వాల్‌'మార్ట్‌' లోకి.. ఫ్లిప్‌'కార్ట్'! | Flipkart-Walmart $16 Billion Deal | Sakshi
Sakshi News home page

వాల్‌'మార్ట్‌' లోకి.. ఫ్లిప్‌'కార్ట్'!

Published Thu, May 10 2018 1:11 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

Flipkart-Walmart $16 Billion Deal - Sakshi

న్యూఢిల్లీ :  సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఒక డబుల్‌ బెడ్రూమ్‌ అపార్ట్‌మెంట్‌లో మొదలైన దేశీ ఈ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌... దేశీయంగా ముందెన్నడూ ఎరుగని భారీ విదేశీ డీల్‌కు తెరతీసింది. భారత్‌ ఆన్‌లైన్‌ రిటైల్‌ రంగంలో కొద్దిరోజులుగా అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న మెగా డీల్‌...  ఎట్టకేలకు సాకారమైంది. అమెరికా రిటైల్‌ అగ్రగామి వాల్‌మార్ట్‌... ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.

ఇందుకోసం 16 బిలియన్‌ డాలర్లను (దాదాపు రూ.1,05,000 కోట్లు) చెల్లించడానికి వాటాదారులతో ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగా ఫ్లిప్‌కార్ట్‌లో 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ తెలియజేసింది. ఈ మొత్తం కూడా కొనుగోలు విలువలో భాగమే. ప్రస్తుత డీల్‌ ప్రకారం చూస్తే... ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీ విలువ(వేల్యుయేషన్‌) 20.8 బిలియన్‌ డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1,40,000 కోట్లు.

ఫ్లిప్‌కార్ట్‌ను చేజిక్కించుకోవడం కోసం మరో అమెరికాఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కూడా చివరివరకూ ప్రయత్నించినప్పటికీ... వాల్‌మార్ట్‌ ఈ పోరులో విజయం సాధించింది. వాల్‌మార్ట్‌ ఇప్పటిదాకా చేపట్టిన కంపెనీల కొనుగోళ్లలో ఇదే అతిపెద్దది. అంతేకాదు!! ప్రపంచ ఈ–కామర్స్‌ రంగంలో అత్యంత భారీ కొనుగోలు డీల్‌గా కూడా ఇది రికార్డు సృష్టించింది.

సాఫ్ట్‌బ్యాంక్‌... సచిన్‌ బన్సల్‌ గుడ్‌బై
బెంగళూరు కేంద్రంగా 2007లో ఫ్లిప్‌కార్ట్‌ను నెలకొల్పిన సహ–వ్యవస్థాపకులు సచిన్‌ బన్సల్, బిన్నీ బన్సల్‌లు ఇకపై చెరోదారి చూసుకోనున్నారు. వాల్‌మార్ట్‌ కొనుగోలు చేస్తున్న 77 శాతం వాటాలో సచిన్‌ బన్సల్‌ వాటా కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో తనకున్న మొత్తం వాటాను విక్రయించేసి కంపెనీ నుంచి వైదొలగాలని సచిన్‌ బన్సల్‌ నిర్ణయించుకున్నారు. బిన్నీ బన్సల్‌ మాత్రం తన వాటాను అట్టిపెట్టుకోనున్నారు. వీరిద్దరికీ చెరో 5.5 శాతం చొప్పున వాటాలున్నాయి.

సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ తన మొత్తం 20 శాతం వాటాను (పెట్టుబడి విలువ 2.5 బిలియన్‌ డాలర్లు) 4 బిలియన్‌ డాలర్లకు విక్రయించింది. ఇక దక్షిణాఫ్రికా సంస్థ నాస్పెర్స్‌ 2012లో 616 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టి 11.18 శాతం వాటా తీసుకుంది. దీన్ని కూడా ఆ కంపెనీ 2.2 బిలియన్‌ డాలర్లకు వాల్‌మార్ట్‌కు పూర్తిగా విక్రయించేసింది. ‘డీల్‌లో భాగంగా కొత్తగా మేం పెడుతున్న 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఫ్లిప్‌కార్ట్‌ భవిష్యత్తు వృద్ధి జోరుకు బాటలు వేస్తాయి.

అంతేకాదు కొత్తగా కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు తగిన ఇన్వెస్టర్లెవరైనా ముందుకొస్తే స్వాగతిస్తాం కూడా. మొత్తంమీద ఈ డీల్‌ పూర్తయ్యేనాటికి ఫ్లిప్‌కార్ట్‌లో మా వాటా కొంత తగ్గొచ్చు. అయినా కూడా నియంత్రణ వాటా మా చేతుల్లోనే ఉంటుంది’ అని వాల్‌మార్ట్‌ ఒక ప్రకటనలో వివరించింది. ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌... ఫ్లిప్‌కార్ట్‌లో 15 శాతం వాటాను కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చైర్మన్‌గా బిన్నీ బన్సల్‌...
వాల్‌మార్ట్‌ డీల్‌ తర్వాత బిన్నీ బన్సల్‌ కంపెనీ చైర్మన్‌గా ఉంటారు. వాల్‌మార్ట్‌కు చెందిన క్రిష్‌ అయ్యర్‌ కంపెనీ సీఈఓగా వ్యవహరిస్తారు. బెంగళూరు ప్రధాన కేంద్రంగానే ఫ్లిప్‌కార్ట్‌ కార్యకలాపాలు కొనసాగుతాయి. డీల్‌ పూర్తయిన తర్వాత కూడా వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌ రెండు వేర్వేరు బ్రాండ్‌లుగానే ఉంటాయి. కంపెనీ డైరెక్టర్ల బోర్డులో వాల్‌మార్ట్‌కు తగిన ప్రాతినిధ్యం దక్కుతుంది. కాగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వాటాదారులుగా ఉన్న టెన్సెంట్‌ హోల్డింగ్స్, టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్, మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌లు తాజా డీల్‌లో తమ వాటాను విక్రయించడం లేదని, డీల్‌ తర్వాత కూడా యథాతథంగా కొనసాగుతాయని వాల్‌మార్ట్‌ వెల్లడించింది.

ఐపీఓను సాకారం చేస్తాం...
తమ తక్షణ కార్యాచరణ మొత్తం కస్టమర్లకు మరింత మెరుగైన సేవలతో పాటు వ్యాపారాన్ని వృద్ధి చేయడంపైనే ఉంటుందని డీల్‌ సందర్భంగా వాల్‌మార్ట్‌ పేర్కొంది. అంతేకాకుండా ఫ్లిప్‌మార్ట్‌ కలలు గన్నట్లుగా భవిష్యత్తులో పబ్లిక్‌ ఆఫర్‌ను కూడా సాకారం చేస్తామని తెలిపింది. కంపెనీని పబ్లిక్‌ లిస్టెడ్‌గా మార్చేందుకు తాము సుముఖమేనని స్పష్టం చేసింది. కాగా, కాంపిటీషన్‌ కమిషన్‌(సీసీఐ) తదితర నియంత్రణ సంస్థల అనుమతులు ఈ ఒప్పందానికి కీలకం కానున్నాయి. ఈ ఏడాది చివరికల్లా డీల్‌ పూర్తవుతుందని∙అంచనా.


పరిమాణం, వృద్ధి పరంగా కూడా ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన రిటైల్‌ మార్కెట్లలో భారత్‌ ఒకటి. ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు ద్వారా ఇక్కడి ఈ–కామర్స్‌ మార్కెట్‌ వృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఈ రంగంలో పెనుమార్పులు సాకారమవుతాయి. ఇక్కడి వినియోగదారులు తమ ఖర్చుకు తగ్గ నాణ్యమైన ఉత్పత్తులను చౌకగా అందుకోవడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా కొత్తగా నిపుణులకు ఉద్యోగావకాశాలు, చిన్న సప్లయర్లు, రైతులు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా తాజా అవకాశాలు తలుపుతడతాయి. – డగ్‌ మెక్‌మిలన్, వాల్‌మార్ట్‌ ప్రెసిడెంట్, సీఈఓ

ఫ్లిప్‌కార్ట్‌ భవిష్యత్తు గమనానికి వాల్‌మార్ట్‌తో భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుంది. భారత్‌ రిటైల్‌ రంగంలో ఈ–కామర్స్‌ వాటా ఇంకా చాలా తక్కువే ఉంది. ఇది భవిష్యత్తులో దూసుకెళ్లేందుకు అపారమైన అవకాశాలున్నాయి. – బిన్నీ బన్సల్, ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు


ఆన్‌లైన్‌లో పుస్తకాల నుంచి ఆకాశానికి...
2007లో ఒక ఆన్‌లైన్‌ బుక్‌స్టోర్‌గా మొదలైన ఫ్లిప్‌కార్ట్‌... ఆ తర్వాత ఆకాశమే హద్దుగా దూసుకెళ్లింది. మింత్రా, జబాంగ్‌ వంటి ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ రిటైలర్లను కొనుగోలు చేసి ఈ రంగంలో నంబర్‌వన్‌గా ఆవిర్భవించింది. భారత్‌ ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ బిజినెస్‌లో ఈ మూడింటి వాటా ఏకంగా 70 శాతం. భారత్‌లో స్టార్టప్‌ కంపెనీల విజయాలకు మార్గదర్శకంగా, ఒక ట్రెండ్‌సెట్టర్‌గా ఫ్లిప్‌కార్ట్‌ నిలిచింది. ప్రపంచ ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రస్థానం కూడా ఆన్‌లైన్‌ బుక్‌ స్టోర్‌గానే మొదలవడం విశేషం. ఫ్లిప్‌కార్ట్‌ ఎలా ఎదిగిందంటే...

ఐఐటీ ఢిల్లీలో కలిసి చదువుకున్న సచిన్‌ బన్సల్, బిన్నీ బన్సల్‌ (వీరిద్దరూ బంధువులు కారు) ఫ్లిప్‌కార్ట్‌కు 2007 అక్టోబర్‌లో బీజం వేశారు. 4 లక్షల రూపాయల పెట్టుబడితో వ్యాపారాన్ని మొదలుపెట్టారు. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లోని రెండు బెడ్రూమ్‌ల ఫ్లాట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా బుక్స్‌ విక్రయం మొదలైంది. వీళ్లిద్దరూ అంతకుముందు అమెజాన్‌లో పనిచేశారు.
 తొలిసారిగా విక్రయించిన పుస్తకం జాన్‌ ఉడ్స్‌ రాసిన ‘లీవింగ్‌ మైక్రోసాఫ్ట్‌ టు చేంజ్‌ ద వరల్డ్‌’. మొదటి ఏడాది కంపెనీ 20 పుస్తకాలను మాత్రమే విక్రయించింది.
   2009లో తొలిసారిగా అంబర్‌ అయ్యప్ప అనే వ్యక్తిని పూర్తిస్థాయి ఉద్యోగిగా కంపెనీ నియమించుకుంది. ఆయనకు ఇచ్చిన షేర్లతో ఎప్పుడో కోటీశ్వరుడయ్యాడు. అదే ఏడాది చివరికి ఉద్యోగుల సంఖ్య 150కి చేరింది.
    2009 అక్టోబర్‌లో యాక్సెస్‌ పార్ట్‌నర్స్‌ మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టడం ద్వారా కంపెనీ  డైరెక్టర్ల బోర్డులో చేరింది.
    ఆ తర్వాత కొద్ది నెలల్లోనే అమెరికా హెడ్జ్‌ ఫండ్‌ టైగర్‌ గ్లోబల్‌ కూడా 10 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి ముందుకొచ్చింది.
 2010లో భారత ఆన్‌లైన్‌ షాపింగ్‌ రూపురేఖలను మార్చేస్తూ తొలిసారిగా ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ’ని ప్రారంభించింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, మొబైల్‌ ఫోన్స్‌ విక్రయాలను మొదలుపెట్టింది. ఇప్పుడు కంపెనీ విక్రయాల్లో అత్యధికంగా ఇవే ఉండటం గమనార్హం.
   2011లో ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీని సింగపూర్‌లో రిజిస్టర్‌ చేశారు.
♦   తర్వాత కాలంలో టెన్సెంట్, ఈబే, మైక్రోసాఫ్ట్‌ల నుంచి 1.4 బిలియన్‌ డాలర్లను కంపెనీ సమీకరించింది. అయితే, అత్యధికంగా జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ 2.5 బిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. తద్వారా మెజారిటీ వాటాదారుగా నిలిచింది.
♦   ఇప్పటివరకూ ఫ్లిప్‌కార్ట్‌ మింత్రా, జబాంగ్‌ వంటి ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ రిటైలర్లతో పాటు వియ్‌రీడ్, లెట్స్‌బై, ఎఫ్‌ఎక్స్‌ మార్ట్‌ వంటి కంపెనీలను కొనుగోలు చేసింది. ఇంకా ఆన్‌లైన్‌ పేమెంట్‌ యాప్‌ ఫోన్‌ పేను కూడా దక్కించుకుంది. జీవ్స్, ఎన్‌జీపే వంటి సంస్థల్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది.
   2017లో కంపెనీ తొలిసారిగా 10కోట్ల మంది యూజర్ల మైలురాయిని దాటింది.
   గతేడాది కంపెనీ మేనేజ్‌మెంట్‌లో భారీ మార్పులు జరిగాయి. టైగర్‌ గ్లోబల్‌ ఎగ్జిక్యూటివ్‌ కల్యాణ్‌ కృష్ణమూర్తి సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. బిన్నీ బన్సల్‌ గ్రూప్‌ సీఈఓగా, సచిన్‌ బన్సల్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
 దేశీ ఈ–కామర్స్‌ కంపెనీ స్నాప్‌డీల్‌ను కొనుగోలు చేసేందుకు గతేడాది ఫ్లిప్‌కార్ట్‌ ప్రయత్నించినా అది సాకారం కాలేదు.
 ప్రస్తుతం కంపెనీకి లక్ష మంది రిజిస్టర్డ్‌ సెల్లర్లతో పాటు 21 గిడ్డంగులు (వేర్‌హౌజ్‌) ఉన్నాయి. 6,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 17.5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
 ప్రస్తుతం ప్రతి నెలా 80కి పైగా విభాగాల్లో 17 మిలియన్‌లకు పైగా ఉత్పత్తులను కంపెనీ విక్రయిస్తోంది. రోజుకు 2 కోట్ల మంది యూజర్లు పోర్టల్, యాప్‌లను సందర్శిస్తున్నారు.
 ప్రస్తుతం భారత్‌ ఈ–కామర్స్‌ విక్రయాల్లో ఫ్లిప్‌కార్ట్‌కు 34 శాతం, అమెజాన్‌కు 27 శాతం వాటాలున్నాయి. 2017–18లో ఫ్లిప్‌కార్ట్‌ద విక్రయాలు 50 శాతం పైగా ఎగబాకి 4.6 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

వాల్‌మార్ట్‌ సంగతిదీ...
ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్‌ కంపెనీ అయిన వాల్‌మార్ట్‌... ప్రస్తుత మార్కెట్‌ విలువ 252 బిలియన్‌ డాలర్లు. అమెరికా మార్కెట్లో ఆన్‌లైన్‌లో అమెజాన్‌తో పోటీ పడేందుకు చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు.
   2007లో భారతీ ఎంటర్‌ప్రైజెస్‌తో జట్టుకట్టి దేశీయంగా హోల్‌సేల్‌ స్టోర్లను ఏర్పాటు చేసింది. 2009లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో తొలి ‘బెస్ట్‌ప్రైస్‌’ స్టోర్‌ను తెరిచింది.
  భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వైదొలగడంతో వాల్‌మార్ట్‌ ఇండియా 2014లో వాల్‌మార్ట్‌కు పూర్తి అనుబంధ సంస్థగా మారింది.
  ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో వాల్‌మార్ట్‌ ఇండియా 21 బెస్ట్‌ప్రైస్‌ హోల్‌సేల్‌ స్టోర్లను నిర్వహిస్తోంది.
♦  2016లో అమెరికా ఆన్‌లైన్‌ రిటైలర్‌ జెట్‌.కామ్‌ను వాల్‌మార్ట్‌ ఇంక్‌ 3 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌ ఒప్పందమే కంపెనీ చరిత్రలో అతిపెద్ద డీల్‌.


ఈ ఏడాది ఇదే అతిపెద్ద డీల్‌..
భారత కార్పొరేట్‌ రంగంలో ఫ్లిప్‌కార్ట్‌–వాల్‌మార్ట్‌ డీల్‌ ఈ ఏడాది ఇప్పటివరకూ జరిగిన అతిపెద్ద డీల్‌గా నిలిచింది. దేశీయంగా మెగా డీల్స్‌ను పరిశీలిస్తే...
2016
ఐడియా సెల్యులార్‌తో బ్రిటిష్‌ టెలికం కంపెనీ వొడాఫోన్‌ విలీన ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌ విలువు 23 బిలియన్‌ డాలర్లు. ఒప్పందం ఇంకా పూర్తి కావాల్సి ఉంది.
ఎస్సార్‌ ఆయిల్‌ను రష్యా చమురు–గ్యాస్‌ దిగ్గజం రాస్‌నెఫ్ట్‌ 12.9 బిలియన్‌ డాలర్ల మొత్తానికి కొనుగోలు చేసింది. అప్పటికి భారత్‌లోకి వచ్చిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) ఇదే. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌ విషయానికొస్తే... సింగపూర్‌లో రిజిస్టర్‌ అయిన హోల్డింగ్‌ కంపెనీని వాల్‌మార్ట్‌ కొనుగోలు చేస్తోంది.
జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ సిమెంట్‌ వ్యాపారాన్ని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కొనుగోలు చేసింది. డీల్‌ విలువ 2.4 బిలియన్‌ డాలర్లు.
లఫార్జ్‌ ఇండియాను నిర్మా 1.4 బిలియన్‌ డాలర్లు వెచ్చించి చేజిక్కించుకుంది.

2011
♦  బ్రిటన్‌ కంపెనీ కెయిర్న్‌ ఇండియాలో 58.5 శాతం వాటాను వేదాంత రిసోర్సెస్‌ కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ 8.67 బిలియన్‌ డాలర్లు.
♦  బ్రిటన్‌కు చెందిన బ్రిటిష్‌ పెట్రోలియం... రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కేజీ–డీ6తో పాటు 23 చమురు–గ్యాస్‌ క్షేత్రాల్లో 30% వాటాను దక్కించుకుంది. ఈ ఒప్పందం విలువ 7.2 బిలియన్‌ డాలర్లు.

2008
 జపాన్‌ ఔషధ దిగ్గజం దైచీ శాంక్యో... 4.6 బిలియన్‌ డాలర్లు చెల్లించి భారత్‌ కంపెనీ రాన్‌బ్యాక్సీని సొంతం చేసుకుంది.
టాటా టెలీసర్వీసెస్‌లో 26 శాతం వాటాను జపాన్‌ కంపెనీ ఎన్‌టీటీ డొకోమో కొనుగోలు చేసింది. డీల్‌ విలువ 2.7 బిలియన్‌ డాలర్లు.
♦  2007లో హచిసన్‌ వాంపోవా భారత్‌ టెలికం వ్యాపారంలో 67% వాటాను వొడాఫోన్‌ కొనుగో లు చేసింది. డీల్‌ విలువ 11.1 బిలియన్‌ డాలర్లు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement