న్యూఢిల్లీ: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్) సమస్యలపై దృష్టి సారించేందుకు ప్రత్యేక బృందాన్ని(టీమ్‌ను) ఏర్పాటు చేయాలని ప్రధాని కార్యాలయం భావిస్తోంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ సారథ్యంలో టీమ్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వినియోగ వ్యవహారాలు, కార్పొరేట్ వ్యవహారాల శాఖల కార్యదర్శులతోపాటు, రిజర్వ్ బ్యాంకు, సెబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ తదితర నియంత్రణ సంస్థల అధికారులకు టీమ్‌లో స్థానం కల్పించనున్నట్లు తెలిపాయి. వివిధ కమోడిటీ కాంట్రాక్ట్‌ల సెటిల్‌మెంట్‌కు సంబంధించి రూ. 5,600 కోట్ల చెల్లింపుల విషయంలో ఎన్‌ఎస్‌ఈఎల్ విఫలంకాగా, ప్రభుత్వం కల్పించుకుని ట్రేడింగ్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
సెటిల్‌మెంట్ ప్రణాళిక : ఎన్‌ఎస్‌ఈఎల్ రూ. 5,600 కోట్ల చెల్లింపులకు సంబంధించిన ప్రణాళికను కమోడిటీ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్(ఎఫ్‌ఎంసీ)కు నివేదించింది.
వివిధ కమోడిటీ కాంట్రాక్ట్‌ల సెటిల్‌మెంట్‌కు సంబంధించిన చెల్లింపులను ఏడు నెలల్లో చెల్లించేందుకు వీలుగా ఈ ప్రణాళికను రూపొందించింది. అయితే బ్రోకర్లు, ఇన్వెస్టర్ల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నాక దీనిపై ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు ఎఫ్‌ఎంసీ తెలిపింది. మరోవైపు ఇండియన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్(ఐబీఎంఏ)కు అనుమతి లేకుండా ఎలాంటి చెల్లింపులనూ చేపట్టవద్దని ఎన్‌ఎస్‌ఈఎల్‌ను ఆదేశించింది. ఎన్‌ఎస్‌ఈఎల్ తాజా ప్రణాళిక ప్రకారం చెల్లింపులు ఈ నెల 16న మొదలై వచ్చే ఏడాది మార్చి 11వరకూ కొనసాగనున్నాయి. అయితే సెటిల్‌మెంట్‌లో భాగంగా 13,000 మంది ఇన్వెస్టర్లకు ఐదు నెలల్లో చెల్లింపులను చేపట్టేందుకు సిద్ధమంటూ ఇంతక్రితం ప్రకటించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.
స్పాట్ ఎక్స్ఛేంజీ సమస్యలపై ప్రభుత్వ ప్రత్యేక టీమ్ !
Published Thu, Aug 15 2013 2:39 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement