ఆధునిక పన్నుల వ్యవస్థను ఆవిష్కరిస్తాం..
ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన
వాషింగ్టన్: ఆధునిక పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. తక్కువ స్థాయిలో... అంతర్జాతీయంగా పోటీపూర్వక పన్ను రేట్లను తీసుకువస్తామని అన్నారు. ఎటువంటి రెట్రాస్పెక్టివ్ (గత కాలపు డీల్స్‌ను తిరగదోడి పన్నులు విధించడం) చర్య గురించీ విదేశీ ఇన్వెస్టర్లు ఆందోళన పడనక్కర్లేదని హామీ ఇచ్చారు. ఆయా సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికి కృషి జరుగుతుందన్నారు.
పన్ను చెల్లింపుదారులకు ‘భాగస్వాములుగా’ పరిగణించడం జరుగుతుందని, వారిని ‘బందీలుగానో లేక బాధితులుగానో’ చూడబోమని అన్నారు. ట్యాక్స్ బేస్ పెంపు ద్వారా వసూళ్లు పెంపు లక్ష్యంతో వ్యూహరచన చేస్తామన్నారు. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికి ఆర్థికమంత్రి వాషింగ్టన్ విచ్చేశారు.
ఉద్దేశపూర్వక ఎగవేతలను ఉపేక్షించం...
ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతలను ఎట్టి పరిస్థితులోనూ ఉపేక్షించబోమని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వస్తువులు సేవల పన్నుకు సంబంధించి అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లుకు రానున్న మూడు నెలల్లో పార్లమెంటు ఆమోదముద్ర పడుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రానున్న కాలంలో పన్ను-జీడీపీ నిష్పత్తిని పెంచడానికి కృషి చేస్తామన్నారు.
నాలుగేళ్లలో కార్పొరేట్ పన్ను కోత...
ఆసియా దేశాల్లో సగటు కార్పొరేట్ పన్ను రేటు 21 నుంచి 22 శాతంగా ఉందని, దేశంలో వచ్చే నాలుగేళ్లలో ఈ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడానికి తగ్గించనున్నట్లు తెలిపారు. 2016 నుంచీ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. స్టాక్‌లు మినహా ఇతర పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్‌మెంటుకు అవకాశం కల్పించే ప్రత్యామ్నాయ పెట్టుబడుల ఫండ్స్‌లె విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించాలన్న డిమాండ్‌ను జైట్లీ ప్రస్తావించారు. ఇందుకు వీలుగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.