జిగ్నేష్ షాకు బెయిల్
ముంబై: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఈఎల్) కుంభకోణం కేసులో జిగ్నేష్ షాకు షరతులతో కూడిన బెయిల్ లభించింది. బొంబాయి హైకోర్టు జస్టిస్ అభయ్ తాప్సే శుక్రవారం బెయిల్ జారీ ఆదేశాలు ఇచ్చారు. జిగ్నేష్ స్థాపించిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్ గ్రూప్‌లో ఎన్‌ఎస్‌ఈఎల్ ఒక విభాగం. దాదాపు రూ.5,600 కోట్ల ఎన్‌ఎస్‌ఈఎల్ కుంభకోణంలో మే 7న షా అరెస్టయ్యారు. అంటే దాదాపు 107 రోజులు జైలులో గడిపారు.
షరతులివి...
రెండు వారాల్లో క్యాష్ రూ.5,00,000 క్యాష్ ష్యూరిటీ, అంతే మొత్తానికి సమానంగా సాల్వెంట్ ష్యూరిటీ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే నిందితుడు తప్పించుకుని పారిపోయే ఉద్దేశం లేనివాడు కావడం వల్ల రెండు ష్యూరిటీలకు బదులుగా రూ.5,00,000 క్యాష్ ష్యూరిటీపైనే బెయిల్ ఇవ్వాలని షా న్యాయవాదులు అమిత్ నాయక్, అనికేత్ నికామ్‌లు చేసిన వినతికి న్యాయస్థానం అంగీకరించింది.
విచారణా కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకూ ప్రతి సోమ, గురువారాల్లో విచారణా సంస్థ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని కూడా కోర్టు షాకు ఆదేశాలు ఇచ్చింది. ఆయన పాస్‌పోర్ట్ ఇప్పటికే అధికారుల స్వాధీనంలో ఉంది. కుంభకోణంలో డబ్బు నష్టపోయిన వారు షాకు బెయిల్ ఇవ్వడం తగదని అంతకుముందు కోర్టుకు విన్నవించారు. విచారణా (దిగువ) కోర్టు జూన్ 24న షాకు బెయిల్ మంజూరుకు నిరాకరించింది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో షా విడుదలైతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందువల్లే బెయిల్‌కు నిరాకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులను షా బొంబాయి హైకోర్టులో సవాలు చేశారు. కుంభకోణంలో ఆయన తప్పేమీ లేదని షా న్యాయవాదులు వాదించారు. ఆయన ఉద్యోగులు కొందరికి ఈ అంశంలో భాగం ఉండే అవకాశం ఉందని వివరించారు. అసలు ఏమి జరుగుతోందో కూడా ఆయన దృష్టికి రాలేదని పేర్కొన్నారు.