Forward Markets Commission
-
సెబీలో ఎఫ్ఎంసీ విలీనం
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీలో ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ (ఎఫ్ఎంసీ)ని విలీనం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. స్పెక్యులేషన్‌ను నియంత్రించేందుకు, కమోడిటీలు .. క్యాపిటల్ మార్కెట్లకు ఒకే నియంత్రణ సంస్థ ఉండేలా చూసేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన వివరించారు. నేషనల్ స్పాట్ ఎక్స్చేంజీ చెల్లింపుల సంక్షోభం నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. సెబీలో ఎఫ్ఎంసీ విలీనాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. కమోడిటీ మార్కెట్లకు సంబంధించి ఇది చాలా కీలక నిర్ణయమని ఎన్సీడీఈఎక్స్ ఎండీ సమీర్ షా చెప్పారు. దీనివల్ల పలు సమస్యలు పరిష్కారం కాగలవన్నారు. ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేసే ఎఫ్ఎంసీ .. వినియోగదారుల వ్యవహారాల శాఖ కింద 1953లో ఏర్పాటైంది. దీన్ని 2013లో ఆర్థిక శాఖ కిందికి తెచ్చారు. దేశీయంగా కమోడిటీ ఫ్యూచర్స్కి సంబంధించి జాతీయ స్థాయిలో నాలుగు, ప్రాంతీయ స్థాయిలో ఆరు ఎక్స్చేంజీలు ఉన్నాయి. -
స్పాట్ ఎక్స్ఛేంజీ సమస్యలపై ప్రభుత్వ ప్రత్యేక టీమ్ !
న్యూఢిల్లీ: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) సమస్యలపై దృష్టి సారించేందుకు ప్రత్యేక బృందాన్ని(టీమ్‌ను) ఏర్పాటు చేయాలని ప్రధాని కార్యాలయం భావిస్తోంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ సారథ్యంలో టీమ్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వినియోగ వ్యవహారాలు, కార్పొరేట్ వ్యవహారాల శాఖల కార్యదర్శులతోపాటు, రిజర్వ్ బ్యాంకు, సెబీ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ తదితర నియంత్రణ సంస్థల అధికారులకు టీమ్‌లో స్థానం కల్పించనున్నట్లు తెలిపాయి. వివిధ కమోడిటీ కాంట్రాక్ట్‌ల సెటిల్మెంట్కు సంబంధించి రూ. 5,600 కోట్ల చెల్లింపుల విషయంలో ఎన్ఎస్ఈఎల్ విఫలంకాగా, ప్రభుత్వం కల్పించుకుని ట్రేడింగ్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. సెటిల్మెంట్ ప్రణాళిక : ఎన్ఎస్ఈఎల్ రూ. 5,600 కోట్ల చెల్లింపులకు సంబంధించిన ప్రణాళికను కమోడిటీ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్(ఎఫ్ఎంసీ)కు నివేదించింది. వివిధ కమోడిటీ కాంట్రాక్ట్‌ల సెటిల్మెంట్కు సంబంధించిన చెల్లింపులను ఏడు నెలల్లో చెల్లించేందుకు వీలుగా ఈ ప్రణాళికను రూపొందించింది. అయితే బ్రోకర్లు, ఇన్వెస్టర్ల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నాక దీనిపై ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు ఎఫ్ఎంసీ తెలిపింది. మరోవైపు ఇండియన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్(ఐబీఎంఏ)కు అనుమతి లేకుండా ఎలాంటి చెల్లింపులనూ చేపట్టవద్దని ఎన్‌ఎస్‌ఈఎల్‌ను ఆదేశించింది. ఎన్ఎస్ఈఎల్ తాజా ప్రణాళిక ప్రకారం చెల్లింపులు ఈ నెల 16న మొదలై వచ్చే ఏడాది మార్చి 11వరకూ కొనసాగనున్నాయి. అయితే సెటిల్మెంట్లో భాగంగా 13,000 మంది ఇన్వెస్టర్లకు ఐదు నెలల్లో చెల్లింపులను చేపట్టేందుకు సిద్ధమంటూ ఇంతక్రితం ప్రకటించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. -
డిఫాల్టర్లపై చర్యలు తీసుకోవాలి: ఎన్ఎస్ఈఎల్
ముంబై: చెల్లింపుల సంక్షోభం నేపథ్యంలో కమోడిటీ కాంట్రాక్ట్‌లలో ట్రేడింగ్ నిలిపివేసిన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) లావాదేవీల పరిష్కారానికి(సెటిల్మెంట్స్) స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించి రూ. 5,600 కోట్ల విలువైన లావాదేవీలను సెటిల్ చేయాల్సి ఉంది. ఇందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీను నియమించినట్లు ఎన్ఎస్ఈఎల్ తెలిపింది. కంపెనీ లాబోర్డ్ మాజీ చైర్మన్ శరద్ ఉపాసని అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్ఎస్ఈఎల్ ప్రమోటర్ జగ్నేష్ షా పేర్కొన్నారు. మిగిలిన సభ్యులలో ముంబై హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి ఆర్జే కొచర్, సెబీ, ఎల్ఐసీలకు గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన జీఎన్ బాజ్‌పాయ్, మహారాష్ర్ట మాజీ డీజీపీ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 14కల్లా చెల్లింపుల ప్రణాళికను వెల్లడించగలమని షా చెప్పారు. కాగా, చెల్లింపుల ప్రణాళికకు సహకరించని బ్రోకర్లు, సభ్యులపై తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా ఎన్ఎస్ఈఎల్ ప్రభుత్వాన్ని కోరింది. కమోడిటీ మార్కెట్లను నియంత్రించే ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్ ఎన్ఎస్ఈఎల్ సెటిల్మెంట్ అంశాన్ని పరిష్కరిస్తుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఫైనాన్షియల్ టెక్ షేరు హైజంప్ ఈ వార్తల నేపథ్యంలో ప్రమోటర్ కంపెనీ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు ధర బీఎస్ఈలో 31%(రూ. 47) ఎగసి రూ. 198 వద్ద ముగిసింది. అయితే గ్రూప్‌లోని మరో కంపెనీ ఎంసీఎక్స్ షేరు మాత్రం 10%(రూ. 41) పతనమై(లోయర్ సర్క్యూట్) రూ. 361 వద్ద నిలిచింది.