జిగ్నేష్ షాను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సీబీఐ అధికారులు
భారీ సోదాల అనంతరం సీబీఐ చర్యలు
• ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్‌కు అనుమతుల్లో
• నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు...
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్‌టీఐఎల్), కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఎంసీఎక్స్‌ల ప్రమోటర్ జిగ్నేష్ షాను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్‌కు సెబీ అనుమతుల విషయంలో నిబంధనల ఉల్లంఘన, వాస్తవాలను దాచిపెట్టడం, మోసం తదితర ఆరోపణలకు సంబంధించిన కేసులో సీబీఐ ఈ చర్యలు చేపట్టింది. కాగా, అరెస్ట్‌కు ముందు జిగ్నేష్ షా నివాసం, ఎఫ్‌టీఐఎల్, ఎంసీఎక్స్‌తో పాటు ముంబైలో మొత్తం 9 చోట్ల భారీగా సోదాలు చేసినట్లు సీబీఐ ప్రతినిధి ఆర్‌కే గౌర్ వెల్లడించారు.
సోదాల జాబితాలో సెబీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మురళీధర్‌రావు, డీజీఎం రాజేష్ దంగేటి, ఏజీఎం విశాఖ మోరె, సెబీ మాజీ ఈడీ జీఎన్ గుప్తాలకు చెందిన నివాసాలు కూడా ఉన్నాయి. వీళ్లందరిపై రెండేళ్ల క్రితం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, సీబీఐ సోదాల సమాచారాన్ని 63 మూన్స్(గతంలో ఎఫ్‌టీఐఎల్), ఎంసీఎక్స్‌లు ఎక్స్ఛేంజీలకు వెల్లడించాయి. మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గతంలో ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్)కు సెబీ గుర్తింపు అనుమతుల కేసులో ఈ సోదాలు జరుగుతున్నట్లు ఎంసీఎక్స్ పేర్కొంది.
కేసు పూర్వాపరాలివీ...
ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్ 2013లో స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యకలాపాలను ప్రారంభించింది. అంతక్రితం దీనికి సంబంధించిన అనుమతుల విషయంలో సెబీతో చాలా కాలంపాటు న్యాయపోరాటం చేసింది. అయితే, సెబీ అధికారులతో సంబంధిత కంపెనీలు కుమ్మక్కై అనుమతులను సంపాదించాయన్న ఆరోపణలతో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం(ఐపీసీ సెక్షన్లు)తో పాటు అవినీతి నిరోధక చట్టంకింద(అధికార దుర్వినియోగం) కూడా అభియోగాలను మోపింది. ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్ ప్రమోటర్లు సెబీ నిబంధనలకు విరుద్ధంగా 2006లో ఒక జాతీయ బ్యాంకుతో బైబ్యాక్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని కూడా సీబీఐ ఆరోపించింది.
కరెన్సీ డెరివేటివ్స్ విభాగంలో ఎక్స్ఛేంజ్ గుర్తింపు కోసం సెబీకి దరఖాస్తు చేసిన సమయంలో జిగ్నేష్ షా ఈ అంశాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని.. దీనికి కొంతమంది సెబీ అధికారులతో కుమ్మక్కయ్యారని పేర్కొంది. సెబీని మోసం చేసి 2009-10లో ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్ గుర్తింపును పొందిందని తెలిపింది. ఇతర విభాగాల్లో ట్రేడింగ్‌కు సెబీ అనుమతులను నిరాకరించినప్పటికీ.. కరెన్సీ డెరివేటివ్స్‌కు అనుమతులపై కొంతమంది సెబీ అధికారులు కావాలనే ఎలాంటి నోటీసులూ జారీచేయలేదనేది కూడా సీబీఐ ఆరోపణల్లో ప్రధానంగా ఉంది. షేర్ల బదలాయింపు, ఎఫ్‌డీఆర్, ఆస్తుల కొనుగోలు ఇతరత్రా డాక్యుమెంట్లను సోదాల్లో స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ ప్రతినిధి గౌర్ తెలిపారు. దర్యాప్తు కొనసాగింపులో ఈ పత్రాలను పరిశీలించనున్నామని ఆయన పేర్కొన్నారు.
కాగా, నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈఎల్)కు సంబంధించి రూ.7,000 కోట్ల భారీ కుంభకోణం కేసులో కూడా గతంలో జిగ్నేష్ షాను ఈడీ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈఎల్‌ను ప్రమోట్ చేసిన కంపెనీ కూడా జిగ్నేష్ షాకు చెందిన ఎఫ్‌టీఐఎల్ కావడం గమనార్హం. ఈ కేసులో ముంబై పోలీస్ శాఖ(ఆర్థిక నేరాల విభాగం) ఇప్పటికే రూ.7,000 కోట్ల విలువైన ఎఫ్‌టీఐఎల్ ఆస్తులను అటాచ్ చేసింది.
జిగ్నేష్ షా: ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ప్రమోటర్
ఫైనాన్షియల్ టెక్నాలజీస్: ఎంసీఎక్స్, ఎన్‌ఎస్‌ఈఎల్‌లను ప్రమోట్ చేసిన కంపెనీ
ఎంసీఎక్స్: దేశంలో ప్రధాన కమోడిటీ ఎక్స్ఛేంజ్
ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్: స్టాక్ ఎక్స్ఛేంజ్. దీన్ని ఎఫ్‌టీఐఎల్, ఎంసీఎక్స్‌లు ప్రమోట్ చేశాయి.
నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్: కమోడిటీ ఎక్స్ఛేంజ్ (భారీ స్కామ్ నేపథ్యంలో ఇది మూతపడింది)