న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్)పై ఆదాయ పన్ను(ఐటీ) శాఖ దృష్టి సారించింది. ప్రమోటర్ కంపెనీ ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్‌టీఐఎల్)కు నిధులను బదిలీ చేయడంలో పన్ను నిబంధనల ఉల్లంఘన జరిగిందా అన్న విషయంపై దర్యాప్తు చేపట్టనుంది. దీనిలో భాగంగా ఎఫ్‌టీఐఎల్‌కు ఎన్‌ఎస్‌ఈఎల్ చేసిన చెల్లింపుల కు సంబంధించిన లావాదేవీలపై ఐటీ శాఖ ఆరా తీయనుంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? అవకతవకలేమైనా జరిగాయా? తదితర వివరాలను పరిశీలించనున్నట్లు ఆ అధికారి తెలిపారు. ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకున్నందుకుగాను ఎఫ్‌టీఐఎల్‌కు 2011-12లో ఎన్‌ఎస్‌ఈఎల్ రూ. 15.56 కోట్లను చెల్లించింది.
తిరిగి 2012-13లో ఈ చార్జీలను రెట్టింపునకు పెంచి రూ. 33.8 కోట్లను చెల్లించింది. ఇన్వెస్టర్ల నిధులను సంబంధించిన వివరాలను అందించమంటూ ఇప్పటికే ఎన్‌ఎస్‌ఈఎల్ కమోడిటీ ఫ్యూచర్స్‌లో రూ. 50 కోట్లకుపైగా లావాదేవీలు కలిగిన 8 బ్రోకింగ్ సంస్థలను ఐటీ శాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ సంస్థలలో ఆనంద్‌రాఠీ, మోతీలాల్ ఓస్వాల్, ఇండియా ఇన్ఫోలైన్, సిస్టమాటిక్స్ తదితరాలున్నాయి. ఈ కేసులో విదేశీమారక నిబంధనల(ఫెమా) ఉల్లంఘన అంశంపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ సైతం దర్యాప్తును మొదలు పెట్టిన విషయం విదితమే. కాగా, ఈ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 10%పైగా పతనమై రూ. 150 వద్ద ముగిసింది.
వెనక్కి తగ్గిన ఆడిటర్లు
గతేడాదికి(2012-13)గాను ఖాతాలపై నివేదిక ఇచ్చిన ఎఫ్‌టీఐఎల్ ఆడిటర్ సంస్థ ‘డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్’ వెనకడుగు వేసింది. ఈ ఖాతాలపై తమ నివేదిక(ఆడిట్)ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఇన్వెస్టర్లకు రూ. 5,600 కోట్ల చెల్లింపుల్లో విఫలమైన గ్రూప్ సంస్థ ఎన్ ఎస్‌ఈఎల్ ఎదుర్కొంటున్న సంక్షోభం నేపథ్యంలో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆడిటర్ సంస్థ వివరణ ఇచ్చింది. సంక్షోభం తరువాత వరుసగా ఆరో వారంలోనూ ఎన్‌ఎస్‌ఈఎల్ చెల్లింపుల విషయంలో విఫలంకావడం గమనార్హం. కాగా, ఎన్‌ఎస్‌ఈఎల్ ప్రభావం తమ స్టాండెలోన్ ఆర్థిక ఫలితాల పై అంతంత మాత్రమేనని ఎఫ్‌టీఐఎల్ పేర్కొంది. నికర లాభంలో ఈ వాటా 6.6% మాత్రమేనని వెల్లడించింది. ఇక మరోవైపు ఎన్‌ఎస్‌ఈఎల్ సంక్షోభంపై రూపొందించిన నివేదికను ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ ఇటు ప్రధాని కార్యాలయంతోపాటు, ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి అందజేశారు. నివేదికలో కమోడిటీ ఎక్స్ఛేంజీ నిర్వహణలో జరిగిన లోపాలను ఎత్తిచూపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
రంగంలోకి ఐసీఏఐ
ఎన్‌ఎస్‌ఈఎల్ సంక్షోభం నేపథ్యంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్‌కు సంబంధించి ఓవైపు ఆడిటర్లు తాము నిర్వహించిన ఖాతాల ఆడిట్‌ను ఉపసంహరించుకోగా, మరోవైపు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్(ఐసీఏఐ) దర్యాప్తు మొదలైంది. ఆడిటింగ్ ప్రమాణాల నిబంధనల్లో భాగంగా కొన్ని సందర్భాల్లో ఆడిటర్లు తమ నివేదికలను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఈ విషయాలపై వివిధ నియంత్రణ సంస్థలు, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, ఎన్‌ఎస్‌ఈఎల్‌లకు సంబంధించిన వ్యక్తుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ సుబోధ్ కుమార్ అగర్వాల్ చెప్పారు. కాగా, ఎఫ్‌టీఐఎల్ ఖాతాల విషయంలో ఆడిటర్లు వెనక్కుతగ్గడంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఈ విషయాలపై నిజానిజాల కోసం ఎఫ్‌టీఐఎల్‌ను సంప్రదిస్త్తున్నామని సెబీ హోల్‌టైమ్ డెరైక్టర్ రాజీవ్ కుమార్ అగర్వాల్ చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎఫ్‌టీఐఎల్ ప్రమోటర్ జిగ్నేష్ షా ఎన్‌ఎస్‌ఈఎల్ మేనేజ్‌మెంట్ చేసిన అవకతవకలకు తాను బలవుతున్నానని వ్యాఖ్యానించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు అవసరమైన మద్దతు ఇవ్వాల్సిందిగా అటు వాటాదారులను, ఇటు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
ఎన్‌ఎస్‌ఈఎల్‌కు ఐటీ స్పాట్
Published Thu, Sep 26 2013 1:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement