ఫార్చ్యూన్ ‘40 అండర్ 40’లో మనోళ్లు నలుగురు..
న్యూయార్క్: ఫార్చ్యూన్ బిజినెస్ మ్యాగజైన్ రూపొందించిన 40 అండర్ 40 జాబితాలో నలుగురు భారతీయులకు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 40 సంవత్సరాల లోపు వయస్సున్న 40 మంది అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన, ముఖ్యమైన వ్యక్తులతో ఫార్చ్యూన్ ఈ జాబితాను రూపొందించింది. స్నాప్‌డీల్ , మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకులతో పాటు హార్వార్డ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. హార్వార్డ్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ అయిన రాజ్ చెట్టి ఈ జాబితాలో 16 వ స్థానంలో ఉన్నారు. న్యూఢిల్లీలో జన్మించిన ఆ 35 ఏళ్ల రాజ్ చెట్టి 23 ఏళ్లకే హార్వార్డ్ యూనివర్శిటీలో పీ.హెచ్‌డీ చేశారు.
మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ 37 ఏళ్ల రాహుల్ శర్మ ఈ జాబితాలో 21వ స్థానంలో నిలిచారు. స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ 31 సంవత్సరాల వయస్సున్న కునాల్ బహాల్ 25వ ర్యాంక్‌ను సాధించారు, ట్విట్టర్‌కు న్యాయ సలహా దారు, ఆ కంపెనీ ఏకైక మహిళా ఎగ్జిక్యూటివ్ అయిన 39 సంవత్సరాల విజయ గద్దె 28వ స్థానంలో నిలి చారు. కాగా ఈ జాబితాలో రైడ్‌షేరింగ్ సర్వీస్ కంపెనీ యుబెర్ వ్యవస్థాపకుడు ట్రావిస్ కలానిక్, ఆతిథ్య రంగ కంపెనీ ఎయిర్‌బన్‌బ్స్ సీఈఓ బ్రియాన్ చెస్కీలు మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ నిలిచారు.