న్యూఢిల్లీ: ఎన్‌ఎస్‌ఈఎల్ సంక్షోభం తన జీవిత కాలం పడ్డ కష్టాన్ని సర్వనాశనం చేసిందని ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా (ఎఫ్‌టీఐఎల్) చైర్‌పర్సన్ జిగ్నేష్ షా వ్యాఖ్యానించారు. ఆర్థిక నష్టంకన్నా కూడా తన విశ్వసనీయతను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రల వల్ల తాను, తన కుటుంబం తీవ్ర క్షోభకు గురయ్యామని ఆయన చెప్పారు. ఎంసీఎక్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా ఆయన రాజీనామా చేశారు. ఎన్‌ఎస్‌ఈఎల్, ఎంసీఎక్స్ సంస్థలకు ఎఫ్‌టీఐఎల్ మాతృ సంస్థ. రూ. 5,600 కోట్ల చెల్లింపులకు సంబంధించి నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈఎల్) వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) కొత్త ఎండీ, సీఈవో కోసం అన్వేషణ ప్రారంభించింది. కనీసం 20 ఏళ్ల అనుభవమున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఇప్పటికే ఆహ్వానించింది. ఈ నెల 19న ఎండీ శ్రీకాంత్ జవల్గేకర్ రాజీనామా చేసిన నేపథ్యంలో తాజా అన్వేషణ అనివార్యమైంది. ప్రస్తుతం డిప్యుటీ ఎండీ పర్వీన్ కుమార్ సింఘాల్ ఎంసీఎక్స్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.