అదంతా కుట్ర, ఉల్లంఘనలు జరగలేదు!
ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై జిగ్నేశ్ షా స్పష్టీకరణ
ముంబై: మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ షేర్ల ట్రేడింగ్‌కు సంబంధించి ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు, మార్కెట్ రెగ్యులేటర్– సెబీ ఉత్తర్వులపై పీకల్లోతు కష్టాల్లో ఉన్న వ్యాపారవేత్త జిగ్నేశ్ షా పెదవి విప్పారు. ఎటువంటి ఉల్లంఘనలూ జరగలేదనీ, ఇదంతా తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రనీ శుక్రవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు లక్ష్యంగా మారినందువల్లే తాను మొట్టమొదటిసారి మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చిందని తెలియజేశారు.
ఎన్‌ఎస్‌ఈఎల్ తరహా సంక్షోభం ఏర్పడటం మార్కెట్‌లో తొలిసారేమీ కాదని పేర్కొన్న ఆయన, ఈ కేసులు పెట్టడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం సమస్య పరిష్కారం కాదనీ, పోటీ పూర్వక వాతావరణంలో గ్రూప్‌ను పూర్తిగా నిర్మూలించాలన్నదే ధ్యేయమనీ చెప్పారు. యూపీఏ–2 సమయంలో బాధ్యతల్లో ఉన్న ఒక మాజీ ఆర్థిక మంత్రి కనుసన్నల్లో ఒకప్పటి ఫార్వార్డ్ మార్కెట్స్ కమిషన్ (కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్స్ ప్రధాన రెగ్యులేటర్) పనిచేసిందనీ, కేసు విచారణ ప్రక్రియంతా ఆయన కుట్రలో భాగంగా జరిగిందనీ విమర్శించారు.
ఆయనపై న్యాయ పరమైన చర్యలు చేపట్టే విషయాన్నీ తాను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వివరాలోకి వెళితే, ఎంసీఎక్స్, దాని ఒకప్పటి మాతృసంస్థ ఎఫ్‌టీఐఎల్ షేర్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి 13 మంది పాత్ర ఉన్నట్టు సెబీ రెండు రోజుల క్రితం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. షేర్ల ధరలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్న సమాచారాన్ని బయటకు వెల్లడించకుండా వీరే ఉపయోగించుకుని, దాని ఆధారంగా ట్రేడింగ్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయన్న సెబీ, ఈ కారణంగా తలెత్తిన నష్టాలు రూ.125 కోట్లకు సంబంధించి 13 మంది ఆస్తుల స్వాధీనం సహా పలు చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. వీరిలో జిగ్నేశ్ షా బంధువులు కూడా ఉన్నారు.