విదేశీ కంపెనీలకు ‘మ్యాట్’ ఊరట!
భారత్‌లో శాశ్వత కేంద్రం లేని విదేశీ సంస్థలకు ప్రభుత్వం ఉపశమనం
- ఐటీ చట్ట సవరణకు నిర్ణయం
న్యూఢిల్లీ: భారత్‌లో శాశ్వత కేంద్రం లేని విదేశీ కంపెనీలకు ‘మ్యాట్’ (కనీస ప్రత్నామ్నాయ పన్ను) నుంచి ఊరట కల్పించే కీలక నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. ఈ మేరకు ఆదాయపు పన్ను (ఐటీ) చట్టం సవరించనున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో (గత కాలం నుంచీ వర్తించే విధంగా) ఈ చట్ట సవరణ చేయాలని నిర్ణయించినట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
దేశంలో విదేశీ సంస్థలు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా వ్యాపారాన్ని నిర్వహించుకునేందుకు తగిన వెసులుబాటు కల్పిస్తామని ప్రభుత్వం ఇస్తున్న హామీ నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. భారత్‌తో ద్వంద్వ పన్నుల నివారణా చట్టం (డీటీఏఏ) చేసుకున్న దేశమా? కాదా? అన్న అంశంతో సంబంధం లేకుండా విదేశీ కంపెనీలు అన్నింటికీ తాజా పన్ను వెసులుబాటును కల్పిస్తున్నట్లు ఆర్థికమంత్రిత్వశాఖ వెల్లడించింది. 2001 ఏప్రిల్ నుంచీ లాభాలపై ఆయా కంపెనీలు మ్యాట్ మినహాయింపు పొందుతాయి.