సింగపూర్/ముంబై: ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్‌టీఐఎల్)... సింగపూర్ మర్కంటైల్ ఎక్స్ఛేంజీ(ఎస్‌ఎంఎక్స్)ని రూ. 931 కోట్లకు(15 కోట్ల డాలర్లు) విక్రయించింది. పూర్తినగదు చెల్లించే విధంగా 100% వాటా కొనుగోలుకి అమెరికా సంస్థ ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజీ(ఐసీఈ)తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఎఫ్‌టీఐఎల్ బీఎస్‌ఈకి వెల్లడించింది. జిగ్నేష్ షాకు చెందిన ఎఫ్‌టీఐఎల్ 2010 ఆగస్ట్‌లో ఎస్‌ఎంఎక్స్‌ను సింగపూర్‌లో ఏర్పాటు చేసింది. లోహాలు, ఇంధనం, కరెన్సీ, వ్యవసాయ కమోడిటీల ట్రేడింగ్‌ను ఎస్‌ఎంఎక్స్ నిర్వహిస్తుంది. ఎఫ్‌టీఐఎల్ దేశీయంగా ఏర్పాటు చేసిన నేషనల్ స్పాట్ ఎక్స్చేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్) ఇన్వెస్టర్లకు రూ. 5,600 కోట్లమేర చెల్లింపుల విషయంలో విఫలమై సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌ఎంఎక్స్ అమ్మకానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఎఫ్‌టీఐఎల్ దేశీయంగా ఎంసీఎక్స్, ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్‌లను సైతం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
రివ్వుమన్న షేరు: ఎస్‌ఎంఎక్స్ విక్రయ వార్తలతో బీఎస్‌ఈలో ఎఫ్‌టీఐఎల్ షేరు ఒక దశలో 11% జంప్‌చేసి రూ. 201ను తాకినప్పటికీ చివరికి 2% లాభంతో రూ. 185 వద్ద ముగిసింది. కాగా, తాను అభివృద్ధి చేసిన ఎస్‌ఎంఎక్స్‌ను విక్రయించడం బాధించినా, ఐసీఈ నేతృత్వంలో సింగపూర్ మౌలిక సదుపాయాలు, నియంత్రణల ద్వారా మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందన్న సంతోషంకూడా ఉన్నదని ఎఫ్‌టీఐఎల్ ప్రమోటర్ షా వ్యాఖ్యానించారు. నిధులను ప్రధానంగా విదేశీ వాణిజ్య రుణాలు, విదేశీ కరెన్సీ రుణాల చెల్లింపునకు వినియోగించనున్నట్లు తెలిపారు. తద్వారా దాదాపు రుణ భారంలేని కంపెనీకానున్నట్లు చెప్పారు. మరోవైపు ఎన్‌ఎస్‌ఈఎల్ ఇన్వెస్టర్ల కమిటీ ప్రెసిడెంట్ అరుణ్ దాల్మియా ఎస్‌ఎంఎక్స్‌ను ఉన్నపళాన విక్రయించడంపై సందేహాలను వ్యక్తం చేశారు. ఎన్‌ఎస్‌ఈఎల్ చెల్లింపుల సంక్షోభానికి ఎఫ్‌టీఐఎల్‌ది కూడా బాధ్యత ఉన్నదని, ఇందువల్ల ఈ సొమ్ముతో ముందు ఇన్వెస్టర్లకు బాకీలను చెల్లించాలని డిమాండ్ చేశారు.