
2015 నుంచి సానంద్‌లో కార్ల ఉత్పత్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గుజరాత్‌లోని సానంద్‌లో ఏర్పాటు చేస్తున్న ప్లాంటు ఈ ఏడాది ఆఖరు నాటికి అందుబాటులోకి రాగలదని, వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభం కాగలదని కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (తయారీ విభాగం) టామ్ చకలకల్ వెల్లడించారు. ఇది వచ్చాక ప్రస్తుతమున్న చెన్నై ప్లాంటుతో కూడా కలిపితే మొత్తం 4.40 లక్షల వాహనాల తయారీ సామర్ధ్యం లభించగలదని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇంజిన్ల ఉత్పత్తి సామర్ధ్యం కూడా 6.10 లక్షలకు చేరగలదని వివరించారు. రెండింటిపైనా చెరో బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేస్తున్నట్లు టామ్ పేర్కొన్నారు.
బుధవారం ఇక్కడ ఫార్చూన్ హార్మనీ గ్రూప్ డెరైక్టర్ నీరవ్ మోడి తదితరులతో కలిసి మూడు ఫోర్డ్ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్లు ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం మొత్తం 304 పైచిలుకు సెంటర్లు ఉండగా.. రాష్ట్రంలో 21 ఉన్నాయని టామ్ చెప్పారు. ప్రధానంగా.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కస్టమర్లకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అలాగే, చిన్న కార్లకు డిమాండ్ మరింత పెరగగనున్న నేపథ్యంలో వీటిపై మరింత దృష్టి పెట్టనున్నట్లు టామ్ తెలిపారు.
మరోవైపు, చెన్నై ప్లాంటు ఉత్పత్తిలో 40 శాతం వాహనాలను 35 పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని..త్వరలో దీన్ని 50కి పెంచుకోనున్నామని ఆయన తెలిపారు. బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకాల తగ్గింపు అనేది ఆటోమొబైల్ రంగానికి ఊతం ఇచ్చేదే అయినప్పటికీ.. ఇది స్వల్పకాలికమా లేదా దీర్ఘకాలికంగా ఉండనుందా అన్నది చూడాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే తమ కార్ల ధరలను తగ్గించే విషయంపై ఇంకా సమీక్షిస్తున్నామని టామ్ చెప్పారు.