NSEL
-
వే2వెల్త్ కమోడిటీస్ రిజిస్ట్రేషన్ రద్దు
న్యూఢిల్లీ: ప్రస్తుతం మూతబడిన నేషనల్ స్పాట్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈఎల్) కేసులో వే2వెల్త్ కమోడిటీస్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకుంది. ఎన్ఎస్ఈఎల్కి సంబంధించిన అక్రమ ’పెయిర్డ్ కాంట్రాక్టుల్లో’ ట్రేడింగ్ చేసే సదుపాయం కల్పించడం ద్వారా ఇన్వెస్టర్లను వే2వెల్త్ రిస్కులోకి నెట్టిందని సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించింది. నియంత్రణ సంస్థ అనుమతి లేని పెయిర్డ్ కాంట్రాక్టుల విషయంలో వివేకవంతంగా వ్యవహరించడంలో కంపెనీ విఫలమైందని సెబీ పేర్కొంది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీల మార్కెట్లో బ్రోకింగ్ సంస్థగా కొనసాగే అర్హత కోల్పోయిందని తెలిపింది. 15 రోజుల్లోగా క్లయింట్లు తమ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు లేదా సెక్యూరిటీస్, డబ్బును బదిలీ చేసుకునేందుకు వే2వెల్త్ కమోడిటీస్ వీలు కల్పించాలని సెబీ ఆదేశించింది. ఒకవేళ క్లయింట్లు డబ్బు, సెక్యూరిటీలను విత్‌డ్రా చేసుకోవడంలో విఫలమైతే వాటిని తదుపరి 15 రోజుల్లోగా మరో బ్రోకింగ్ సంస్థకు బదలాయించాలని సూచించింది. 2009లో ఎన్ఎస్ఈఎల్ ప్రవేశపెట్టిన పెయిర్డ్ కాంట్రాక్టుల స్కీముతో ఇన్వెస్టర్లకు ఏకంగా రూ. 5,500 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి 2022 నవంబర్‌లో కొత్త క్లయింట్లను తీసుకోకుండా అయిదు బ్రోకరేజీలపై సెబీ ఆరు నెలల నిషేధం విధించింది. -
ఎన్ఎస్ఈఎల్–ఎఫ్టీఐఎల్ విలీనం చెల్లదు!
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా (ఎఫ్టీఐఎల్) నేషనల్ స్పాట్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈఎల్)ను విలీనం చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం ఎఫ్టీఐఎల్ పేరు 63 మూన్ టెక్నాలజీస్‌గా మారింది. 2016 ఫిబ్రవరి 12న కేంద్రం తీసుకున్న విలీన నిర్ణయాన్ని సమ ర్థిస్తూ, 2017 డిసెంబర్లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును 63 మూన్ టెక్నాలజీస్ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ వినీత్ శరణ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తాజా రూలింగ్ ఇచ్చింది. కంపెనీల చట్టంలోని 396వ సెక్షన్‌నూ అలాగే రాజ్యాంగంలోని 14వ అధికరణనూ (చట్టం ముందు అందరూ సమానులే) కేంద్రం నిర్ణయం ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విలీన నిర్ణయ తీరు ఇదీ... ఎన్‌ఎస్‌ఈఎల్‌కు జిగ్నేష్ షా ప్రమోట్ చేస్తున్న ఎఫ్టీఐఎల్ పేరెంట్ కంపెనీ. ఎన్ఎస్ఈఎల్లో 99% వాటా ఎఫ్‌టీఐఎల్‌కు ఉంది. దాదాపు 13,000 ఇన్వెస్టర్లకు రూ.5,600 కోట్ల మేర చెల్లించాల్సి ఉండి విఫలం కావటంతో 2013లో ఎస్ఎస్ఈఎల్ మూతబడింది. ఈ సంక్షోభం నేపథ్యంలో 1956 కంపెనీల చట్టంలోని 396 సెక్షన్ కింద ఎఫ్‌టీఐఎల్‌లో ఎన్ఎస్ఈఎల్ విలీనానికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2016 ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంది. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం మాకు ఎప్పుడూ భారత న్యాయవ్యవస్థ, మన కోర్టుల పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంది. చివరకు నిజమే నిలబడింది – జిగ్నేష్ షా, చైర్మన్ 63 మూన్స్ టెక్నాలజీస్ -
ఎన్ఎస్ఈఎల్ స్కామ్ కేసులో జిగ్నేశ్ షా అరెస్ట్
ముంబై: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈఎల్)లో రూ.13,000 వేల కుంభకోణం కేసుకు సంబంధించి ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (ఎఫ్టీఐఎల్) వ్యవస్థాకుడైన జిగ్నేశ్ షాను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) మంగళవారం అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ-ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) సెక్షన్ 19 కింద జిగ్నేశ్ షా అరెస్ట్ జరిగింది. దర్యాప్తునకు సరిగ్గా సహకరించలేనందున ఆయనను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఈడీ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఆయనను స్పెషల్ పీఎంఎల్ఏ కోర్ట్ ముందు బుధవారం ఉదయం హాజరు పరుస్తామని పేర్కొన్నారు. జిగ్నేశ్ షా మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారనేందుకు బలమైన ఆధారాలు లభించాయని, దాంతో ఆయన కస్టడీని కోరామని వివరించారు. -
జిగ్నేష్ షాకు బెయిల్
ముంబై: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్) కుంభకోణం కేసులో జిగ్నేష్ షాకు షరతులతో కూడిన బెయిల్ లభించింది. బొంబాయి హైకోర్టు జస్టిస్ అభయ్ తాప్సే శుక్రవారం బెయిల్ జారీ ఆదేశాలు ఇచ్చారు. జిగ్నేష్ స్థాపించిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్ గ్రూప్‌లో ఎన్ఎస్ఈఎల్ ఒక విభాగం. దాదాపు రూ.5,600 కోట్ల ఎన్ఎస్ఈఎల్ కుంభకోణంలో మే 7న షా అరెస్టయ్యారు. అంటే దాదాపు 107 రోజులు జైలులో గడిపారు. షరతులివి... రెండు వారాల్లో క్యాష్ రూ.5,00,000 క్యాష్ ష్యూరిటీ, అంతే మొత్తానికి సమానంగా సాల్వెంట్ ష్యూరిటీ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే నిందితుడు తప్పించుకుని పారిపోయే ఉద్దేశం లేనివాడు కావడం వల్ల రెండు ష్యూరిటీలకు బదులుగా రూ.5,00,000 క్యాష్ ష్యూరిటీపైనే బెయిల్ ఇవ్వాలని షా న్యాయవాదులు అమిత్ నాయక్, అనికేత్ నికామ్‌లు చేసిన వినతికి న్యాయస్థానం అంగీకరించింది. విచారణా కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకూ ప్రతి సోమ, గురువారాల్లో విచారణా సంస్థ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని కూడా కోర్టు షాకు ఆదేశాలు ఇచ్చింది. ఆయన పాస్‌పోర్ట్ ఇప్పటికే అధికారుల స్వాధీనంలో ఉంది. కుంభకోణంలో డబ్బు నష్టపోయిన వారు షాకు బెయిల్ ఇవ్వడం తగదని అంతకుముందు కోర్టుకు విన్నవించారు. విచారణా (దిగువ) కోర్టు జూన్ 24న షాకు బెయిల్ మంజూరుకు నిరాకరించింది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో షా విడుదలైతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందువల్లే బెయిల్‌కు నిరాకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులను షా బొంబాయి హైకోర్టులో సవాలు చేశారు. కుంభకోణంలో ఆయన తప్పేమీ లేదని షా న్యాయవాదులు వాదించారు. ఆయన ఉద్యోగులు కొందరికి ఈ అంశంలో భాగం ఉండే అవకాశం ఉందని వివరించారు. అసలు ఏమి జరుగుతోందో కూడా ఆయన దృష్టికి రాలేదని పేర్కొన్నారు. -
ఎంసీఎక్స్ఎక్స్ఛేంజీ చైర్మన్ రాజీనామా
ముంబై/న్యూఢిల్లీ: ఎంసీఎక్స్ఎక్స్ఛేంజీచైర్మన్ పదవికి జీకే పిళ్లై రాజీనామా చేశారు. 2008లో ఎక్స్ఛేంజీకి లెసైన్స్ లభించడంపై సీబీఐ దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో ప్రస్తుతం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న పిళ్లై రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ అంశానికి సంబంధించి అప్పట్లో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి చైర్మన్‌గా పనిచేసిన భవేపై సీబీఐ ప్రాథమిక విచారణ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. పిళ్లై రాజీనామాతో ఎక్స్ఛేంజీ చైర్మన్ పదవిని ఎల్ఐసీ మాజీ చైర్మన్, ఎక్స్ఛేంజీ వైస్‌చైర్మన్ థామస్ మాథ్యూ చేపట్టారు. వైస్‌చైర్మన్‌గా ఆషిహా గోయల్ నియమితులయ్యారు. పలు సవాళ్ల మధ్య తాను పదవిని చేపట్టానని, ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో వైదొలగుతున్నానని పిళ్లై చెప్పారు. అయినప్పటికీ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ టీమ్ ఆధ్వర్యంలో ఎక్స్ఛేంజీ నడుస్తుందని తెలిపారు. ఇకపై ఎక్స్ఛేంజీ సీఈవో సౌరభ్ సర్కార్ మరింత కీలకంగా వ్యవహరించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పిళ్లైసహా నలుగురు సభ్యుల బోర్డును గతేడాది సెబీ నియమించిన విషయం విదితమే. ఎన్ఎస్ఈఎల్ చెల్లింపుల సంక్షోభం నేపథ్యంలో బోర్డును సెబీ పునర్వ్యవస్థీకరించింది. అయితే ఎక్స్ఛేంజీకి చెందిన ట్రేడింగ్ సభ్యులు, వాటాదారుల ఆందోళనలను తొలగించేందుకు ఇటు ప్రభుత్వం, అటు సెబీ తాజాగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎంసీఎక్స్ఎస్ఎక్స్లో ఐఎఫ్సీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధాన వాటాదారులుగా ఉన్నాయి. రైట్స్ ఇష్యూకి స్పందన ఒక షేరుకి రెండు షేర్ల నిష్పత్తిలో చేపట్టిన రైట్స్ ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించినట్లు ఎంసీఎక్స్‌ఎస్‌ఎక్స్ కొత్త యాజమాన్యం తెలిపింది. శనివారం నో ట్రేడింగ్ వ్యవసాయ కమోడిటీలలో శనివారం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌ను ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్(ఎఫ్ఎంసీ) నిషేధించింది. 2014 ఏప్రిల్ 1 నుంచి అన్ని రకాల కమోడిటీలలోనూ అన్ని ఎక్స్ఛేంజీలూ శనివారం ట్రేడింగ్ నిర్వహించడాన్ని ఎఫ్ఎంసీ తాజాగా నిషేధించింది. ఎన్‌బీహెచ్‌సీ విక్రయం నేషనల్ బల్క్ హ్యాండ్లింగ్ కార్పొరేషన్(ఎన్‌బీహెచ్‌సీ)ను ఇండియా వ్యాల్యూ ఫండ్ ట్రస్టీకు రూ. 242 కోట్లకు విక్రయించనున్నట్లు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ తెలిపింది. వివిధ ఎక్స్ఛేంజీలను ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ టెక్ ఎంసీఎక్స్‌ఎస్‌ఎక్స్‌కు సంబంధించి లిస్టింగ్ ఒప్పందంలో భాగంగా ఎన్బీహెచ్సీను విక్రయిస్తున్నట్లు వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 4.5% పతనమై రూ. 361 వద్ద ముగియగా, ఎంసీఎక్స్ సైతం అదే స్థాయిలో దిగజారి రూ. 493 వద్ద నిలిచింది. -
ఎన్ఎస్ఈఎల్, జిగ్నేష్‌లపై సీబీఐ
న్యూఢిల్లీ: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) కార్యాలయాలతోపాటు ప్రమోటర్ జిగ్నేష్ షా, తదితర అధికారులకు సంబంధించిన 15 ప్రాంతాలలో సీబీఐ తనిఖీలు నిర్వహించింది. ఎన్‌ఎస్‌ఈఎల్‌కు ముంబైలోగల ప్రధాన కార్యాలయంతోపాటు, దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలలో ఈ తనిఖీలను చేపట్టింది. ప్రభుత్వ రంగ ట్రేడింగ్ సంస్థ పీఈసీ చేసిన పెట్టుబడుల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న కేసులో సీబీఐ ఈ సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ సంస్థను మోసం చేసిందన్న అభియోగాలపై ఎన్ఎస్ఈఎల్సహా, ప్రమోటర్ జిగ్నేష్ షాపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఎన్ఎస్ఈఎల్ మాజీ సీఈవో అంజనీ సిన్హా, పీఈసీ సీజీఎం రాజీవ్ చతుర్వేది తదితర అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. మోసం, లంచగొండితనం, ఫోర్జరీల కింద కేసును నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముంబైలోని తమ కార్యాలయానికి జిగ్నేష్ షాను తీసుకెళ్లిన సీబీఐ అధికారులు పలు విధాలుగా షాను ప్రశ్నించి సమాచారాన్ని రాబట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పీఈసీ అధికారులకూ పాత్ర 2007-13 కాలంలో వ్యవసాయ కమోడిటీలకు సంబంధించి కృత్రిమ పద్ధతిలో లావాదేవీలను నిర్వహించడం ద్వారా కొంతమంది మోసానికి పాల్పడ్డారని, తద్వారా ప్రభుత్వానికి రూ. 120 కోట్లమేర నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. దీనిలో భాగంగా పీఈసీకి చెందిన ఐదుగురు అధికారుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ముంబై ఆర్థిక నేరాల విభాగం చేపట్టిన దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించినట్లు సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా చెప్పారు. ఈ వార్తల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈఎల్‌ను ప్రమోట్ చేసిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్, అదే గ్రూప్‌నకు చెందిన ఎంసీఎక్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 4.4% పతనమై రూ. 378 వద్ద నిలవగా, ఎంసీఎక్స్ సైతం 4.6% దిగజారి రూ. 516 వద్ద ముగిసింది. వివిధ కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించి ఇన్వెస్టర్లకు రూ. 5,600 కోట్లమేర చెల్లింపులను చేపట్టలేక సంక్షోభంలో చిక్కుకున్న ఎన్ఎస్ఈఎల్ గతేడాది జూలైలో మూతపడ్డ సంగతి తెలిసిందే. కాగా, పీఈసీ లావాదేవీలకుగాను డెలివరీ చేయాల్సిన సరుకు గోదాముల్లో ఉన్నట్లు, ఇందుకు సంబంధించిన పత్రాలను జారీ చేసినట్లు ఎన్ఎస్ఈఎల్ పేర్కొన్న విషయాలు కూడా సరికాదని సీబీఐ దర్యాప్తులో తేలింది. సెబీ మాజీ చైర్మన్ భవేపైనా... ఎన్ఎస్ఈఎల్ చెల్లింపుల సంక్షోభం కేసును పరిశోధిస్తున్న సీబీఐ, మరోవైపు సెబీ మాజీ చైర్మన్ సీబీ భవేపైనా దృష్టి పెట్టింది. ఎన్ఎస్ఈఎల్ వ్యవస్థాపకుడు జిగ్నేష్ షాకు చెందిన ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎస్ఎక్స్)కు 2008లో లెసైన్స్ మంజూరు చేసిన అంశంలో భవేపై సీబీఐ ప్రాథమిక విచారణ(పీఈ) మొదలుపెట్టింది. భవేతోపాటు, సెబీ మాజీ సభ్యుడు కేఎం అబ్రహం, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, ఎంసీఎక్స్లపైనా పీఈకి తెరలేపింది. బోర్డు సభ్యుల రాజీనామా? సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టిన నేపథ్యంలో సంస్థ చైర్మన్ జీకే పిళ్లైతోపాటు, బోర్డు సభ్యులు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం బోర్డు అత్యవసరంగా సమావేశమవుతోందని పిళ్లైసహా వైస్‌చైర్మన్ థామస్ మాథ్యూ తదితరులు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశముందని సమాచారం. -
ఎన్ఎస్ఈఎల్ స్కామ్‌లో ఐదుగురిపై చార్జిషీట్
ముంబై: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్)లో రూ.5,600 కోట్ల చెల్లిం పుల సంక్షోభానికి సంబంధించి అదుపులోకి తీసుకున్న ఐదుగురిపై ముంబై పోలీసులు 9,100 పేజీల చార్జిషీట్‌ను సోవువారం దాఖలు చేశారు. ఎన్ఎస్ఈఎల్ వూజీ సీఈఓ అంజనీ సిన్హా కూడా వీరిలో ఉన్నారు. కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదనీ, పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ప్రకారం వురికొన్ని చార్జిషీట్లు దాఖలు చేస్తావునీ పోలీస్ జారుుంట్ కమిషనర్ హివూంశు రాయ్ తెలిపారు. చార్జిషీట్లు దాఖలైన వారిలో ఎన్ఎస్ఈఎల్ వూజీ వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్మెంట్) అమిత్ ముఖర్జీ, మాజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ జయ్ బాహుఖుండీ, ఎన్కే ప్రొటీన్స్ లిమిటెడ్ ఎండీ నీలేశ్ పటేల్, లోటస్ రిఫైనరీస్ సీఎండీ అరుణ్ శర్మ ఉన్నారు. ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించి నట్లు ఆరోపణలున్న ఎన్ఎస్ఈఎల్ ప్రమోటర్, డెరైక్టర్ జిగ్నేశ్ షా, జోసఫ్ వూసే, తదితరుల పేర్లు చార్జిషీట్లో లేవు. తొలి చార్జిషీట్లో పేరు లేనంత వూత్రాన వారికి క్లీన్చిట్ ఇచ్చినట్లు భావించవద్దని రాయ్ వివరణ ఇచ్చారు. జిగ్నేశ్ షా కూడా నిందితుడనీ, స్కామ్ లో ఆయునకు పూర్తి పాత్ర ఉందనీ పేర్కొన్నారు. -
ఎన్ఎస్ఈఎల్ స్కామ్.. 25 స్థిరాస్తుల అటాచ్మెంట్
ముంబై/న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ స్కామ్‌కు సంబంధించి ముంబై పోలీసులు కొన్ని రుణగ్రహీత కంపెనీల స్థిరాస్తులను అటాచ్ చేయడం ప్రారంభించారు. ముంబై పోలీసులు గురువారం 25 స్థిరాస్తులను అటాచ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి దాదాపు వంద స్థిరాస్తులను షార్ట్‌లిస్ట్ చేశామని ముంబై పోలీస్‌కు చెందిన ఆర్థిక నేరాల విభాగం ఉన్నతాధికారొకరు చెప్పారు. రూ.5,600 కోట్లను రికవరీ చేయడానికి ఈ వంద ఆస్తులు సరిపోతాయని అయన చెప్పారు. కాగా నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్(ఎన్ఎస్ఈఎల్), ఈ ఎక్స్ఛేంజ్ మాతృ కంపెనీ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల్లో డెరైక్టర్ల స్థాయిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా అన్న విషయమై కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. ఈ రెండు కంపెనీలతో పాటుగా ఎంసీఎక్స్ కంపెనీ రికార్డుల తనిఖీ నివేదిక కూడా త్వరలో ఈ మంత్రిత్వ శాఖకు అందనున్నది. ఈ కంపెనీల డెరైక్టర్ల బోర్డ్ నిబంధనల మేరకే వ్యవహరించిందా, లేదా నిబంధనలను ఉల్లంఘించిందా అన్న అంశాన్ని పరిశీలిస్తామని ఈ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఎన్ఎస్ఈఎల్ రూ. 5,600 కోట్ల చెల్లింపుల సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. -
ఎన్ఎస్ఈఎల్ సంక్షోభం సర్వనాశనం చేసింది: జిగ్నేష్ షా
న్యూఢిల్లీ: ఎన్ఎస్ఈఎల్ సంక్షోభం తన జీవిత కాలం పడ్డ కష్టాన్ని సర్వనాశనం చేసిందని ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా (ఎఫ్టీఐఎల్) చైర్పర్సన్ జిగ్నేష్ షా వ్యాఖ్యానించారు. ఆర్థిక నష్టంకన్నా కూడా తన విశ్వసనీయతను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రల వల్ల తాను, తన కుటుంబం తీవ్ర క్షోభకు గురయ్యామని ఆయన చెప్పారు. ఎంసీఎక్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా ఆయన రాజీనామా చేశారు. ఎన్ఎస్ఈఎల్, ఎంసీఎక్స్ సంస్థలకు ఎఫ్టీఐఎల్ మాతృ సంస్థ. రూ. 5,600 కోట్ల చెల్లింపులకు సంబంధించి నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈఎల్) వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) కొత్త ఎండీ, సీఈవో కోసం అన్వేషణ ప్రారంభించింది. కనీసం 20 ఏళ్ల అనుభవమున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఇప్పటికే ఆహ్వానించింది. ఈ నెల 19న ఎండీ శ్రీకాంత్ జవల్గేకర్ రాజీనామా చేసిన నేపథ్యంలో తాజా అన్వేషణ అనివార్యమైంది. ప్రస్తుతం డిప్యుటీ ఎండీ పర్వీన్ కుమార్ సింఘాల్ ఎంసీఎక్స్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. -
ఈవైపై ఎన్ఎస్ఈఎల్ ఇన్వెస్టర్ల ఫిర్యాదు
ముంబై: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈఎల్) వివాదంలో తాజాగా ఆడిటింగ్ సంస్థ ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఇండియా (ఈవై) ఇరుక్కుంది. ఈ కుంభకోణంలో ఈవై పాత్ర కూడా ఉందంటూ ఎన్ఎస్ఈఎల్ స్కాములో మోసపోయిన ఇన్వెస్టర్ల ఫోరం .. ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ)కి ఫిర్యాదు చేసింది. అయితే, ఈవై తమపై ఆరోపణలను ఖండించింది. దేశీయంగా కమోడిటీ ఫైనాన్సింగ్‌పై తాము ఇచ్చిన నివేదికలో తప్పులేమీ లేవని స్పష్టం చేసింది. ఎస్వీ ఘటాలియా అండ్ అసోసియేట్స్ చేసిన ఎన్ఎస్ఈఎల్ ఆడిటింగ్‌కి తమ నివేదికకు ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొంది. -
కుంభకోణానికి కారణం నువ్వే.. కాదు నువ్వే...
ముంబై: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న ఎన్ఎస్ఈఎల్ మాజీ సీఈవో అంజనీ సిన్హా, సంస్థ ప్రమోటర్ జిగ్నేష్ షా ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగారు. కుంభకోణానికి కారణం నువ్వంటే.. నువ్వంటూ విమర్శలు గుప్పించుకున్నారు. ముంబై పోలీసుశాఖలోని ఆర్థిక నేరాల వింగ్ (ఈవోడబ్ల్యూ) సిన్హా సమక్షంలో జిగ్నేష్ షాని విచారణ చేస్తుండగా ఇది జరిగింది. విచారణ సమయంలో.. సంక్షోభానికి పూర్తి బాధ్యత షా, ఇతర బోర్డు సభ్యులదేనని, వారు ఇచ్చిన ఆదేశాలు మాత్రమే తాను పాటించానని సిన్హా పేర్కొన్నారు. కానీ, దీనికి బాధ్యుడు సిన్హానేనని షా ఆరోపించారు. షాని ఇప్పటికే రెండు సార్లు ప్రశ్నించిన పోలీసులు అవసరమైతే మళ్లీ పిలిపిస్తామన్నారు. మరోవైపు, కుంభకోణం ఆరోపణలపై అరెస్టయిన ఎన్ఎస్ఈఎల్ మాజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ ముఖర్జీకి సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. సంస్థ వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో... బ్యాంకులు బ్లాక్‌లిస్టులో ఉంచిన సంస్థలకు ముఖర్జీ ఎన్ఎస్ఈఎల్ నుంచి రుణాలిప్పించేవారని విచారణలో వెల్లడైంది. ఇందుకోసం ముందుగా బ్యాంకుల వద్దకి వెళ్లి అవి బ్లాక్‌లిస్టు చేసిన సంస్థల జాబితాను ఆయన తీసుకునేవారు. ఆ తర్వాత ఎన్ఎస్ఈఎల్ నుంచి రుణాలిప్పిస్తానంటూ ఆయా సంస్థలను సంప్రతించేవారని పోలీసు అధికారులు తెలిపారు. జూలైలో వెలుగుచూసిన రూ. 5,600 కోట్ల కుంభకోణానికి సంబంధించి పోలీసులు ఇప్పటిదాకా నలుగురిని అరెస్టు చేశారు. -
స్పాట్ ఎక్స్చేంజ్ వైస్ ప్రెసిడెంట్ అరెస్టు
ముంబై: సుమారు రూ. 5,600 కోట్ల చెల్లింపుల కుంభకోణానికి సంబంధించి నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈఎల్) వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్మెంట్ విభాగం) అమిత్ ముఖర్జీని ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) అరెస్టు చేసింది. ఈ కేసులో ఇది మొట్టమొదటి అరెస్టు. బుధవారం ఆయన్ను ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసినట్లు ఈవోడబ్ల్యూ అదనపు పోలీస్ కమిషనర్ రాజ్వర్ధన్ సిన్హా తెలిపారు. మరోవైపు, ఎన్ఎస్ఈఎల్ ప్రమోటర్ జిగ్నేష్ షాతో పాటు డెరైక్టర్లు జోసెఫ్ మాసీ, శ్రీకాంత్ జవల్గేకర్, దేవాంగ్ల వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేశారు. గత నెల 30 నుంచి ముఖర్జీని విచారణ జరిపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నారని సిన్హా తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరో సంస్థ ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్-ఎస్ఎక్స్) బోర్డు సభ్యత్వానికి జిగ్నేష్ షా రాజీనామా చేశారు. అలాగే, వైస్ చైర్మన్ జోసెఫ్ మాసీ కూడా వైదొలిగారు. -
జిగ్నేష్ షాకి ఎఫ్ఎంసీ షోకాజ్
న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్చేంజీ చెల్లింపుల సంక్షోభం దరిమిలా ప్రమోటింగ్ సంస్థ ఎఫ్టీఐఎల్ వ్యవస్థాపకుడు జిగ్నేష్ షాతో పాటు మరో ముగ్గురు అధికారులకు ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వివాదం నేపథ్యంలో మ రో గ్రూప్ సంస్థ ఎంసీఎక్స్ని నిర్వహించేందుకు వారిని సమర్థులుగా ఎందుకు భావించాలో 2 వారాల్లో చెప్పాలంటూ ఆదేశిం చింది. పోలీసుల లుక్ అవుట్ నోటీసుల తరువాత షా కు.. ఇది మరో షాక్. -
జిగ్నేష్ షాపై లుక్అవుట్ నోటీసులు
ముంబై: దాదాపు రూ. 5,600 కోట్ల కుంభకోణానికి సంబంధించి నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈఎల్) ప్రమోటరు జిగ్నేష్ షా, మరికొందరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. వారు దేశం విడిచి వెళ్లకుండా చూడాలంటూ ఇమిగ్రేషన్ బ్యూరోని కూడా కోరినట్లు ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం (ఈవోడబ్ల్యూ) సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సోమవారం నుంచి 60 గిడ్డంగులను తనిఖీ చేయగా 30 గిడ్డంగులు ఖాళీగా ఉన్నట్లు తేలిందని ఆయన వివరించారు. దీన్ని బట్టి చూస్తే.. కొందరు ట్రేడర్లు.. ఎన్‌ఎస్‌ఈఎల్‌తో కుమ్మక్కైనట్లుగా కనిపిస్తోందని అధికారి పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల దగ్గర నుంచి డబ్బు తీసుకుని.. గిడ్డంగుల్లో సరుకు జమ చేయలేదని భావిస్తున్నట్లుగా ఆయన వివరించారు. పెపైచ్చు ఎన్ఎస్ఈఎల్ పత్రాల్లో పేర్కొన్న గిడ్డంగుల్లో నాలుగు అసలు లేనే లేవని తేలినట్లు అధికారి పేర్కొన్నారు. -
ఎన్ఎస్ఈఎల్ బ్యాంక్ ఖాతాల స్తంభన
ముంబై: చెల్లింపుల సంక్షోభంలో కూరుకుపోయిన ఎన్ఎస్ఈఎల్ సంస్థ బ్యాం క్ ఆకౌంట్లను ముంబై పోలీస్ విభాగానికి చెందిన ఆర్థిక నేరాల విభాగం(ఈఓడబ్ల్యూ) మంగళవారం స్తంభింపజేసింది. ఎన్‌ఎస్‌ఈఎల్‌తో పాటు ఈ స్కా మ్తో సంబంధం ఉన్న సంస్థల, వ్యక్తుల మొత్తం 58 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశామని అడిషనల్ పోలీస్ కమిషనర్(ఈవోడబ్ల్యూ) రాజ్యవర్థన్ సిన్హా మంగళవారం వెల్లడించారు. రూ.5,600 కోట్ల చెల్లింపుల స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఎస్‌ఈఎల్‌పై ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాతి రోజే బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడం విశేషం. ఎన్ఎస్ఈఎల్, ప్రమోటర్లు, డిఫాల్టర్లకు చెందిన 54 కార్యాలయాలపై దాడులు చేసినట్లు సిన్హా పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు... కాగా ఎన్ఎస్ఈఎల్ స్కామ్‌లో డబ్బులు నష్టపోయిన కొందరు ఇన్వెస్టర్లు ముంబైలోని తమ బ్రాంచీలో ఫిర్యాదు చేశారని, ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించామని సీబీఐ అధికార ప్రతినిధి కంచన్ ప్రసాద్ న్యూఢిల్లీలో పేర్కొన్నారు. ఈ రోజు రూ.1724.72 కోట్లు ఇన్వెస్టర్లకు చెల్లించాల్సి ఉందని, అయితే ముంబై ఈఓడబ్ల్యూ అధికారులు తమ ఎస్క్రో బ్యాంక్ అకౌంట్‌ను స్తంభింపజేయడంతో చెల్లింపులను జరపలేకపోయామని ఎన్ఎస్ఈఎల్ పేర్కొంది. అయితే ఎన్ఎస్ఈఎల్ ఎస్క్రో బ్యాంక్ అకౌంట్‌ను స్తంభింపజేయలేదని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఎన్‌ఎస్‌ఈఎల్‌పై ఎఫ్ఐయూ దర్యాప్తు
న్యూఢిల్లీ: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఎఫ్ఐయూ) దర్యాప్తు మొదలైంది. దీనిలో భాగంగా ఈ కమోడిటీ ఎక్స్ఛేంజీలో లావాదేవీలు నిర్వహించిన ఇన్వెస్టర్లు, ప్రమోటర్లపై ఎఫ్ఐయూ దృష్టి పెట్టింది. ఎఫ్ఐయూ ఆర్థిక శాఖకింద పనిచేస్తుంది. ఈ కేంద్ర సంస్థ... ఎన్ఎస్ఈఎల్లో అవకతవకలకు కారణమైన లావాదేవీలు, అనుమానాస్పద నగదు బదిలీలు, నగదు ఉపసంహరణలు తదితరాలపై విచారణ నిర్వహించనుంది. ఇప్పటికే ఎన్ఎస్ఈఎల్ అంశంపై పరిశోధన చేపట్టిన పలు నియంత్రణ సంస్థలు ఆర్థిక లావాదేవీలలో అవకతవకలు జరిగినట్లు నిర్థారణకు వచ్చాయి. ఈ బాటలో ఎక్స్ఛేంజీలో లావాదేవీలు నిర్వహించే దాదాపు 25 మంది ఇన్వెస్టర్లపై ఆదాయపన్ను శాఖ సర్వేలు నిర్వహించింది. వీటికి అనుగుణంగానే ఆయా లావాదేవీలకు సంబంధించిన నగదు బదిలీ, నిధుల సమీకరణ తదితర వివరాలను రూపొందించాల్సిందిగా ఎఫ్ఐయూను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారీ స్థాయిలో మనీ లాండరింగ్ ఎన్ఎస్ఈఎల్ ద్వారా భారీ స్థాయి మనీలాండరింగ్ లావాదేవీలు జరిగినట్లు నియంత్రణ సంస్థలు అనుమానిస్తున్నాయి. సంక్షోభానికి కారణమైన రూ. 5,600 కోట్లకంటే బాగా అధిక స్థాయిలోనే మనీ లాండరింగ్ కార్యకలాపాలు జరిగినట్లు అంచనా వేస్తున్నాయి. ఈ విషయంలో మనీ లాండరింగ్ కార్యకలాపాలను గుర్తించే రక్షణాత్మక వ్యవస్థ విఫలమైనట్లు అనుమానిస్తున్నాయి. దీంతో భారీ స్థాయిలో మనీ లాండరింగ్ జరిగినట్లు అభిప్రాయపడ్డాయి. ఈ బాటలో కొన్ని వందల కోట్ల రూపాయలమేర అక్రమ లావాదేవీలు జరిగి ఉండవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిజానికి ఎన్ఎస్ఈఎల్ సెబీ పరిధిలోకి రానప్పటికీ బ్రోకర్లు, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ కార్యకలాపాలు, ఇన్సైడర్ ట్రేడింగ్, లిస్టింగ్ ఒప్పందాలు, అక్రమ లావాదేవీలు, స్టాక్ ఎక్స్ఛేంజీల ప్రమోటర్ నిబంధనలు వంటి అంశాలపై దర్యాప్తు చేస్తోంది. దీనిలో భాగంగా ఎక్స్ఛేంజీకి చెందిన కొంతమంది ఉన్నతాధికారులు, బ్రోకర్లు, సంపన్న వర్గ క్లయింట్లపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరిన్ని సోదాలు అవసరం ఎన్ఎస్ఈఎల్ సంక్షోభంపై ఈ నెల మొదట్లో నివేదికలు రూపొందించిన ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ), ఆర్బీఐ నిర్దిష్ట కాలానికి ఎక్స్ఛేంజీలో జరిగిన ఆర్థిక వ్యవహారాల వివరాల కోసం మరింతగా శోధించాల్సి ఉందంటూ అభిప్రాయపడ్డాయి. ఇక మనీ లాండరింగ్ చట్టానికి అనుగుణంగా చర్యలను చేపట్టగల ఎఫ్ఐయూ ప్రస్తుతం ఇటు సీబీఐ, అటు కార్పొరేట్ వ్యవహారాల శాఖ చేపట్టిన దర్యాప్తులకు తగిన సహకారాన్ని అందించేందుకు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జిగ్నేష్ షాకు చెందిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ప్రమోట్ చేసిన ఎన్ఎస్ఈఎల్... వివిధ కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించి రూ. 5,600 కోట్లమేర చెల్లింపులను చేపట్టలేక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. జూలై 31 నుంచి ఎక్స్ఛేంజీ కార్యకలాపాలు మూతపడ్డాయి. నేటి ఎంసీఎక్స్ ఏజీఎంకు ఎదురుగాలి! మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్) వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) సోమవారం(30న) జరగనుంది. చెల్లింపుల సంక్షోభంతో విలవిల్లాడుతున్న ఎన్ఎస్ఈఎల్ సమస్య నేపథ్యంలో ఇన్వెస్టర్ల నుంచి భారీ విమర్శలు తప్పవని నిపుణులు అంటున్నారు. కొందరు ఇన్వెస్టర్లు నిరసనలను వ్యక్తం చేయనున్నట్లు తెలుస్తోంది. ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్టీ) ప్రమోట్ చేసిన ఎంసీఎక్స్‌లో ఎన్‌ఎస్‌ఈఎల్‌కు 26% వాటా ఉంది. కాగా, ఎన్ఎస్ఈఎల్ సంక్షోభం కారణంగా గతేడాది(2012-13)కి ఎఫ్టీ ఆర్థిక ఫలితాలను ఆడిట్ చేసిన డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ తమ ఆడిట్ నివేదికను ఉపసంహరించుకోవడం గమనార్హం. -
ఎన్‌ఎస్‌ఈఎల్‌కు ఐటీ స్పాట్
న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)పై ఆదాయ పన్ను(ఐటీ) శాఖ దృష్టి సారించింది. ప్రమోటర్ కంపెనీ ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్టీఐఎల్)కు నిధులను బదిలీ చేయడంలో పన్ను నిబంధనల ఉల్లంఘన జరిగిందా అన్న విషయంపై దర్యాప్తు చేపట్టనుంది. దీనిలో భాగంగా ఎఫ్‌టీఐఎల్‌కు ఎన్ఎస్ఈఎల్ చేసిన చెల్లింపుల కు సంబంధించిన లావాదేవీలపై ఐటీ శాఖ ఆరా తీయనుంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? అవకతవకలేమైనా జరిగాయా? తదితర వివరాలను పరిశీలించనున్నట్లు ఆ అధికారి తెలిపారు. ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకున్నందుకుగాను ఎఫ్‌టీఐఎల్‌కు 2011-12లో ఎన్ఎస్ఈఎల్ రూ. 15.56 కోట్లను చెల్లించింది. తిరిగి 2012-13లో ఈ చార్జీలను రెట్టింపునకు పెంచి రూ. 33.8 కోట్లను చెల్లించింది. ఇన్వెస్టర్ల నిధులను సంబంధించిన వివరాలను అందించమంటూ ఇప్పటికే ఎన్ఎస్ఈఎల్ కమోడిటీ ఫ్యూచర్స్‌లో రూ. 50 కోట్లకుపైగా లావాదేవీలు కలిగిన 8 బ్రోకింగ్ సంస్థలను ఐటీ శాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ సంస్థలలో ఆనంద్‌రాఠీ, మోతీలాల్ ఓస్వాల్, ఇండియా ఇన్ఫోలైన్, సిస్టమాటిక్స్ తదితరాలున్నాయి. ఈ కేసులో విదేశీమారక నిబంధనల(ఫెమా) ఉల్లంఘన అంశంపై ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ సైతం దర్యాప్తును మొదలు పెట్టిన విషయం విదితమే. కాగా, ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 10%పైగా పతనమై రూ. 150 వద్ద ముగిసింది. వెనక్కి తగ్గిన ఆడిటర్లు గతేడాదికి(2012-13)గాను ఖాతాలపై నివేదిక ఇచ్చిన ఎఫ్టీఐఎల్ ఆడిటర్ సంస్థ ‘డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్’ వెనకడుగు వేసింది. ఈ ఖాతాలపై తమ నివేదిక(ఆడిట్)ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఇన్వెస్టర్లకు రూ. 5,600 కోట్ల చెల్లింపుల్లో విఫలమైన గ్రూప్ సంస్థ ఎన్ ఎస్ఈఎల్ ఎదుర్కొంటున్న సంక్షోభం నేపథ్యంలో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆడిటర్ సంస్థ వివరణ ఇచ్చింది. సంక్షోభం తరువాత వరుసగా ఆరో వారంలోనూ ఎన్ఎస్ఈఎల్ చెల్లింపుల విషయంలో విఫలంకావడం గమనార్హం. కాగా, ఎన్ఎస్ఈఎల్ ప్రభావం తమ స్టాండెలోన్ ఆర్థిక ఫలితాల పై అంతంత మాత్రమేనని ఎఫ్టీఐఎల్ పేర్కొంది. నికర లాభంలో ఈ వాటా 6.6% మాత్రమేనని వెల్లడించింది. ఇక మరోవైపు ఎన్ఎస్ఈఎల్ సంక్షోభంపై రూపొందించిన నివేదికను ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ ఇటు ప్రధాని కార్యాలయంతోపాటు, ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి అందజేశారు. నివేదికలో కమోడిటీ ఎక్స్ఛేంజీ నిర్వహణలో జరిగిన లోపాలను ఎత్తిచూపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రంగంలోకి ఐసీఏఐ ఎన్ఎస్ఈఎల్ సంక్షోభం నేపథ్యంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్‌కు సంబంధించి ఓవైపు ఆడిటర్లు తాము నిర్వహించిన ఖాతాల ఆడిట్‌ను ఉపసంహరించుకోగా, మరోవైపు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్(ఐసీఏఐ) దర్యాప్తు మొదలైంది. ఆడిటింగ్ ప్రమాణాల నిబంధనల్లో భాగంగా కొన్ని సందర్భాల్లో ఆడిటర్లు తమ నివేదికలను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఈ విషయాలపై వివిధ నియంత్రణ సంస్థలు, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, ఎన్ఎస్ఈఎల్లకు సంబంధించిన వ్యక్తుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ సుబోధ్ కుమార్ అగర్వాల్ చెప్పారు. కాగా, ఎఫ్టీఐఎల్ ఖాతాల విషయంలో ఆడిటర్లు వెనక్కుతగ్గడంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఈ విషయాలపై నిజానిజాల కోసం ఎఫ్టీఐఎల్ను సంప్రదిస్త్తున్నామని సెబీ హోల్‌టైమ్ డెరైక్టర్ రాజీవ్ కుమార్ అగర్వాల్ చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎఫ్టీఐఎల్ ప్రమోటర్ జిగ్నేష్ షా ఎన్ఎస్ఈఎల్ మేనేజ్మెంట్ చేసిన అవకతవకలకు తాను బలవుతున్నానని వ్యాఖ్యానించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు అవసరమైన మద్దతు ఇవ్వాల్సిందిగా అటు వాటాదారులను, ఇటు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. -
ఎన్‌ఎస్‌ఈఎల్‌పై కేసుల యోచన లేదు: ఐఐఎఫ్ఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్)పై ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టే ఉద్దేశ్యం లేదని, కాని ఖాతాదారులకు రావాల్సిన బకాయిలను తొందరగా వచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు బ్రోకింగ్ సంస్థ ఇండియా ఇన్ఫోలైన్ ప్రకటించింది. క్రిమినల్ కేసులు పెట్టడం వలన సమస్య మరింత జటిలమై చెల్లింపులు ఆలస్యం అవుతాయన్న అభిప్రాయాన్ని ఐఐఎఫ్ఎల్ ప్రెసిడెంట్ ఇ.ప్రశాంత్ ప్రభాకరన్ వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఐఐఎఫ్ఎల్ ఎన్సీడీ ఇష్యూ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం సందర్భంగా కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఎన్ఎస్ఈఎల్ రూ.5,600 కోట్లు చెల్లింపుల చేయలేక చేతులు ఎత్తేయడంతో జూలై 31న ట్రేడింగ్‌ను సస్పెండ్ చేశారు. ఇందులో ఐఐఎఫ్ఎల్కి చెందిన దాదాపు 1,400 మంది ఖాతాదారులకు రూ.325 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే చెల్లింపులు జరగ్గా ఇంకా రూ.305 కోట్లు రావాల్సి ఉందని అన్నారు.ఎన్సీడీపై 12 శాతం వడ్డీ: మూడవ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) ఇష్యూ ద్వారా రూ.1,050 కోట్లు సమీకరించనున్నట్లు ఐఐఎఫ్ఎల్ ప్రకటించింది. సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యే ఈ ఇష్యూపై సంవత్సరానికి గరిష్టంగా 12 శాతం వార్షిక వడ్డీని కంపెనీ ఆఫర్ చేస్తోంది. స్పాట్ ఎక్స్ఛేంజీపై ప్రభుత్వానికి ఈడీ నివేదిక : కాగా ఆర్థిక చట్టాలను ఉల్లంఘనకు సంబంధించి నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)పై రూపొందించిన నివేదిక(స్టేటస్ రిపోర్ట్)ను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) ఆర్థిక శాఖకు అందజేసింది. -
స్పాట్ ఎక్స్ఛేంజ్ యాజమాన్యంపై వేటు
ముంబై: సీఈవో అంజనీ సిన్హాసహా మొత్తం యాజమాన్యాన్ని(టాప్ మేనేజ్మెంట్) తొలగిస్తున్నట్లు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) మంగళవారం తెలిపింది. తొలి దశ చెల్లింపులలో విఫలంకావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. కమోడిటీ కాంట్రాక్ట్‌ల సెటిల్మెంట్లకు సంబంధించి తొలి దశలో భాగంగా చెల్లించాల్సిన రూ. 175 కోట్లలో రూ. 92 కోట్లను మాత్రమే సమకూర్చినందున యాజమాన్యంపైవేటు వేసినట్లు ఎన్ఎస్ఈఎల్ బోర్డు వివరించింది. వెంటనే అమల్లోకివచ్చే విధంగా సీఎఫ్‌వో శశిధర్ కోటియాన్తోపాటు మరో ఐదుగురిని తొలగించినట్లు తెలిపింది. అంతేకాకుండా ఎక్స్ఛేంజీ విధులను నిర్వర్తించేందుకు ప్రత్యేక అధికారి(ఓఎస్ఈడీ)గా పీఆర్ రమేష్‌కు ఎంపిక చేసినట్లు వెల్లడించింది. సీఈవో అధికారాలను రమేష్ కలిగి ఉంటారని, బోర్డుకు ప్రత్యక్ష జవాబుదారీగా వ్యవహరిస్తారని తెలిపింది. కాగా, తొలి దశ చెల్లింపుల్లోనే విఫలంకావడంతో ఎక్స్ఛేంజీ విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తుతాయని ఎన్ఎస్ఈఎల్ బోర్డుకి ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్(ఎఫ్ఎంసీ) తెలియజేసింది. తొలి దశ చెల్లింపులకు సంబంధించిన 15 మంది సభ్యులలో 9మంది విఫలమైనట్లు(డిఫాల్టర్స్) ఎన్ఎస్ఈఎల్ తెలిపింది. డిఫాల్టర్లలో ఆర్క్ ఇంపోర్ట్స్, లోయిల్ ఓవర్సీస్ ఫుడ్స్, లోటస్ రిఫైనరీస్, ఎన్కే ప్రొటీన్స్, ఎన్సీసీ షుగర్స్, స్పిన్ కాట్ టెక్స్టైల్స్, తవిషీ ఎంటర్ప్రైజెస్, విమలాదేవీ ఆగ్రోటెక్, యథురీ అసోసియేట్స్ ఉన్నాయి. కాగా, కమోడిటీ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎఫ్ఎంసీను ఆర్థిక శాఖ పర్యవేక్షణలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ఎంసీ ప్రస్తుతం వినియోగ వ్యవహారాల శాఖ కింద పనిచేస్తోంది. -
డిఫాల్టర్లపై చర్యలు
న్యూఢిల్లీ: చెల్లింపులలో విఫలమైన(డిఫాల్టర్లు) కొనుగోలుదారులపై చర్యలు తీసుకోమంటూ నేషనల్స్పాట్ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)ను ప్రభుత్వం ఆదేశించింది. ఎన్ఎస్ఈఎల్ గత వారం ప్రభుత్వానికి సమర్పిం చిన ప్రణాళిక ప్రకారం ఈ నెల 16న తొలి పేమెం ట్ రోజు కావడంతో కొంతమంది కొనుగోలుదారులు నగదు చెల్లింపులో విఫలమై ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. డిఫాల్టర్లపై నిబంధనల ప్ర కారం చర్యలను తీసుకోవడమేకాకుండా వారి వివరాలను కూడా ఇవ్వమంటూ ప్రభుత్వం సూచించింది. మరోవైపు ఎన్ఎస్ఈఎల్ గిడ్డంగులలో ఉన్న సరుకులపై ఆడిట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక ఇన్వెస్టర్లకు సంబంధించి రూ. 5,600 కోట్ల సెటిల్మెంట్లకు హామీదారు(గ్యారంటర్) కావడంతో బాధ్యతలను పూర్తిచేయాల్సిందిగా కూడా ఎన్‌ఎస్‌ఈఎల్‌ను వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ ఆదేశించారు. -
స్పాట్ ఎక్స్ఛేంజీ సమస్యలపై ప్రభుత్వ ప్రత్యేక టీమ్ !
న్యూఢిల్లీ: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) సమస్యలపై దృష్టి సారించేందుకు ప్రత్యేక బృందాన్ని(టీమ్‌ను) ఏర్పాటు చేయాలని ప్రధాని కార్యాలయం భావిస్తోంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ సారథ్యంలో టీమ్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వినియోగ వ్యవహారాలు, కార్పొరేట్ వ్యవహారాల శాఖల కార్యదర్శులతోపాటు, రిజర్వ్ బ్యాంకు, సెబీ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ తదితర నియంత్రణ సంస్థల అధికారులకు టీమ్‌లో స్థానం కల్పించనున్నట్లు తెలిపాయి. వివిధ కమోడిటీ కాంట్రాక్ట్‌ల సెటిల్మెంట్కు సంబంధించి రూ. 5,600 కోట్ల చెల్లింపుల విషయంలో ఎన్ఎస్ఈఎల్ విఫలంకాగా, ప్రభుత్వం కల్పించుకుని ట్రేడింగ్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. సెటిల్మెంట్ ప్రణాళిక : ఎన్ఎస్ఈఎల్ రూ. 5,600 కోట్ల చెల్లింపులకు సంబంధించిన ప్రణాళికను కమోడిటీ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్(ఎఫ్ఎంసీ)కు నివేదించింది. వివిధ కమోడిటీ కాంట్రాక్ట్‌ల సెటిల్మెంట్కు సంబంధించిన చెల్లింపులను ఏడు నెలల్లో చెల్లించేందుకు వీలుగా ఈ ప్రణాళికను రూపొందించింది. అయితే బ్రోకర్లు, ఇన్వెస్టర్ల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నాక దీనిపై ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు ఎఫ్ఎంసీ తెలిపింది. మరోవైపు ఇండియన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్(ఐబీఎంఏ)కు అనుమతి లేకుండా ఎలాంటి చెల్లింపులనూ చేపట్టవద్దని ఎన్‌ఎస్‌ఈఎల్‌ను ఆదేశించింది. ఎన్ఎస్ఈఎల్ తాజా ప్రణాళిక ప్రకారం చెల్లింపులు ఈ నెల 16న మొదలై వచ్చే ఏడాది మార్చి 11వరకూ కొనసాగనున్నాయి. అయితే సెటిల్మెంట్లో భాగంగా 13,000 మంది ఇన్వెస్టర్లకు ఐదు నెలల్లో చెల్లింపులను చేపట్టేందుకు సిద్ధమంటూ ఇంతక్రితం ప్రకటించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. -
ఎన్ఎస్ఈఎల్ ఈ-కాంట్రాక్ట్లపైనా నిషేధం
న్యూఢిల్లీ: ఇప్పటికే నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)లో నిలిచిపోయిన కొత్త కమోడిటీ కాంట్రాక్ట్‌లకు జతగా ప్రభుత్వం తాజాగా ఈ సిరీస్ కాంట్రాక్ట్‌లను సైతం నిషేధించింది. దీంతో ఎన్ఎస్ఈఎల్లో ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోయింది. ముందుగా రూ. 5,600 కోట్లమేర నిలిచిపోయిన చెల్లింపుల సెటిల్మెంట్ను పూర్తిచేయాల్సిందిగా ఎన్‌ఎస్‌ఈఎల్‌ను ఆదేశించినట్లు ఆహారం, వినియోగ వ్యవహారాల మంత్రి కేవీ థామస్ చెప్పారు. ఎన్ఎస్ఈఎల్లో ఈ సిరీస్ కాంట్రాక్ట్‌లను సైతం నిషేధించినట్లు తెలిపారు. ఈ అంశంపై రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ సిరీస్‌లో భాగంగా పసిడి, వెండిలతోపాటు ప్రాథమిక లోహాలకు సంబంధించిన కాంట్రాక్ట్‌లను ఎన్ఎస్ఈఎల్ నిర్వహిస్తుంది.ఈక్విటీలలో నగదు విభాగాన్ని పోలి ఈ సిరీస్ కాంట్రాక్ట్‌ల నిర్వహణ ఉంటుందని థామస్ పేర్కొన్నారు. -
డిఫాల్టర్లపై చర్యలు తీసుకోవాలి: ఎన్ఎస్ఈఎల్
ముంబై: చెల్లింపుల సంక్షోభం నేపథ్యంలో కమోడిటీ కాంట్రాక్ట్‌లలో ట్రేడింగ్ నిలిపివేసిన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) లావాదేవీల పరిష్కారానికి(సెటిల్మెంట్స్) స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించి రూ. 5,600 కోట్ల విలువైన లావాదేవీలను సెటిల్ చేయాల్సి ఉంది. ఇందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీను నియమించినట్లు ఎన్ఎస్ఈఎల్ తెలిపింది. కంపెనీ లాబోర్డ్ మాజీ చైర్మన్ శరద్ ఉపాసని అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్ఎస్ఈఎల్ ప్రమోటర్ జగ్నేష్ షా పేర్కొన్నారు. మిగిలిన సభ్యులలో ముంబై హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి ఆర్జే కొచర్, సెబీ, ఎల్ఐసీలకు గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన జీఎన్ బాజ్‌పాయ్, మహారాష్ర్ట మాజీ డీజీపీ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 14కల్లా చెల్లింపుల ప్రణాళికను వెల్లడించగలమని షా చెప్పారు. కాగా, చెల్లింపుల ప్రణాళికకు సహకరించని బ్రోకర్లు, సభ్యులపై తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా ఎన్ఎస్ఈఎల్ ప్రభుత్వాన్ని కోరింది. కమోడిటీ మార్కెట్లను నియంత్రించే ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్ ఎన్ఎస్ఈఎల్ సెటిల్మెంట్ అంశాన్ని పరిష్కరిస్తుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఫైనాన్షియల్ టెక్ షేరు హైజంప్ ఈ వార్తల నేపథ్యంలో ప్రమోటర్ కంపెనీ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు ధర బీఎస్ఈలో 31%(రూ. 47) ఎగసి రూ. 198 వద్ద ముగిసింది. అయితే గ్రూప్‌లోని మరో కంపెనీ ఎంసీఎక్స్ షేరు మాత్రం 10%(రూ. 41) పతనమై(లోయర్ సర్క్యూట్) రూ. 361 వద్ద నిలిచింది.