యంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ & సర్వీస్ డెలివరీ, ఐటీ అప్లికేషన్లు, డేటా సైంటిస్టులు, యూఐ, యూఎక్స్ డిజైనర్లు, ప్రొడక్ట్ సొల్యూషన్ ఇంజనీర్లు, టెక్‌ప్రోగ్రామ్ ఇంజనీర్లపై దృష్టిపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత సేవలను దేశానికి అందించే వ్యూహంలో భాగంగా భారీగా ఉద్యోగులను నియమించుకోనున్నామంటూ ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి ఒకరు ఈ వార్తలను ధృవీకరించారు.
కాగా ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఫ్లిప్‌కార్ట్ గతరెండేళ్లుగా భారీగా ఉద్యోగులపై వేటు వేసింది. దీంతో 2016, 2017ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య గణనీయంగా క్షీణించింది. 2015 చివరి నాటికి 15 వేలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 8వేలకు పడిపోయింది. అయితే ఇటీవల ఫ్లిప్‌కార్ట్ ఇటీవల క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను కూడా నిర్వహించింది. ఈ సందర్బంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన 20మంది విద్యార్థులను ఎంపిక చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment