టాప్-100 మహిళల్లోనలుగురు భారతీయులు
♦ ప్రపంచ జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్
♦ అరుంధతీ భట్టాచార్యకు 25వ స్థానం
♦ చందా కొచర్, కిరణ్ షా, శోభనా భర్తియాకు చోటు
న్యూయార్క్: ప్రపంచంలోని తొలి వంద మంది శక్తిమంతమైన మహిళల్లో నలుగురు భారతీయ మహిళలు చోటు సంపాదించారు. ఫోర్బ్స్ తాజాగా రూపొందించిన ఈ జాబితాలో... స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య 25వ స్థానంలో నిలవటం విశేషం. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ 40వ స్థానంలోను... బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 77వ స్థానంలోను, హెచ్‌టీ మీడియా అధిపతి శోభనా భర్తియా 93వ స్థానంలోను నిలిచారు.
హిందుస్థాన్ టైమ్స్‌ను ప్రచురించే హెచ్‌టీ మీడియాకు శోభన చైర్‌పర్సన్, ఈడీగా వ్యవహరిస్తున్నారు. జాబితాలో మొట్టమొదటి స్థానంలో జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ ఉండగా ఆ తరువాతి రెండు స్థానాల్లో వరసగా అమెరికాకు చెందిన హిల్లరీ క్లింటన్, ఫెడరల్ రిజర్స్ చీఫ్ జానెట్ యెలెన్ నిలిచారు. ఈ జాబితాలో ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్‌బర్గ్ (7వ స్థానం), మిషెల్ ఒబామా (13), పెప్సికో సీఈవో ఇంద్రా నూయి (14) ఉన్నారు.