విదేశీ కరెన్సీ ఇంకా ఈజీ..! | Foreign currency still Easy | Sakshi
Sakshi News home page

విదేశీ కరెన్సీ ఇంకా ఈజీ..!

Published Sat, Jul 25 2015 12:40 AM | Last Updated on Wed, Aug 1 2018 4:13 PM

విదేశీ కరెన్సీ ఇంకా ఈజీ..! - Sakshi

విదేశీ కరెన్సీ ఇంకా ఈజీ..!

ఎఫ్‌ఎక్స్‌కార్ట్.కామ్‌తో ఆన్‌లైన్‌లో విదేశీ కరెన్సీ లావాదేవీలు
♦ డీలర్లకు- కస్టమర్లకు మధ్య ఆగ్రిగేషన్ సేవలు
♦ ఏడు నెలల్లో రూ.7 కోట్ల వ్యాపారం చేసిన సంస్థ
♦10 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణపై దృష్టి
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : గతంలో విమాన ప్రయాణమనేది బడా బాబులకే పరిమితం. కానీ ఇప్పుడో...! పెరిగిన వేతనాలు, అందుబాటులోకి వచ్చిన విమానయాన చార్జీలు, ప్రతి రూట్లోనూ సర్వీసులు... ఇవన్నీ కలసి విమానయానాన్ని అందరికీ చేరువ చేశాయి. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ... విదేశాలకు వెళ్లినప్పుడు ఎదురయ్యే ప్రధాన సమస్య అక్కడి కరెన్సీ!. ఇందుకోసం ఎవరైనా సరే కాసింత హోమ్ వర్క్ చేయాల్సిందే. ఎందుకంటే స్థానికంగా ఉన్న బ్యాంకుల తాలూకు ఫారెక్స్ బ్రాంచినో, లేనిపక్షంలో  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధ్రువీకరించిన ఫారెక్స్ డీలర్లనో సంప్రదించాలి.

పెపైచ్చు అందరి దగ్గరా ఒకేరకమైన మార్పిడి చార్జీలుండవు. ఉదాహరణకు డాలర్‌నే తీసుకుంటే కనీసం రూపాయి నుంచి ఆరేడు రూపాయల వరకూ వ్యత్యాసం ఉంటుంది. ఎవరి దగ్గర ఎంత రేటు ఉందన్నది తెలుసుకోవటం కూడా అంత సులభమేమీ కాదు. అందుకని ఈ చిక్కులన్నిటినీ పరిష్కరించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది ‘ఎఫ్‌ఎక్స్‌కార్ట్.కామ్’. అది కూడా ఉచితంగానే!! సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కోసం రెండేళ్లు తీవ్రంగా శ్రమించి... చివరికి 2015 జనవరిలో ఎఫ్‌ఎక్స్‌కార్ట్.కామ్ పేరుతో ఆన్‌లైన్‌లో ఫారెక్స్ ఎక్స్ఛ్‌ంజ్ ట్రేడింగ్ సంస్థను ఏర్పాటు చేశామన్నారు హదీ షేక్. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..

 అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ ప్రతి సెకనుకూ మారుతుంటుంది. కరెన్సీ మార్చుకోవాల్సి వచ్చినప్పుడు సాధారణంగా మన దగ్గర రెండు పద్ధతులున్నాయి. ఒకటి.. బ్యాంకుకెళ్లాలి. కానీ బ్యాంకులు ఎంత రేటుకు డాలర్‌ను ఇస్తున్నాయో చెప్పవు. మునుపటి రోజు డాలర్ రేటుకే ఇచ్చేస్తాయి. రెండోది.. ఫారెక్స్ డీలర్ల వద్దకెళ్లడం. ఇందుకోసం కస్టమర్లు ఫారెక్స్ డీలర్లకు ఫోన్లు చేస్తుంటారు. వారు ఈరోజు డాలర్ రేటింతని చెబుతారు. మళ్లీ మరో డీలర్‌కు ఫోన్ చేస్తారు కస్టమర్లు. అక్కడి రేటూ తెలుసుకుంటారు. అలా కొంతమంది డీలర్లను సంప్రదించి ఎవరోఒకరిని ఎంచుకుంటారు. ఇది చాలా వ్యయ, ప్రయాసలతో కూడుకున్న పని. అందుకని అందరు డీలర్లనూ ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి.. వారి రేట్లను కస్టమర్లకు ఒకేచోట ఇచ్చేస్తే.. కస్టమర్లకు కావాల్సిందేదో వాళ్లే ఎంచుకుంటారు కదా!. సమయం, డబ్బూ ఆదా అవుతాయి.

 55 మంది డీలర్లు.. 600 బ్రాంచీలు..
 ప్రస్తుతం ఎఫ్‌ఎక్స్‌కార్ట్.కామ్‌లో పాల్ మర్చంట్స్ లిమిటెడ్, సెంట్రమ్ డెరైక్ట్ లిమిటెడ్, ఓరియంట్ ఎక్స్ఛ్‌ంజ్, అక్బర్ ట్రావెల్స్, మ్యాట్రిక్స్ ఫారెక్స్ వంటి సుమారు 55 మంది ఫారెక్స్ డీలర్లు రిజిస్టర్ చేయించుకున్నారు. వీరు దేశవ్యాప్తంగా 600 బ్రాంచీలలో విస్తరించి ఉన్నారు. ఈ బ్రాంచీల్లో 20 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో ఉన్నాయి. 10-15 శాతం బ్రాంచీలు హైదరాబాద్‌లోనూ ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూరు, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, పుణే, అహ్మదాబాద్, సూరత్ నగరాల్లో ఎఫ్‌ఎక్స్‌కార్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

 ఏడు నెలల్లో రూ.7 కోట్లు..: బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎఫ్‌ఎక్స్‌కార్ట్.కామ్‌ను ప్రారంభించిన 7 నెలల్లో రూ.7 కోట్ల టర్నోవర్‌ను సాధించాం. నెలకు 30-40% వృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు 3 వేల కస్టమర్లకు 1,100 లావాదేవీలు పూర్తి చేశాం. రోజుకు 400లకు పైగా ఎంక్వయిరీలొస్తున్నాయి. దాదాపు 25 మంది కస్టమర్లకు లావాదేవీలు జరుపుతున్నారు. హైదరాబాద్‌లో గత నెలలోనే సేవలను ప్రారంభించాం.

 నిధుల సమీకరణపై దృష్టి..
 ఇప్పటికే దేశంలోని బడా పారిశ్రామిక వేత్తలు 5-10 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ముందుకొస్తున్నారు. కానీ, ఈ ఏడాది ముగింపు నాటికి డీల్స్‌ను క్లోజ్ చేసే యోచనలో ఉన్నాం. రూ.3 కోట్ల పెట్టుబడులతో ప్రారంభించిన ఎఫ్‌ఎక్స్‌కార్ట్.కామ్‌లో ఇటీవలే డాక్టర్ ముస్తాక్ షా, డాక్టర్ ఫరాజ్ నక్విలు 2 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టారు. వీటితో డీలర్ల నెట్‌వర్క్‌ను విస్తరించాం. ఐటీ సదుపాయాలను మెరుగు పరిచాం. ఈ ఏడాది ముగింపు నాటికి వందకుపైగా డీలర్లు, 2,000 బ్రాంచీలు, 6,000 కస్టమర్లతో రూ.35 కోట్లకు పైగా లావాదేవీలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
 
 కస్టమర్లకు ఉచితమే..
 ఎఫ్‌ఎక్స్‌కార్ట్ సేవలు కస్టమర్లకు పూర్తిగా ఉచితం. డీలర్ల నుంచి ప్రతి లావాదేవీలో కమీషన్ తీసుకుంటాం. 1,000 డాలర్ల కరెన్సీ మార్పిడికి రూ.100 చార్జీ చేస్తాం. వినియోగదారులు ఎక్కడి నుంచి ఎఫ్‌ఎక్స్‌కార్ట్.కామ్ సేవలను వినియోగిస్తున్నారో కూడా జియో-లొకేషన్ ద్వారా ట్రాక్ చేస్తాం. దీంతో వినియోగదారునికి దగ్గర్లో ఉన్న డీలర్ వివరాలొస్తాయి. దీంతో లావాదేవీలు త్వరగా చేసుకోవచ్చు. అంతేకాకుండా రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఫారెక్స్ వెండర్ డాలర్‌కు ఎంత రేటిస్తున్నాడో కూడా కస్టమర్‌కు మెసేజ్ రూపంలో వెళుతుంది. దీంతో కస్టమర్ తనకు నచ్చిన డీలర్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement