Jignesh Shah
-
అదంతా కుట్ర, ఉల్లంఘనలు జరగలేదు!
ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై జిగ్నేశ్ షా స్పష్టీకరణ ముంబై: మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ షేర్ల ట్రేడింగ్‌కు సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు, మార్కెట్ రెగ్యులేటర్– సెబీ ఉత్తర్వులపై పీకల్లోతు కష్టాల్లో ఉన్న వ్యాపారవేత్త జిగ్నేశ్ షా పెదవి విప్పారు. ఎటువంటి ఉల్లంఘనలూ జరగలేదనీ, ఇదంతా తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రనీ శుక్రవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు లక్ష్యంగా మారినందువల్లే తాను మొట్టమొదటిసారి మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చిందని తెలియజేశారు. ఎన్ఎస్ఈఎల్ తరహా సంక్షోభం ఏర్పడటం మార్కెట్లో తొలిసారేమీ కాదని పేర్కొన్న ఆయన, ఈ కేసులు పెట్టడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం సమస్య పరిష్కారం కాదనీ, పోటీ పూర్వక వాతావరణంలో గ్రూప్‌ను పూర్తిగా నిర్మూలించాలన్నదే ధ్యేయమనీ చెప్పారు. యూపీఏ–2 సమయంలో బాధ్యతల్లో ఉన్న ఒక మాజీ ఆర్థిక మంత్రి కనుసన్నల్లో ఒకప్పటి ఫార్వార్డ్ మార్కెట్స్ కమిషన్ (కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్స్ ప్రధాన రెగ్యులేటర్) పనిచేసిందనీ, కేసు విచారణ ప్రక్రియంతా ఆయన కుట్రలో భాగంగా జరిగిందనీ విమర్శించారు. ఆయనపై న్యాయ పరమైన చర్యలు చేపట్టే విషయాన్నీ తాను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వివరాలోకి వెళితే, ఎంసీఎక్స్, దాని ఒకప్పటి మాతృసంస్థ ఎఫ్టీఐఎల్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి 13 మంది పాత్ర ఉన్నట్టు సెబీ రెండు రోజుల క్రితం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. షేర్ల ధరలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్న సమాచారాన్ని బయటకు వెల్లడించకుండా వీరే ఉపయోగించుకుని, దాని ఆధారంగా ట్రేడింగ్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయన్న సెబీ, ఈ కారణంగా తలెత్తిన నష్టాలు రూ.125 కోట్లకు సంబంధించి 13 మంది ఆస్తుల స్వాధీనం సహా పలు చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. వీరిలో జిగ్నేశ్ షా బంధువులు కూడా ఉన్నారు. -
ఎంసీఎక్స్ కేసులో జిగ్నేష్ షా అరెస్ట్
భారీ సోదాల అనంతరం సీబీఐ చర్యలు • ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్‌కు అనుమతుల్లో • నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు... న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్టీఐఎల్), కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఎంసీఎక్స్ల ప్రమోటర్ జిగ్నేష్ షాను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్‌కు సెబీ అనుమతుల విషయంలో నిబంధనల ఉల్లంఘన, వాస్తవాలను దాచిపెట్టడం, మోసం తదితర ఆరోపణలకు సంబంధించిన కేసులో సీబీఐ ఈ చర్యలు చేపట్టింది. కాగా, అరెస్ట్‌కు ముందు జిగ్నేష్ షా నివాసం, ఎఫ్టీఐఎల్, ఎంసీఎక్స్‌తో పాటు ముంబైలో మొత్తం 9 చోట్ల భారీగా సోదాలు చేసినట్లు సీబీఐ ప్రతినిధి ఆర్కే గౌర్ వెల్లడించారు. సోదాల జాబితాలో సెబీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మురళీధర్‌రావు, డీజీఎం రాజేష్ దంగేటి, ఏజీఎం విశాఖ మోరె, సెబీ మాజీ ఈడీ జీఎన్ గుప్తాలకు చెందిన నివాసాలు కూడా ఉన్నాయి. వీళ్లందరిపై రెండేళ్ల క్రితం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, సీబీఐ సోదాల సమాచారాన్ని 63 మూన్స్(గతంలో ఎఫ్టీఐఎల్), ఎంసీఎక్స్లు ఎక్స్ఛేంజీలకు వెల్లడించాయి. మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గతంలో ఎంసీఎక్స్-ఎస్ఎక్స్)కు సెబీ గుర్తింపు అనుమతుల కేసులో ఈ సోదాలు జరుగుతున్నట్లు ఎంసీఎక్స్ పేర్కొంది. కేసు పూర్వాపరాలివీ... ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ 2013లో స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యకలాపాలను ప్రారంభించింది. అంతక్రితం దీనికి సంబంధించిన అనుమతుల విషయంలో సెబీతో చాలా కాలంపాటు న్యాయపోరాటం చేసింది. అయితే, సెబీ అధికారులతో సంబంధిత కంపెనీలు కుమ్మక్కై అనుమతులను సంపాదించాయన్న ఆరోపణలతో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం(ఐపీసీ సెక్షన్లు)తో పాటు అవినీతి నిరోధక చట్టంకింద(అధికార దుర్వినియోగం) కూడా అభియోగాలను మోపింది. ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ ప్రమోటర్లు సెబీ నిబంధనలకు విరుద్ధంగా 2006లో ఒక జాతీయ బ్యాంకుతో బైబ్యాక్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని కూడా సీబీఐ ఆరోపించింది. కరెన్సీ డెరివేటివ్స్ విభాగంలో ఎక్స్ఛేంజ్ గుర్తింపు కోసం సెబీకి దరఖాస్తు చేసిన సమయంలో జిగ్నేష్ షా ఈ అంశాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని.. దీనికి కొంతమంది సెబీ అధికారులతో కుమ్మక్కయ్యారని పేర్కొంది. సెబీని మోసం చేసి 2009-10లో ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ గుర్తింపును పొందిందని తెలిపింది. ఇతర విభాగాల్లో ట్రేడింగ్‌కు సెబీ అనుమతులను నిరాకరించినప్పటికీ.. కరెన్సీ డెరివేటివ్స్‌కు అనుమతులపై కొంతమంది సెబీ అధికారులు కావాలనే ఎలాంటి నోటీసులూ జారీచేయలేదనేది కూడా సీబీఐ ఆరోపణల్లో ప్రధానంగా ఉంది. షేర్ల బదలాయింపు, ఎఫ్డీఆర్, ఆస్తుల కొనుగోలు ఇతరత్రా డాక్యుమెంట్లను సోదాల్లో స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ ప్రతినిధి గౌర్ తెలిపారు. దర్యాప్తు కొనసాగింపులో ఈ పత్రాలను పరిశీలించనున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా, నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈఎల్)కు సంబంధించి రూ.7,000 కోట్ల భారీ కుంభకోణం కేసులో కూడా గతంలో జిగ్నేష్ షాను ఈడీ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈఎల్‌ను ప్రమోట్ చేసిన కంపెనీ కూడా జిగ్నేష్ షాకు చెందిన ఎఫ్టీఐఎల్ కావడం గమనార్హం. ఈ కేసులో ముంబై పోలీస్ శాఖ(ఆర్థిక నేరాల విభాగం) ఇప్పటికే రూ.7,000 కోట్ల విలువైన ఎఫ్టీఐఎల్ ఆస్తులను అటాచ్ చేసింది. జిగ్నేష్ షా: ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ప్రమోటర్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్: ఎంసీఎక్స్, ఎన్ఎస్ఈఎల్లను ప్రమోట్ చేసిన కంపెనీ ఎంసీఎక్స్: దేశంలో ప్రధాన కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఎంసీఎక్స్-ఎస్ఎక్స్: స్టాక్ ఎక్స్ఛేంజ్. దీన్ని ఎఫ్టీఐఎల్, ఎంసీఎక్స్లు ప్రమోట్ చేశాయి. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్: కమోడిటీ ఎక్స్ఛేంజ్ (భారీ స్కామ్ నేపథ్యంలో ఇది మూతపడింది) -
18 వరకూ ఈడీ కస్టడీలో జిగ్నేశ్ షా...
ముంబై: ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (ఎఫ్టీఐఎల్) వ్యవస్థాకుడు జిగ్నేశ్ షా ఈ నెల 18 వరకూ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) కస్టడీలో ఉంటారు. ఈ మేరకు స్థానిక ఈడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్‌కు సంబంధించి రూ.5,600 కోట్ల కుంభకోణంలో షాను బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. పరిశోధనకు సరిగ్గా సహకరించనందున ఆయనను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఈడీ ఉన్నతాధికారులు బుధవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన విచారణకు సహకరిస్తున్నారని, అయినా ఈడీ ఇలాంటి తీవ్ర చర్య ఎందుకు తీసుకుందో అర్థం కావడం లేదని ఎఫ్టీఐఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. కేసు విచారణ సందర్భంగా మధ్యంతర బెయిల్ కోసం షా తరఫున న్యాయవాది పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. షేర్ 6 శాతం డౌన్: షా అరెస్ట్ నేపథ్యంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (ఇండియా) షేర్ ధర బుధవారం భారీగా పడింది. ఎన్ఎస్ఈలో ధర 6 శాతం తగ్గి, రూ.85.85 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.394 కోట్లకు పరిమితమైంది. -
కేంద్రం ‘స్పాట్’!
రూ. 5,600 కోట్ల చెల్లింపుల స్కామ్‌పై.. * ఫైనాన్షియల్ టెక్నాలజీస్‌లో ఎన్ఎస్ఈఎల్ విలీనం * కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశం... * ఇన్వెస్టర్ల ప్రయోజనాల కోసమేనని వెల్లడి * ఎన్ఎస్ఈఎల్ చెల్లింపులు, అప్పులనూ ఎఫ్టీఐఎల్ భరించాల్సిందేనని స్పష్టీకరణ న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) రూ. 5,600 కోట్ల చెల్లింపుల కుంభకోణంపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. జిగ్నేశ్ షా నేతృత్వంలోని మాతృసంస్థ ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్టీఐఎల్) గ్రూప్‌లో ఎన్‌ఎస్‌ఈఎల్‌ను విలీనం చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ స్కామ్‌లో చిక్కుకొని నష్టపోయిన ఇన్వెస్టర్లు, బ్రోకర్ల సొమ్మును తిరిగి ఇప్పించడం, వాళ్ల ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొం ది. కాగా, తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని.. దీనిపై తమ న్యాయనిపుణులతో చర్చించి తగిన చర్యలు చేపడతామని ఎఫ్టీఐఎల్ పేర్కొంది. ఇక బాధ్యతంతా ఎఫ్టీఐఎల్దే... ఎన్ఎస్ఈఎల్ బకాయి పడిన చెలింపులతో పాటు ఆ కంపెనీ రుణాలన్నింటికీ ఎఫ్టీఐఎల్ బాధ్యత వహించాల్సిందేనని ఆదేశాల్లో కేంద్రం తేల్చిచెప్పింది. ఎస్ఎస్ఈఎల్ మొత్తం వ్యాపారం, ఆస్తులు ఇతరత్రా అన్నీకూడా ఎఫ్‌టీఐఎల్‌కు బదిలీఅవుతాయి. ప్రజా ప్రయోజనాల రీత్యాప్రైవేటు రంగ కంపెనీల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు వీలుకల్పిస్తున్న కంపెనీల చట్టంలోని సెక్షన్ 396(నిబంధన-క్లాజ్)ను ఎన్‌ఎస్‌ఈఎల్‌పై ప్రయోగించింది. ఈ క్లాజ్‌ను చాలా అరుదుగా మాత్రమే ప్రభుత్వాలు ఉపయోగిస్తుంటాయి. కాగా, 2009లో సత్యం కంప్యూటర్స్ ఖాతాల కుంభకోణం తర్వాత మళ్లీ ఒక ప్రైవేటు కంపెనీ వ్యవహరాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం దాదాపు ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. అయితే, సత్యం కేసు లో ఆ కంపెనీని థర్డ్‌పార్టీ(టెక్ మహీంద్రా)కి వేలం ద్వారా విక్రయిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అన్నీ పరిశీలించాకే... ఏడాది కాలంగా పెండింగ్‌లోఉన్న బకాయిల రికవరీ, చెల్లింపుల విషయంలో ఎన్ఎస్ఈఎల్ చేతులెత్తేసిందని.. దీంతో తగిన వనరులున్న ఎఫ్‌టీఐఎల్‌లో విలీనం చేయడంద్వారా చెల్లింపులను వేగంగా రికవరీ చేయనున్నట్లు ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. మార్చి 2013 నాటికి ఎన్ఎస్ఈఎల్ నెట్‌వర్త్ రూ.175.76 కోట్లుగా అంచనా. విలీనానికి సంబంధించి విధివిధానాలన్నీ పాటిస్తామని.. ఇరు కంపెనీల వాటాదారులు, రుణదాతలు తమ అభ్యంతరాలు/సూచనలను 60 రోజుల్లోగా వెల్లడించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలిపింది. ముఖ్యంగా కంపెనీల చట్టం-1956లోని పలు నిబంధనలను ఇరు కంపెనీలూ ఉల్లంఘించినట్లు తమ దర్యాప్తులో తేలిందని.. అంతేకాకుండా ఎఫ్టైఎల్, దాని కీలక యాజమాన్య వ్యక్తుల నియంత్రణలో ఎన్ఎస్ఈఎల్ నడిచిందన్న విషయం కూడా వెలుగుచూసినట్లు కార్పొరేట్ వ్యవహరాల శాఖ ముసాయిదా ఆదేశాల్లో తెలిపింది. ఎన్‌ఎస్‌ఈఎల్‌పై ఏవైనా కేసులు నమోదుకావాలన్నా, లేదంటే ఎలాంటి చట్టపరమైన చర్యలైనా ఎఫ్టీఐఎల్పైనే ఫైల్ చేయాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ఇన్వెస్టర్ల ఆనందం... ఇదిలాఉండగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్ఎస్ఈఎల్ ఇన్వెస్టర్ల ఫోరం(ఎన్ఐఎఫ్) స్వాగతించింది. చెల్లిం పులు నిలిచిపోయిన 13,000 మంది ఇన్వెస్టర్లు కలసి ఈ ఫోరంను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సాహసోపేతమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని ఎన్ఐఎఫ్ చైర్మన్ శరద్ కుమార్ సరాఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. షేరు క్రాష్: ప్రభుత్వ విలీన ఆదేశాల వార్తలతో ఎఫ్టీఐఎల్ షేరు ధర మంగళవారం బీఎస్ఈలో 20 శాతం కుప్పకూలి లోయర్ సర్కూట్‌ను తాకింది. రూ.169.65 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ.200 కోట్ల మేర ఆవిరైంది. రూ.781.72 కోట్లకు దిగజారింది. -
జిగ్నేశ్ షాపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: ప్రైవేట్ స్టాక్ ఎక్స్ఛేంజీగా ఎంసీఎక్స్-ఎస్ఎక్స్, ఎఫ్‌టీఐఎల్‌కు అనుమతి మంజూరులో చట్టాన్ని ఉల్లంఘించారంటూ జిగ్నేశ్ షా (ఎన్ఎస్ఈఎల్), సెబీ అధికారులతో పాటు దాని మాజీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జె.ఎన్.గుప్తాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. గుప్తా, సెబీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.వి.మురళీధర్ రావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజేశ్ దంగేటి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ విశాఖ మోరెలతో పాటు ఎఫ్టీఐఎల్, ఎంసీఎక్స్లపై మోసం, నేరపూరిత కుట్ర, అధికార హోదాల దుర్వినియోగం అభియోగాలను మోపుతూ ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను సీబీఐ దాఖలు చేసింది. కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ గతేడాది ఉత్తమ ఉద్యోగి అవార్డుకు మోరెను ఎంపిక చేయగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డును ఆమె అందుకున్నారు. అంధురాలైన మోరె ఈ వివాదంలో చిక్కుకోవడం సెబీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈమెయిళ్లు, ఫైళ్లు చదవడానికి జాస్ (జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్), ఓసీఆర్ఎస్ (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్) అనే రెండు సాఫ్ట్వేర్లను ఆమె వినియోగిస్తున్నారు. రాత ప్రతులను చదివేందుకు సహచరుల సహాయాన్ని ఆమె తీసుకునే వారనీ, ఆమెను వారు తప్పుదోవ పట్టించారా అనే విషయాన్ని దర్యాప్తు చేస్తామనీ సీబీఐ అధికారులు తెలిపారు. సెక్షన్ 120-బి (నేరపూరిత కుట్ర), 420 (వంచన) కేసుల నమోదుపై వ్యాఖ్యానించడానికి గుప్తా నిరాకరించారు. సెబీ మాజీ చైర్మన్ సి.బి.భవే, మాజీ సభ్యుడు కె.ఎం.అబ్రహాంలకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారాలు లేనందున వారిపై శాఖాపరమైన చర్యలకు సీబీఐ సిఫార్సు చేసిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. -
జిగ్నేష్ షాకు బెయిల్
ముంబై: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్) కుంభకోణం కేసులో జిగ్నేష్ షాకు షరతులతో కూడిన బెయిల్ లభించింది. బొంబాయి హైకోర్టు జస్టిస్ అభయ్ తాప్సే శుక్రవారం బెయిల్ జారీ ఆదేశాలు ఇచ్చారు. జిగ్నేష్ స్థాపించిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్ గ్రూప్‌లో ఎన్ఎస్ఈఎల్ ఒక విభాగం. దాదాపు రూ.5,600 కోట్ల ఎన్ఎస్ఈఎల్ కుంభకోణంలో మే 7న షా అరెస్టయ్యారు. అంటే దాదాపు 107 రోజులు జైలులో గడిపారు. షరతులివి... రెండు వారాల్లో క్యాష్ రూ.5,00,000 క్యాష్ ష్యూరిటీ, అంతే మొత్తానికి సమానంగా సాల్వెంట్ ష్యూరిటీ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే నిందితుడు తప్పించుకుని పారిపోయే ఉద్దేశం లేనివాడు కావడం వల్ల రెండు ష్యూరిటీలకు బదులుగా రూ.5,00,000 క్యాష్ ష్యూరిటీపైనే బెయిల్ ఇవ్వాలని షా న్యాయవాదులు అమిత్ నాయక్, అనికేత్ నికామ్‌లు చేసిన వినతికి న్యాయస్థానం అంగీకరించింది. విచారణా కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకూ ప్రతి సోమ, గురువారాల్లో విచారణా సంస్థ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని కూడా కోర్టు షాకు ఆదేశాలు ఇచ్చింది. ఆయన పాస్‌పోర్ట్ ఇప్పటికే అధికారుల స్వాధీనంలో ఉంది. కుంభకోణంలో డబ్బు నష్టపోయిన వారు షాకు బెయిల్ ఇవ్వడం తగదని అంతకుముందు కోర్టుకు విన్నవించారు. విచారణా (దిగువ) కోర్టు జూన్ 24న షాకు బెయిల్ మంజూరుకు నిరాకరించింది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో షా విడుదలైతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందువల్లే బెయిల్‌కు నిరాకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులను షా బొంబాయి హైకోర్టులో సవాలు చేశారు. కుంభకోణంలో ఆయన తప్పేమీ లేదని షా న్యాయవాదులు వాదించారు. ఆయన ఉద్యోగులు కొందరికి ఈ అంశంలో భాగం ఉండే అవకాశం ఉందని వివరించారు. అసలు ఏమి జరుగుతోందో కూడా ఆయన దృష్టికి రాలేదని పేర్కొన్నారు. -
61శాతం పడిన ఫైనాన్షియల్ టెక్ లాభం
న్యూఢిల్లీ: జిగ్నేష్ షా నేతృత్వంలోని ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (ఇం డియా) నికర లాభం రెండవ త్రైమాసికంలో 61 శాతంపైగా పడింది. స్టాండెలోన్ ప్రాతిపదికన సంస్థ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే రూ.70 కోట్ల నుంచి రూ.27 కోట్లకు పడిపోయింది. సంక్షోభంలో కూరుకుపోయిన అనుబంధ సంస్థ నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈఎల్)కి కేటాయింపులు జరపాల్సి రావడం దీనికి ప్రధాన కారణం. ఇక నిర్వహణపరమైన ఆదాయం సైతం రూ.125 కోట్ల నుంచి రూ.93 కోట్లకు పడిపోయింది. సాఫ్ట్వేర్ బిజినెస్‌పరంగా రెవెన్యూ తగ్గడం దీనికి కారణమని కంపెనీ తెలిపింది. వ్యయాలు రూ.55 కోట్ల నుంచి రూ. 68 కోట్లకు ఎగశాయి. కాగా షేర్‌కు రూ. 2 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. డిసెంబర్ 20న ఈ చెల్లింపులు ఉంటాయి. -
కుంభకోణానికి కారణం నువ్వే.. కాదు నువ్వే...
ముంబై: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న ఎన్ఎస్ఈఎల్ మాజీ సీఈవో అంజనీ సిన్హా, సంస్థ ప్రమోటర్ జిగ్నేష్ షా ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగారు. కుంభకోణానికి కారణం నువ్వంటే.. నువ్వంటూ విమర్శలు గుప్పించుకున్నారు. ముంబై పోలీసుశాఖలోని ఆర్థిక నేరాల వింగ్ (ఈవోడబ్ల్యూ) సిన్హా సమక్షంలో జిగ్నేష్ షాని విచారణ చేస్తుండగా ఇది జరిగింది. విచారణ సమయంలో.. సంక్షోభానికి పూర్తి బాధ్యత షా, ఇతర బోర్డు సభ్యులదేనని, వారు ఇచ్చిన ఆదేశాలు మాత్రమే తాను పాటించానని సిన్హా పేర్కొన్నారు. కానీ, దీనికి బాధ్యుడు సిన్హానేనని షా ఆరోపించారు. షాని ఇప్పటికే రెండు సార్లు ప్రశ్నించిన పోలీసులు అవసరమైతే మళ్లీ పిలిపిస్తామన్నారు. మరోవైపు, కుంభకోణం ఆరోపణలపై అరెస్టయిన ఎన్ఎస్ఈఎల్ మాజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ ముఖర్జీకి సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. సంస్థ వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో... బ్యాంకులు బ్లాక్‌లిస్టులో ఉంచిన సంస్థలకు ముఖర్జీ ఎన్ఎస్ఈఎల్ నుంచి రుణాలిప్పించేవారని విచారణలో వెల్లడైంది. ఇందుకోసం ముందుగా బ్యాంకుల వద్దకి వెళ్లి అవి బ్లాక్‌లిస్టు చేసిన సంస్థల జాబితాను ఆయన తీసుకునేవారు. ఆ తర్వాత ఎన్ఎస్ఈఎల్ నుంచి రుణాలిప్పిస్తానంటూ ఆయా సంస్థలను సంప్రతించేవారని పోలీసు అధికారులు తెలిపారు. జూలైలో వెలుగుచూసిన రూ. 5,600 కోట్ల కుంభకోణానికి సంబంధించి పోలీసులు ఇప్పటిదాకా నలుగురిని అరెస్టు చేశారు. -
జిగ్నేష్ షాకి ఎఫ్ఎంసీ షోకాజ్
న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్చేంజీ చెల్లింపుల సంక్షోభం దరిమిలా ప్రమోటింగ్ సంస్థ ఎఫ్టీఐఎల్ వ్యవస్థాపకుడు జిగ్నేష్ షాతో పాటు మరో ముగ్గురు అధికారులకు ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వివాదం నేపథ్యంలో మ రో గ్రూప్ సంస్థ ఎంసీఎక్స్ని నిర్వహించేందుకు వారిని సమర్థులుగా ఎందుకు భావించాలో 2 వారాల్లో చెప్పాలంటూ ఆదేశిం చింది. పోలీసుల లుక్ అవుట్ నోటీసుల తరువాత షా కు.. ఇది మరో షాక్. -
జిగ్నేష్ షాపై లుక్అవుట్ నోటీసులు
ముంబై: దాదాపు రూ. 5,600 కోట్ల కుంభకోణానికి సంబంధించి నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈఎల్) ప్రమోటరు జిగ్నేష్ షా, మరికొందరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. వారు దేశం విడిచి వెళ్లకుండా చూడాలంటూ ఇమిగ్రేషన్ బ్యూరోని కూడా కోరినట్లు ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం (ఈవోడబ్ల్యూ) సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సోమవారం నుంచి 60 గిడ్డంగులను తనిఖీ చేయగా 30 గిడ్డంగులు ఖాళీగా ఉన్నట్లు తేలిందని ఆయన వివరించారు. దీన్ని బట్టి చూస్తే.. కొందరు ట్రేడర్లు.. ఎన్‌ఎస్‌ఈఎల్‌తో కుమ్మక్కైనట్లుగా కనిపిస్తోందని అధికారి పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల దగ్గర నుంచి డబ్బు తీసుకుని.. గిడ్డంగుల్లో సరుకు జమ చేయలేదని భావిస్తున్నట్లుగా ఆయన వివరించారు. పెపైచ్చు ఎన్ఎస్ఈఎల్ పత్రాల్లో పేర్కొన్న గిడ్డంగుల్లో నాలుగు అసలు లేనే లేవని తేలినట్లు అధికారి పేర్కొన్నారు. -
డిఫాల్టర్లపై చర్యలు తీసుకోవాలి: ఎన్ఎస్ఈఎల్
ముంబై: చెల్లింపుల సంక్షోభం నేపథ్యంలో కమోడిటీ కాంట్రాక్ట్‌లలో ట్రేడింగ్ నిలిపివేసిన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) లావాదేవీల పరిష్కారానికి(సెటిల్మెంట్స్) స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించి రూ. 5,600 కోట్ల విలువైన లావాదేవీలను సెటిల్ చేయాల్సి ఉంది. ఇందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీను నియమించినట్లు ఎన్ఎస్ఈఎల్ తెలిపింది. కంపెనీ లాబోర్డ్ మాజీ చైర్మన్ శరద్ ఉపాసని అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్ఎస్ఈఎల్ ప్రమోటర్ జగ్నేష్ షా పేర్కొన్నారు. మిగిలిన సభ్యులలో ముంబై హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి ఆర్జే కొచర్, సెబీ, ఎల్ఐసీలకు గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన జీఎన్ బాజ్‌పాయ్, మహారాష్ర్ట మాజీ డీజీపీ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 14కల్లా చెల్లింపుల ప్రణాళికను వెల్లడించగలమని షా చెప్పారు. కాగా, చెల్లింపుల ప్రణాళికకు సహకరించని బ్రోకర్లు, సభ్యులపై తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా ఎన్ఎస్ఈఎల్ ప్రభుత్వాన్ని కోరింది. కమోడిటీ మార్కెట్లను నియంత్రించే ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్ ఎన్ఎస్ఈఎల్ సెటిల్మెంట్ అంశాన్ని పరిష్కరిస్తుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఫైనాన్షియల్ టెక్ షేరు హైజంప్ ఈ వార్తల నేపథ్యంలో ప్రమోటర్ కంపెనీ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు ధర బీఎస్ఈలో 31%(రూ. 47) ఎగసి రూ. 198 వద్ద ముగిసింది. అయితే గ్రూప్‌లోని మరో కంపెనీ ఎంసీఎక్స్ షేరు మాత్రం 10%(రూ. 41) పతనమై(లోయర్ సర్క్యూట్) రూ. 361 వద్ద నిలిచింది.