18 వరకూ ఈడీ కస్టడీలో జిగ్నేశ్ షా...
ముంబై: ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (ఎఫ్‌టీఐఎల్) వ్యవస్థాకుడు జిగ్నేశ్ షా ఈ నెల 18 వరకూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) కస్టడీలో ఉంటారు. ఈ మేరకు స్థానిక ఈడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్‌కు సంబంధించి రూ.5,600 కోట్ల కుంభకోణంలో షాను బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. పరిశోధనకు సరిగ్గా సహకరించనందున ఆయనను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఈడీ ఉన్నతాధికారులు బుధవారం పేర్కొన్న సంగతి తెలిసిందే.
అయితే ఆయన విచారణకు సహకరిస్తున్నారని, అయినా ఈడీ ఇలాంటి తీవ్ర చర్య ఎందుకు తీసుకుందో అర్థం కావడం లేదని ఎఫ్‌టీఐఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. కేసు విచారణ సందర్భంగా మధ్యంతర బెయిల్ కోసం షా తరఫున న్యాయవాది పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
షేర్ 6 శాతం డౌన్: షా అరెస్ట్ నేపథ్యంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (ఇండియా) షేర్ ధర బుధవారం భారీగా పడింది. ఎన్‌ఎస్‌ఈలో ధర 6 శాతం తగ్గి, రూ.85.85 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.394 కోట్లకు పరిమితమైంది.