కుంభకోణానికి కారణం నువ్వే.. కాదు నువ్వే...
ముంబై: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న ఎన్‌ఎస్‌ఈఎల్ మాజీ సీఈవో అంజనీ సిన్హా, సంస్థ ప్రమోటర్ జిగ్నేష్ షా ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగారు. కుంభకోణానికి కారణం నువ్వంటే.. నువ్వంటూ విమర్శలు గుప్పించుకున్నారు. ముంబై పోలీసుశాఖలోని ఆర్థిక నేరాల వింగ్ (ఈవోడబ్ల్యూ) సిన్హా సమక్షంలో జిగ్నేష్ షాని విచారణ చేస్తుండగా ఇది జరిగింది. విచారణ సమయంలో.. సంక్షోభానికి పూర్తి బాధ్యత షా, ఇతర బోర్డు సభ్యులదేనని, వారు ఇచ్చిన ఆదేశాలు మాత్రమే తాను పాటించానని సిన్హా పేర్కొన్నారు.
కానీ, దీనికి బాధ్యుడు సిన్హానేనని షా ఆరోపించారు. షాని ఇప్పటికే రెండు సార్లు ప్రశ్నించిన పోలీసులు అవసరమైతే మళ్లీ పిలిపిస్తామన్నారు. మరోవైపు, కుంభకోణం ఆరోపణలపై అరెస్టయిన ఎన్‌ఎస్‌ఈఎల్ మాజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ ముఖర్జీకి సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. సంస్థ వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో... బ్యాంకులు బ్లాక్‌లిస్టులో ఉంచిన సంస్థలకు ముఖర్జీ ఎన్‌ఎస్‌ఈఎల్ నుంచి రుణాలిప్పించేవారని విచారణలో వెల్లడైంది. ఇందుకోసం ముందుగా బ్యాంకుల వద్దకి వెళ్లి అవి బ్లాక్‌లిస్టు చేసిన సంస్థల జాబితాను ఆయన తీసుకునేవారు. ఆ తర్వాత ఎన్‌ఎస్‌ఈఎల్ నుంచి రుణాలిప్పిస్తానంటూ ఆయా సంస్థలను సంప్రతించేవారని పోలీసు అధికారులు తెలిపారు. జూలైలో వెలుగుచూసిన రూ. 5,600 కోట్ల కుంభకోణానికి సంబంధించి పోలీసులు ఇప్పటిదాకా నలుగురిని అరెస్టు చేశారు.