ముంబై : బుధవారం ట్రేడింగ్ లో దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 575.70 పాయింట్ల భారీ ర్యాలీతో 25,881వద్ద, నిఫ్టీ 186.05 పాయింట్ల లాభంతో 7,934వద్ద నమోదైంది. ఇన్ఫోసిస్, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్ ల జోరుతో దేశీయ సూచీలు లాభాలు పండించాయి. ఐటీ, రియాల్టీ, పవర్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్స్, ఆటో స్టాక్స్ సపోర్టుతో కీలకమైన మార్కు 7,900ను నిఫ్టీ అధిగమించింది. దేశీయ సూచీల్లో భారీ లాభాల్లో ముగియడానికి నాలుగు అంశాలు కీలకమైన పాత్ర పోషించాయి.
మంచి రుతుపవనాలు... ఆశాజనకమైన రుతుపవనాల అంచనాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో లాభాల ర్యాలీ కొనసాగించేలా దోహదంచేశాయి. రుతుపవనాల వర్షపాతం సగటున అంతకముందు అంచనా వేసిన 105శాతం కంటే ఎక్కువగా 109శాతం వరకూ ఉండొచ్చని స్కైమెట్ పేర్కొంది. ఆగస్టులో 113శాతం, సెప్టెంబర్ లో 123 శాతం వర్షపాతం మనం చూడబోతున్నామని రిపోర్టు నివేదించింది. దీంతో అంచనావేసిన దానికంటే ఎక్కువగానే వర్షపాతం ఉండొచ్చన్న అభిప్రాయంతో స్టాక్ మార్కెట్లో కన్సూమర్ గూడ్సుకు డిమాండ్ పెరిగింది. దేశ ఆర్థికవ్యవస్థలో 70శాతం జనాభా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే.
గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్.... గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ దేశీయ మార్కెట్లో లాభాలు పండించాయి. అమెరికా నుంచి వెలువడిన హోమ్ సేల్స్ డేటా, ఆ దేశ ఆర్థికవ్యవస్థ మెరుగుపడిందని తెలిపింది. దీంతో జూన్ లేదా జూలైలో ఫెడ్ రిజర్వు కచ్చితంగా వడ్డీరేట్లు పెంచుతాదనే సంకేతాలు వచ్చేశాయి. ఈ డేటాతో అమెరికా మార్కెట్ 1శాతం లాభంలో ముగిసింది. ఆర్థిక మందగమనం నుంచి అమెరికా బయటపడిందని తెలియడంతో, ప్రపంచమార్కెట్లు బలమైన ట్రెండ్ కొనసాగించాయి.
టెక్నికల్ లిప్ట్ ఆప్... వరుసగా నష్టాల్లో నమోదవుతున్న మార్కెట్లకి కొనుగోళ్ల మద్దతు లభించడంతో, ఓ మార్కు వద్ద నిఫ్టీ, సెన్సెక్స్ లు మళ్లీ పుంజుకున్నాయి. బేరిష్ సెంటిమెంట్ మందగించి, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో 7,940 మార్కుకు నిఫ్టీ చేరుకుంది. అంతేకాక 9,000 మార్కుకు నిఫ్టీ చేరుకుంటుందనే ఎనలిస్టుల సంకేతాలు కూడా నేటి మార్కెట్లలో సెంటిమెంట్ ను బలపరిచాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.
మోర్గాన్ స్టాన్లి అప్ గ్రేడ్స్....ప్రధానిగా మోదీ రెండేళ్ల పాలన ముగించుకొనడంపై మోర్గాన్ స్టాన్లి రిపోర్టు నివేదించింది. మార్కెట్లో అచ్చే దిన్ కొనసాగుతుందని, ఈక్వల్ వేయిట్ గా ఉన్న మార్కెట్లు ఓవర్ వేయిట్ లోకి అప్ గ్రేడ్ అయ్యాయని పేర్కొంది. దీంతో దేశీయ సూచీలు లాభాలను నమోదుచేశాయి. మరింత ధరల తగ్గుదల భయాందోళనలు ప్రస్తుతం లేవని, ధరలు అదుపులో ఉంటాయని, మొత్తంగా దేశంలో అప్పుల శాతం తగ్గిందని, సంస్కరణలతో ఉత్పత్తి పెరిగిందని మోర్గాన్ స్టాన్లీ ప్రకటించింది. మోర్గాన్ స్టాన్లి దేశ ఆర్థికవ్యవస్థపై ఇచ్చిన శుభసంకేతాలతో, ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ ను బలపర్చింది.