సెబీలో ఎఫ్‌ఎంసీ విలీనం
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీలో ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ (ఎఫ్‌ఎంసీ)ని విలీనం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. స్పెక్యులేషన్‌ను నియంత్రించేందుకు, కమోడిటీలు .. క్యాపిటల్ మార్కెట్లకు ఒకే నియంత్రణ సంస్థ ఉండేలా చూసేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన వివరించారు. నేషనల్ స్పాట్ ఎక్స్చేంజీ చెల్లింపుల సంక్షోభం నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. సెబీలో ఎఫ్‌ఎంసీ విలీనాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి.
కమోడిటీ మార్కెట్లకు సంబంధించి ఇది చాలా కీలక నిర్ణయమని ఎన్‌సీడీఈఎక్స్ ఎండీ సమీర్ షా చెప్పారు. దీనివల్ల పలు సమస్యలు పరిష్కారం కాగలవన్నారు. ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేసే ఎఫ్‌ఎంసీ .. వినియోగదారుల వ్యవహారాల శాఖ కింద 1953లో ఏర్పాటైంది. దీన్ని 2013లో ఆర్థిక శాఖ కిందికి తెచ్చారు. దేశీయంగా కమోడిటీ ఫ్యూచర్స్‌కి సంబంధించి జాతీయ స్థాయిలో నాలుగు, ప్రాంతీయ స్థాయిలో ఆరు ఎక్స్చేంజీలు ఉన్నాయి.