
న్యూఢిల్లీ: దీపావళి సీజన్ ‘ఇన్వెస్ట్‌మెంట్’ను ఆకర్షించడమే లక్ష్యంగా కేంద్రం సోమవారం తాజా సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (ఎస్‌జీబీ) ను ప్రకటించింది. బాండ్లకోసం తుది గడువు డిసెంబర్ 27. గ్రాము విలువను రూ.2956గా నిర్ణయించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్‌లైన్ దరఖాస్తుదారులకు రూ.50 రాయితీ లభిస్తుంది. బాండ్‌పై 2.5 శాతం వడ్డీ అమలవుతుంది. గ్రాము నుంచి వార్షికంగా 500 గ్రాముల వరకూ కొనుగోలు చేయవచ్చు.
ఈ ఏడాది జారీ అయిన మూడవ విడత గోల్డ్ బాండ్ స్కీమ్ ఇది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కొన్ని నిర్ధారిత పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో ఈ బాండ్ల అమ్మకం జరుగుతుందని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పసిడి భౌతిక వినియోగం తగ్గింపు ద్వారా పసిడి దిగుమతులను కట్టడి చేయడానికి తద్వారా కరెంట్ అకౌంట్ లోటును అదుపుచేయడానికి 2015 నవంబర్‌లో ప్రభుత్వం గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించింది. అప్పటినుంచీ 9 సార్లు బాండ్ల జారీ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment