FTIL
-
ఎంసీఎక్స్ కేసులో జిగ్నేష్ షా అరెస్ట్
భారీ సోదాల అనంతరం సీబీఐ చర్యలు • ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్‌కు అనుమతుల్లో • నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు... న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్టీఐఎల్), కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఎంసీఎక్స్ల ప్రమోటర్ జిగ్నేష్ షాను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్‌కు సెబీ అనుమతుల విషయంలో నిబంధనల ఉల్లంఘన, వాస్తవాలను దాచిపెట్టడం, మోసం తదితర ఆరోపణలకు సంబంధించిన కేసులో సీబీఐ ఈ చర్యలు చేపట్టింది. కాగా, అరెస్ట్‌కు ముందు జిగ్నేష్ షా నివాసం, ఎఫ్టీఐఎల్, ఎంసీఎక్స్‌తో పాటు ముంబైలో మొత్తం 9 చోట్ల భారీగా సోదాలు చేసినట్లు సీబీఐ ప్రతినిధి ఆర్కే గౌర్ వెల్లడించారు. సోదాల జాబితాలో సెబీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మురళీధర్‌రావు, డీజీఎం రాజేష్ దంగేటి, ఏజీఎం విశాఖ మోరె, సెబీ మాజీ ఈడీ జీఎన్ గుప్తాలకు చెందిన నివాసాలు కూడా ఉన్నాయి. వీళ్లందరిపై రెండేళ్ల క్రితం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, సీబీఐ సోదాల సమాచారాన్ని 63 మూన్స్(గతంలో ఎఫ్టీఐఎల్), ఎంసీఎక్స్లు ఎక్స్ఛేంజీలకు వెల్లడించాయి. మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గతంలో ఎంసీఎక్స్-ఎస్ఎక్స్)కు సెబీ గుర్తింపు అనుమతుల కేసులో ఈ సోదాలు జరుగుతున్నట్లు ఎంసీఎక్స్ పేర్కొంది. కేసు పూర్వాపరాలివీ... ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ 2013లో స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యకలాపాలను ప్రారంభించింది. అంతక్రితం దీనికి సంబంధించిన అనుమతుల విషయంలో సెబీతో చాలా కాలంపాటు న్యాయపోరాటం చేసింది. అయితే, సెబీ అధికారులతో సంబంధిత కంపెనీలు కుమ్మక్కై అనుమతులను సంపాదించాయన్న ఆరోపణలతో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం(ఐపీసీ సెక్షన్లు)తో పాటు అవినీతి నిరోధక చట్టంకింద(అధికార దుర్వినియోగం) కూడా అభియోగాలను మోపింది. ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ ప్రమోటర్లు సెబీ నిబంధనలకు విరుద్ధంగా 2006లో ఒక జాతీయ బ్యాంకుతో బైబ్యాక్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని కూడా సీబీఐ ఆరోపించింది. కరెన్సీ డెరివేటివ్స్ విభాగంలో ఎక్స్ఛేంజ్ గుర్తింపు కోసం సెబీకి దరఖాస్తు చేసిన సమయంలో జిగ్నేష్ షా ఈ అంశాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని.. దీనికి కొంతమంది సెబీ అధికారులతో కుమ్మక్కయ్యారని పేర్కొంది. సెబీని మోసం చేసి 2009-10లో ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ గుర్తింపును పొందిందని తెలిపింది. ఇతర విభాగాల్లో ట్రేడింగ్‌కు సెబీ అనుమతులను నిరాకరించినప్పటికీ.. కరెన్సీ డెరివేటివ్స్‌కు అనుమతులపై కొంతమంది సెబీ అధికారులు కావాలనే ఎలాంటి నోటీసులూ జారీచేయలేదనేది కూడా సీబీఐ ఆరోపణల్లో ప్రధానంగా ఉంది. షేర్ల బదలాయింపు, ఎఫ్డీఆర్, ఆస్తుల కొనుగోలు ఇతరత్రా డాక్యుమెంట్లను సోదాల్లో స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ ప్రతినిధి గౌర్ తెలిపారు. దర్యాప్తు కొనసాగింపులో ఈ పత్రాలను పరిశీలించనున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా, నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈఎల్)కు సంబంధించి రూ.7,000 కోట్ల భారీ కుంభకోణం కేసులో కూడా గతంలో జిగ్నేష్ షాను ఈడీ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈఎల్‌ను ప్రమోట్ చేసిన కంపెనీ కూడా జిగ్నేష్ షాకు చెందిన ఎఫ్టీఐఎల్ కావడం గమనార్హం. ఈ కేసులో ముంబై పోలీస్ శాఖ(ఆర్థిక నేరాల విభాగం) ఇప్పటికే రూ.7,000 కోట్ల విలువైన ఎఫ్టీఐఎల్ ఆస్తులను అటాచ్ చేసింది. జిగ్నేష్ షా: ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ప్రమోటర్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్: ఎంసీఎక్స్, ఎన్ఎస్ఈఎల్లను ప్రమోట్ చేసిన కంపెనీ ఎంసీఎక్స్: దేశంలో ప్రధాన కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఎంసీఎక్స్-ఎస్ఎక్స్: స్టాక్ ఎక్స్ఛేంజ్. దీన్ని ఎఫ్టీఐఎల్, ఎంసీఎక్స్లు ప్రమోట్ చేశాయి. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్: కమోడిటీ ఎక్స్ఛేంజ్ (భారీ స్కామ్ నేపథ్యంలో ఇది మూతపడింది) -
ఎన్ఎస్ఈఎల్ స్కాంలో ఆస్తుల ఎటాచ్
మనీలాండరింగ్ స్కాంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా(ఎఫ్టీఐఎల్)కు ఈడీ భారీ షాకిచ్చింది. సంస్థకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ ఎటాచ్ చేసింది. ఆస్తులు, నగదురూపంలో రూ.1,253 కోట్లను ఎటాచ్ చేసింది. రూ. 5600 కోట్ల ఎన్ఎస్ఈఎల్ (నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్) స్కాం కేసులో ఈడీ ఈ చర్యలు తీసుకుంది. ఎన్ఎస్ఈఎల్ కుంభకోణంలో ఎందరో బ్రోకర్లు, ఇన్వెస్టర్లు వందల కోట్లకు ఎఫ్ టీఐఎల్ మోసం చేసిందనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో బోగస్ డీల్స్ ద్వారా జిగ్నేష్ రూ. 76 కోట్లు అక్రమంగా వెనకేశాడని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ కోర్టులో వాదించింది. కాగా నేషనల్ స్పాట్ ఎక్సేంజీలో జరిగిన రూ.5,600 కోట్ల కుంభకోణానికి సంబంధించి గతంలో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు ఇటీవల ఈ స్కాం సూత్రధారి, ఫైనాన్షియల్ టెక్నాలజీస్ మాజీ ఛైర్మన్ జిగ్నేష్ షాను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
జిగ్నేశ్ షా దెబ్బతో ఎఫ్టీఐఎల్ ఢమాల్
జిగ్నేశ్ షా ప్రమోటడ్ కంపెనీ ఫైనాన్సియల్ టెక్నాలజీస్(ఎఫ్టీఐఎల్) ఆస్తుల అటాచ్ మెంట్ తో, ఆ కంపెనీ కౌంటర్లో షేర్ల అమ్మకం ఊపందుకుంది.ఎఫ్టీఐఎల్ షేరు దాదాపు 17.5 శాతం క్షీణించి, 52 కనిష్టానికి దిగజారింది. ప్రస్తుతం షేరు ధర రూ.70.65గా నమోదవుతోంది. తాజాగా ముంబై ఆర్థిక నేరాల విభాగం ఫైనాన్సియల్ టెక్నాలజీస్ కు చెందిన రూ.2,000 కోట్ల స్థిరాస్తులను స్వాధీన పరుచుకుంది. కంపెనీ బ్యాంకు బ్యాలన్స్ ను ఆర్థిక నేరాల విభాగం అటాచ్ చేసింది. ఎఫ్టీఐఎల్ కు చెందిన అన్ని కార్యాలయాలను ఈ విభాగం స్వాధీనం చేసుకుంటోంది. జిగ్నేశ్ షా అరెస్టు నేపథ్యంలో దిగజారిన షేర్ల పతనం, ఆయన కంపెనీ ఆస్తుల అటాచ్ మెంట్ తో మరింత కుప్పకూలుతున్నాయి. ఇన్వెస్టర్ల పెట్టుబడుల చెల్లింపుల్లో విఫలమైన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ సంస్థ ప్రమోటర్ జిగ్నేశ్ షాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన సంగతి తెలిసిందే. రూ.5,600 కోట్ల ఇన్వెస్టర్ల మనీకి నష్టంవాటిల్లేలా చేశారని, ఈ కుంభకోణ పరిశోధనకు ఆయన సరిగ్గా సహకరించనందున షాను అరెస్టు చేశామని ఈడీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం జిగ్నేశ్ షాపై విచారణ కొనసాగుతోంది. ఎఫ్టీఐఎల్ లో దాదాపు 63వేల మంది షేర్ హోల్డర్స్, 1,000మంది ఉద్యోగులున్నారు. షేర్ హోల్డర్స్, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అన్ని చట్టపరమైన నివారణలు తీసుకుంటామని కంపెనీ చెబుతోంది. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫైనాన్సియల్ టెక్నాలజీస్ కు ఎన్ఎస్ఈఎల్ సబ్సిడరీ. -
18 వరకూ ఈడీ కస్టడీలో జిగ్నేశ్ షా...
ముంబై: ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (ఎఫ్టీఐఎల్) వ్యవస్థాకుడు జిగ్నేశ్ షా ఈ నెల 18 వరకూ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) కస్టడీలో ఉంటారు. ఈ మేరకు స్థానిక ఈడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్‌కు సంబంధించి రూ.5,600 కోట్ల కుంభకోణంలో షాను బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. పరిశోధనకు సరిగ్గా సహకరించనందున ఆయనను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఈడీ ఉన్నతాధికారులు బుధవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన విచారణకు సహకరిస్తున్నారని, అయినా ఈడీ ఇలాంటి తీవ్ర చర్య ఎందుకు తీసుకుందో అర్థం కావడం లేదని ఎఫ్టీఐఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. కేసు విచారణ సందర్భంగా మధ్యంతర బెయిల్ కోసం షా తరఫున న్యాయవాది పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. షేర్ 6 శాతం డౌన్: షా అరెస్ట్ నేపథ్యంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (ఇండియా) షేర్ ధర బుధవారం భారీగా పడింది. ఎన్ఎస్ఈలో ధర 6 శాతం తగ్గి, రూ.85.85 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.394 కోట్లకు పరిమితమైంది. -
ఎస్ఎంఎక్స్ని అమ్మేసిన ఎఫ్టీఐఎల్
సింగపూర్/ముంబై: ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్టీఐఎల్)... సింగపూర్ మర్కంటైల్ ఎక్స్ఛేంజీ(ఎస్ఎంఎక్స్)ని రూ. 931 కోట్లకు(15 కోట్ల డాలర్లు) విక్రయించింది. పూర్తినగదు చెల్లించే విధంగా 100% వాటా కొనుగోలుకి అమెరికా సంస్థ ఇంటర్కాంటినెంటల్ ఎక్స్ఛేంజీ(ఐసీఈ)తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఎఫ్టీఐఎల్ బీఎస్ఈకి వెల్లడించింది. జిగ్నేష్ షాకు చెందిన ఎఫ్టీఐఎల్ 2010 ఆగస్ట్‌లో ఎస్ఎంఎక్స్ను సింగపూర్‌లో ఏర్పాటు చేసింది. లోహాలు, ఇంధనం, కరెన్సీ, వ్యవసాయ కమోడిటీల ట్రేడింగ్‌ను ఎస్ఎంఎక్స్ నిర్వహిస్తుంది. ఎఫ్టీఐఎల్ దేశీయంగా ఏర్పాటు చేసిన నేషనల్ స్పాట్ ఎక్స్చేంజీ(ఎన్ఎస్ఈఎల్) ఇన్వెస్టర్లకు రూ. 5,600 కోట్లమేర చెల్లింపుల విషయంలో విఫలమై సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఎంఎక్స్ అమ్మకానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఎఫ్టీఐఎల్ దేశీయంగా ఎంసీఎక్స్, ఎంసీఎక్స్-ఎస్ఎక్స్లను సైతం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రివ్వుమన్న షేరు: ఎస్ఎంఎక్స్ విక్రయ వార్తలతో బీఎస్ఈలో ఎఫ్టీఐఎల్ షేరు ఒక దశలో 11% జంప్‌చేసి రూ. 201ను తాకినప్పటికీ చివరికి 2% లాభంతో రూ. 185 వద్ద ముగిసింది. కాగా, తాను అభివృద్ధి చేసిన ఎస్ఎంఎక్స్ను విక్రయించడం బాధించినా, ఐసీఈ నేతృత్వంలో సింగపూర్ మౌలిక సదుపాయాలు, నియంత్రణల ద్వారా మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందన్న సంతోషంకూడా ఉన్నదని ఎఫ్టీఐఎల్ ప్రమోటర్ షా వ్యాఖ్యానించారు. నిధులను ప్రధానంగా విదేశీ వాణిజ్య రుణాలు, విదేశీ కరెన్సీ రుణాల చెల్లింపునకు వినియోగించనున్నట్లు తెలిపారు. తద్వారా దాదాపు రుణ భారంలేని కంపెనీకానున్నట్లు చెప్పారు. మరోవైపు ఎన్ఎస్ఈఎల్ ఇన్వెస్టర్ల కమిటీ ప్రెసిడెంట్ అరుణ్ దాల్మియా ఎస్ఎంఎక్స్ను ఉన్నపళాన విక్రయించడంపై సందేహాలను వ్యక్తం చేశారు. ఎన్ఎస్ఈఎల్ చెల్లింపుల సంక్షోభానికి ఎఫ్టీఐఎల్ది కూడా బాధ్యత ఉన్నదని, ఇందువల్ల ఈ సొమ్ముతో ముందు ఇన్వెస్టర్లకు బాకీలను చెల్లించాలని డిమాండ్ చేశారు. -
జిగ్నేష్ షాకి ఎఫ్ఎంసీ షోకాజ్
న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్చేంజీ చెల్లింపుల సంక్షోభం దరిమిలా ప్రమోటింగ్ సంస్థ ఎఫ్టీఐఎల్ వ్యవస్థాపకుడు జిగ్నేష్ షాతో పాటు మరో ముగ్గురు అధికారులకు ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వివాదం నేపథ్యంలో మ రో గ్రూప్ సంస్థ ఎంసీఎక్స్ని నిర్వహించేందుకు వారిని సమర్థులుగా ఎందుకు భావించాలో 2 వారాల్లో చెప్పాలంటూ ఆదేశిం చింది. పోలీసుల లుక్ అవుట్ నోటీసుల తరువాత షా కు.. ఇది మరో షాక్. -
ఎన్‌ఎస్‌ఈఎల్‌కు ఐటీ స్పాట్
న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)పై ఆదాయ పన్ను(ఐటీ) శాఖ దృష్టి సారించింది. ప్రమోటర్ కంపెనీ ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్టీఐఎల్)కు నిధులను బదిలీ చేయడంలో పన్ను నిబంధనల ఉల్లంఘన జరిగిందా అన్న విషయంపై దర్యాప్తు చేపట్టనుంది. దీనిలో భాగంగా ఎఫ్‌టీఐఎల్‌కు ఎన్ఎస్ఈఎల్ చేసిన చెల్లింపుల కు సంబంధించిన లావాదేవీలపై ఐటీ శాఖ ఆరా తీయనుంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? అవకతవకలేమైనా జరిగాయా? తదితర వివరాలను పరిశీలించనున్నట్లు ఆ అధికారి తెలిపారు. ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకున్నందుకుగాను ఎఫ్‌టీఐఎల్‌కు 2011-12లో ఎన్ఎస్ఈఎల్ రూ. 15.56 కోట్లను చెల్లించింది. తిరిగి 2012-13లో ఈ చార్జీలను రెట్టింపునకు పెంచి రూ. 33.8 కోట్లను చెల్లించింది. ఇన్వెస్టర్ల నిధులను సంబంధించిన వివరాలను అందించమంటూ ఇప్పటికే ఎన్ఎస్ఈఎల్ కమోడిటీ ఫ్యూచర్స్‌లో రూ. 50 కోట్లకుపైగా లావాదేవీలు కలిగిన 8 బ్రోకింగ్ సంస్థలను ఐటీ శాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ సంస్థలలో ఆనంద్‌రాఠీ, మోతీలాల్ ఓస్వాల్, ఇండియా ఇన్ఫోలైన్, సిస్టమాటిక్స్ తదితరాలున్నాయి. ఈ కేసులో విదేశీమారక నిబంధనల(ఫెమా) ఉల్లంఘన అంశంపై ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ సైతం దర్యాప్తును మొదలు పెట్టిన విషయం విదితమే. కాగా, ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 10%పైగా పతనమై రూ. 150 వద్ద ముగిసింది. వెనక్కి తగ్గిన ఆడిటర్లు గతేడాదికి(2012-13)గాను ఖాతాలపై నివేదిక ఇచ్చిన ఎఫ్టీఐఎల్ ఆడిటర్ సంస్థ ‘డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్’ వెనకడుగు వేసింది. ఈ ఖాతాలపై తమ నివేదిక(ఆడిట్)ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఇన్వెస్టర్లకు రూ. 5,600 కోట్ల చెల్లింపుల్లో విఫలమైన గ్రూప్ సంస్థ ఎన్ ఎస్ఈఎల్ ఎదుర్కొంటున్న సంక్షోభం నేపథ్యంలో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆడిటర్ సంస్థ వివరణ ఇచ్చింది. సంక్షోభం తరువాత వరుసగా ఆరో వారంలోనూ ఎన్ఎస్ఈఎల్ చెల్లింపుల విషయంలో విఫలంకావడం గమనార్హం. కాగా, ఎన్ఎస్ఈఎల్ ప్రభావం తమ స్టాండెలోన్ ఆర్థిక ఫలితాల పై అంతంత మాత్రమేనని ఎఫ్టీఐఎల్ పేర్కొంది. నికర లాభంలో ఈ వాటా 6.6% మాత్రమేనని వెల్లడించింది. ఇక మరోవైపు ఎన్ఎస్ఈఎల్ సంక్షోభంపై రూపొందించిన నివేదికను ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ ఇటు ప్రధాని కార్యాలయంతోపాటు, ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి అందజేశారు. నివేదికలో కమోడిటీ ఎక్స్ఛేంజీ నిర్వహణలో జరిగిన లోపాలను ఎత్తిచూపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రంగంలోకి ఐసీఏఐ ఎన్ఎస్ఈఎల్ సంక్షోభం నేపథ్యంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్‌కు సంబంధించి ఓవైపు ఆడిటర్లు తాము నిర్వహించిన ఖాతాల ఆడిట్‌ను ఉపసంహరించుకోగా, మరోవైపు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్(ఐసీఏఐ) దర్యాప్తు మొదలైంది. ఆడిటింగ్ ప్రమాణాల నిబంధనల్లో భాగంగా కొన్ని సందర్భాల్లో ఆడిటర్లు తమ నివేదికలను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఈ విషయాలపై వివిధ నియంత్రణ సంస్థలు, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, ఎన్ఎస్ఈఎల్లకు సంబంధించిన వ్యక్తుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ సుబోధ్ కుమార్ అగర్వాల్ చెప్పారు. కాగా, ఎఫ్టీఐఎల్ ఖాతాల విషయంలో ఆడిటర్లు వెనక్కుతగ్గడంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఈ విషయాలపై నిజానిజాల కోసం ఎఫ్టీఐఎల్ను సంప్రదిస్త్తున్నామని సెబీ హోల్‌టైమ్ డెరైక్టర్ రాజీవ్ కుమార్ అగర్వాల్ చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎఫ్టీఐఎల్ ప్రమోటర్ జిగ్నేష్ షా ఎన్ఎస్ఈఎల్ మేనేజ్మెంట్ చేసిన అవకతవకలకు తాను బలవుతున్నానని వ్యాఖ్యానించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు అవసరమైన మద్దతు ఇవ్వాల్సిందిగా అటు వాటాదారులను, ఇటు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.