ఎన్‌ఎస్‌ఈఎల్‌పై ఎఫ్‌ఐయూ దర్యాప్తు | NSEL fiasco: Probe indicates money laundering violations | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌ఈఎల్‌పై ఎఫ్‌ఐయూ దర్యాప్తు

Published Mon, Sep 30 2013 12:38 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM

ఎన్‌ఎస్‌ఈఎల్‌పై ఎఫ్‌ఐయూ దర్యాప్తు

ఎన్‌ఎస్‌ఈఎల్‌పై ఎఫ్‌ఐయూ దర్యాప్తు

న్యూఢిల్లీ: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్)పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఎఫ్‌ఐయూ) దర్యాప్తు మొదలైంది. దీనిలో భాగంగా ఈ కమోడిటీ ఎక్స్ఛేంజీలో లావాదేవీలు నిర్వహించిన ఇన్వెస్టర్లు, ప్రమోటర్లపై ఎఫ్‌ఐయూ దృష్టి పెట్టింది. ఎఫ్‌ఐయూ ఆర్థిక శాఖకింద పనిచేస్తుంది. ఈ కేంద్ర సంస్థ... ఎన్‌ఎస్‌ఈఎల్‌లో అవకతవకలకు కారణమైన లావాదేవీలు, అనుమానాస్పద నగదు బదిలీలు, నగదు ఉపసంహరణలు తదితరాలపై విచారణ నిర్వహించనుంది. ఇప్పటికే ఎన్‌ఎస్‌ఈఎల్ అంశంపై పరిశోధన చేపట్టిన పలు నియంత్రణ సంస్థలు ఆర్థిక లావాదేవీలలో అవకతవకలు జరిగినట్లు నిర్థారణకు వచ్చాయి. ఈ బాటలో ఎక్స్ఛేంజీలో లావాదేవీలు నిర్వహించే దాదాపు 25 మంది ఇన్వెస్టర్లపై ఆదాయపన్ను శాఖ సర్వేలు నిర్వహించింది. వీటికి అనుగుణంగానే ఆయా లావాదేవీలకు సంబంధించిన నగదు బదిలీ, నిధుల సమీకరణ తదితర వివరాలను రూపొందించాల్సిందిగా ఎఫ్‌ఐయూను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
 భారీ స్థాయిలో మనీ లాండరింగ్
 ఎన్‌ఎస్‌ఈఎల్ ద్వారా భారీ స్థాయి మనీలాండరింగ్ లావాదేవీలు జరిగినట్లు నియంత్రణ సంస్థలు అనుమానిస్తున్నాయి. సంక్షోభానికి కారణమైన రూ. 5,600 కోట్లకంటే బాగా అధిక స్థాయిలోనే మనీ లాండరింగ్ కార్యకలాపాలు జరిగినట్లు అంచనా వేస్తున్నాయి. ఈ విషయంలో మనీ లాండరింగ్ కార్యకలాపాలను గుర్తించే రక్షణాత్మక వ్యవస్థ విఫలమైనట్లు అనుమానిస్తున్నాయి. దీంతో భారీ స్థాయిలో మనీ లాండరింగ్ జరిగినట్లు అభిప్రాయపడ్డాయి. ఈ బాటలో కొన్ని వందల కోట్ల రూపాయలమేర అక్రమ లావాదేవీలు జరిగి ఉండవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిజానికి ఎన్‌ఎస్‌ఈఎల్ సెబీ పరిధిలోకి రానప్పటికీ బ్రోకర్లు, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ కార్యకలాపాలు, ఇన్‌సైడర్ ట్రేడింగ్, లిస్టింగ్ ఒప్పందాలు, అక్రమ లావాదేవీలు, స్టాక్ ఎక్స్ఛేంజీల ప్రమోటర్ నిబంధనలు వంటి అంశాలపై దర్యాప్తు చేస్తోంది. దీనిలో  భాగంగా ఎక్స్ఛేంజీకి చెందిన కొంతమంది ఉన్నతాధికారులు, బ్రోకర్లు, సంపన్న వర్గ క్లయింట్లపై  దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
 
 మరిన్ని సోదాలు అవసరం
 ఎన్‌ఎస్‌ఈఎల్ సంక్షోభంపై ఈ నెల మొదట్లో నివేదికలు రూపొందించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ),  ఆర్‌బీఐ నిర్దిష్ట కాలానికి ఎక్స్ఛేంజీలో జరిగిన ఆర్థిక వ్యవహారాల వివరాల కోసం మరింతగా శోధించాల్సి ఉందంటూ అభిప్రాయపడ్డాయి. ఇక మనీ లాండరింగ్ చట్టానికి అనుగుణంగా చర్యలను చేపట్టగల ఎఫ్‌ఐయూ ప్రస్తుతం ఇటు సీబీఐ, అటు కార్పొరేట్ వ్యవహారాల శాఖ చేపట్టిన దర్యాప్తులకు తగిన సహకారాన్ని అందించేందుకు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జిగ్నేష్ షాకు చెందిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ప్రమోట్ చేసిన ఎన్‌ఎస్‌ఈఎల్... వివిధ కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించి రూ. 5,600 కోట్లమేర చెల్లింపులను చేపట్టలేక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. జూలై 31 నుంచి ఎక్స్ఛేంజీ కార్యకలాపాలు మూతపడ్డాయి.
 
 నేటి ఎంసీఎక్స్ ఏజీఎంకు ఎదురుగాలి!
 మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్) వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) సోమవారం(30న) జరగనుంది. చెల్లింపుల సంక్షోభంతో విలవిల్లాడుతున్న ఎన్‌ఎస్‌ఈఎల్ సమస్య నేపథ్యంలో ఇన్వెస్టర్ల నుంచి భారీ విమర్శలు తప్పవని నిపుణులు అంటున్నారు. కొందరు ఇన్వెస్టర్లు నిరసనలను వ్యక్తం చేయనున్నట్లు తెలుస్తోంది. ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్‌టీ) ప్రమోట్ చేసిన ఎంసీఎక్స్‌లో ఎన్‌ఎస్‌ఈఎల్‌కు 26% వాటా ఉంది. కాగా, ఎన్‌ఎస్‌ఈఎల్ సంక్షోభం కారణంగా గతేడాది(2012-13)కి  ఎఫ్‌టీ ఆర్థిక ఫలితాలను ఆడిట్ చేసిన డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ తమ ఆడిట్ నివేదికను ఉపసంహరించుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement