ముంబై: దాదాపు రూ. 5,600 కోట్ల కుంభకోణానికి సంబంధించి నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈఎల్) ప్రమోటరు జిగ్నేష్ షా, మరికొందరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. వారు దేశం విడిచి వెళ్లకుండా చూడాలంటూ ఇమిగ్రేషన్ బ్యూరోని కూడా కోరినట్లు ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం (ఈవోడబ్ల్యూ) సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సోమవారం నుంచి 60 గిడ్డంగులను తనిఖీ చేయగా 30 గిడ్డంగులు ఖాళీగా ఉన్నట్లు తేలిందని ఆయన వివరించారు. దీన్ని బట్టి చూస్తే.. కొందరు ట్రేడర్లు.. ఎన్‌ఎస్‌ఈఎల్‌తో కుమ్మక్కైనట్లుగా కనిపిస్తోందని అధికారి పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల దగ్గర నుంచి డబ్బు తీసుకుని.. గిడ్డంగుల్లో సరుకు జమ చేయలేదని భావిస్తున్నట్లుగా ఆయన వివరించారు. పెపైచ్చు ఎన్‌ఎస్‌ఈఎల్ పత్రాల్లో పేర్కొన్న గిడ్డంగుల్లో నాలుగు అసలు లేనే లేవని తేలినట్లు అధికారి పేర్కొన్నారు.