యమ గిరాకీ ఉంది.. కానీ
భాగ్యనగరానిది వందల ఏళ్ల చరిత్ర. అయితే 400 ఏళ్ల క్రితం దీన్ని నిర్మించినపుడు 5 లక్షల జనాభాను మాత్రమే దృష్టిలో పెట్టుకున్నారు. వారికి కావాల్సిన అవసరాలనే కల్పించారు. కానీ ఇపుడది 17 రెట్లు పెరిగింది. జనాభా పరంగా మాత్రమే కాదు. విస్తీర్ణం పరంగానూ ఇలానే పెరిగింది. ఇప్పటికే హైదరాబాద్ అంటే.. ఇరుకు రోడ్లు, మురికివాడలు, చుక్కలు చూపించే ట్రాఫిక్, అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు... ఇదే చెబుతాం. అలాంటిది మరో ఏడేళ్ల తరవాత 2022లో భాగ్యనగరం ఎలా ఉంటుందో తలచుకుంటేనే భయమేస్తుంది!! దీనికి ప్రధాన కారణం యూరోపియన్ నగరాల మాదిరి ఇక్కడ పట్టణీకరణ ఒక క్రమపద్ధతిలో జరగక పోవటమేననేది నిపుణుల మాట. అందుకే 2022 నాటికి హైదరాబాద్ జనాభా, అప్పటి గృహ అవసరాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు వంటి అన్ని మౌలిక అవసరాలపై అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ జోన్స్ లాంగ్ లాసల్లె (జేఎల్‌ఎల్) ఎండీ సందీప్ పట్నాయక్ సమగ్రంగా నివేదించారు.
జనమే... జనం
హైదరాబాద్ జనాభా
2014వ సంవత్సరం: 86 లక్షలు; 2022వ సంవత్సరం: 1.05 కోట్లు జేఎల్‌ఎల్, యునెటైడ్ నేషన్స్ వరల్డ్ అర్బనైజేషన్-2014 లెక్కల ప్రకారం.. 1990లో 42 లక్షలుగా ఉన్న హైదరాబాద్ జనాభా 2014 నాటికి 86 లక్షలకు చేరింది. 2022 నాటికి 1.05 కోట్లకు, 2030 నాటికి 1.28 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అయితే అప్పటి జనాభా అవసరాలకు తగ్గట్టుగా మౌలిక వసతులు, గృహ అవసరాలు మాత్రం వృద్ధి చెందట్లేదు. జీహెచ్‌ఎంసీ అధికారికంగా నగరంలో 1,474 మురికివాడలను గుర్తించింది. వీటిల్లో సుమారు 25 లక్షల జనాభా నివసిస్తున్నారు. నగరంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వలస వస్తున్నారు. దీంతో దశాబ్ధ కాలంగా నగరంలో జనసాంద్రత గణనీయంగా పెరుగుతోంది. 2001లో చదరపు కిలోమీటరుకు 17,649గా ఉన్న హైదరాబాద్ జనసాంద్రత.. 2011 నాటికి 18,480కి చేరింది. రంగారెడ్డి జిల్లాలో చూస్తే 2001లో 477గా ఉండి 2011 నాటికి 707కు చేరిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.
నీడ కూడా కరువే...
హైదరాబాద్‌లో ఇళ్ల కొరత
2014వ సంవత్సరం: 19 లక్షలు; 2022వ సంవత్సరం: 23 లక్షలు
హైదరాబాద్‌లో ఇళ్ల కొరత తీవ్రంగా ఉంది. మొత్తం జనాభాలో ఉద్యోగస్తులు 45.5 శాతం కాగా వీరిలో సొంతిల్లున్న వారు 19 లక్షలే. మరోవైపు నగరంలో దాదాపు 1,474 మురికి వాడల్లో 25 లక్షల వరకూ జనాభా ఉన్నారు. వీరికి సొంతిల్లు సంగతి దేవుడెరుగు.. డ్రైనేజీ, తాగునీరు, మెరుగైన రవాణా వంటి కనీస వసతులూ కరువే. అగ్గిపెట్టెల్లాంటి అద్దె ఇళ్లే వారి ఆవాసాలు. సరైన పట్టణ ప్రణాళిక లేకపోవడమే వీటన్నిటికీ కారణమని జేఎల్‌ఎల్ నివేదిక తెలియజేసింది.
మాల్... కమాల్
షాపింగ్ మాళ్లు (విస్తీర్ణంలలో)
2014వ సంవత్సరం: 20 లక్షల చదరపుటడుగులు
2022వ సంవత్సరం: 80 లక్షల నుంచి కోటి చ.అ.
సిటీ జనానికి షాపింగ్ అంటే తగని వ్యామోహం. అందుకే ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నా ఇంకా కొత్తగా నిర్మించే మాల్స్ వైపు ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్, సిటీ సెంటర్, ఇన్నార్బిట్ మాల్, జీవీకే వన్, అశోకా మెట్రో పాలిటన్, బిగ్ బజార్, బాబూఖాన్ మాల్, షాపర్స్ స్టాప్, లైఫ్ స్టైల్, ఎంపీఎం మాల్, రిలయన్స్ మార్ట్, అమృతామాల్, ఫోరమ్ మాల్... ఇలా సుమారు వందకు పైగా పెద్ద మాల్స్ 20 లక్షల చ.అ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయని జేఎల్‌ఎల్ నివేదిక చెబుతోంది.
2022 నాటికి 80 లక్షల నుంచి కోటి చ.అ. విస్తీర్ణంలో షాపింగ్ మాల్ స్పేస్ అవసరం ఉంటుందని అంచనా వే సింది. ఇప్పటికే 50 లక్షల చ.అ. విస్తీర్ణంలో వివిధ కంపెనీల షాపింగ్ మాళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో కొన్నిటిని చూస్తే... విజ్ఞాన జ్యోతి విద్యా సంస్థలు, స్కిల్ ప్రమోటర్స్ సంయుక్తంగా కొండాపూర్‌లో శరత్స్ సిటీ క్యాపిటల్ పేరుతో మెగా షాపింగ్ మాల్‌ను నిర్మిస్తున్నాయి. ఇది 19 లక్షల చ.అ.ల్లో విస్తరించి ఉంటుంది. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ నగరంలో 6 షాపింగ్ మాళ్లను నిర్మిస్తోంది. ప్యాట్నీ సర్కిల్‌లో 6.5 లక్షల చ.అ.ల్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో 4.5 లక్షల చ.అ.ల్లో, ఇదే ప్రాంతంలో 3 లక్షల చ.అ.ల్లో జూబ్లిహిల్స్ రోడ్ నెంబరు 36లో లక్ష చ.అ.ల్లో, బేగంపేట రోడ్‌లో 60 వేల చ.అ.ల్లో, గచ్చిబౌలి చౌరస్తాలో ఈ మాళ్లు రానున్నాయి. ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్ మియాపూర్ మెయిన్‌రోడ్‌లో లక్షన్నర చ.అ.ల్లో షాపింగ్ విత్ కమర్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తోంది.
కార్యాలయాలకూ గిరాకీ...
హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ (విస్తీర్ణంలలో)
2014లో: 3.2 కోట్ల చ.అ.
2022 నాటికి: 6.3-6.5 కోట్ల చ.అ.
నగరంలో కార్యాలయ స్థలాలకు గిరాకీ క్రమంగా పెరుగుతోంది. స్థానిక రాజకీయాంశం, అంతర్జాతీయ ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్నాళ్లు తీవ్ర ఒడిదుడుకుల్లో పడినా... ఆరేడు నెలలుగా పరిస్థితి సానుకూలంగా మారిందనేది నిపుణుల మాట. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండుచోట్లా స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 3.2 కోట్ల చ.అ.ల్లో ఆఫీస్ స్పేస్ విస్తరించి ఉంది. 2022 నాటికి 6.3 నుంచి 6.5 కోట్ల చ.అ. మేర అవసరం ఉంటుందని జేఎల్‌ఎల్ నివేదిక పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో కార్యాలయాల స్థలం ఏటా 5 శాతం వృద్ధి రేటును కనబరుస్తోందని పేర్కొంది.
ఈ మధ్య కాలంలో ఐటీ సంస్థలే కాకుండా, ఐటీయేతర సంస్థలూ భాగ్యనగరాన్ని తమ కార్యకలాపాలకు కేంద్రంగా ఎంపిక చేసుకోవడానికి ముందుకొస్తున్నాయి. తక్కువగా ఉన్న అద్దెలు, ఇతర నగరాల కన్నా కాస్త మెరుగైన మౌలిక సదుపాయాల వల్ల హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ పెరుగుతోంది. ఓఆర్‌ఆర్, రేడియల్ రోడ్లు, మెట్రో రైల్ వల్ల పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధి పథంలో ముందుందని జేఎల్‌ఎల్ అభిప్రాయపడింది. హెల్త్‌కేర్, ఫార్మా, బయోటెక్ రంగాలకు చెందిన సంస్థలు నగరంలో స్థలాన్ని లీజుకు తీసుకున్న వాటిలో ఉన్నాయి. ఇవన్నీ కలిపి సుమారు 23 శాతం స్థలాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. నోవార్టిస్, సీలన్ ల్యాబ్స్, ఓసిమమ్ బయోటెక్, న్యూలాండ్ లాబ్స్ వంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
టోకున కావాలి... చిల్లర వ్యాపారాలకు
2022 నాటికి హైదరాబాద్‌లో 80 లక్షల చదరపుటడుగుల రిటైల్ స్పేస్ కావాలి. రాజకీయాంశంతో సంబంధం లేకుండా ప్రజల అవసరాల్ని తీరుస్తాయి కాబట్టే వీటికి గిరాకీ అధికమన్నది నిపుణుల మాట. డిమాండ్ ప్రభావంతో సిటీలోని ప్రధాన ప్రాంతాల్లోని పెద్ద వీధుల్లో దుకాణాల అద్దెలూ స్వల్పంగా పెరిగే అవకాశముంది. పలు దేశ, విదేశీ దుస్తులు, ఆహార పానీయాల సంస్థలు హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తున్నాయి.
టీఎంసీ, వుడ్‌ల్యాండ్స్, డామినోస్, బేకర్స్ ఇన్, సబ్‌వే వంటివి కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఇవి బంజారా హిల్స్, జూబ్లిహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో షోరూంలను ఏర్పాటు చేస్తున్నాయి. అద్దెలు అందుబాటులో ఉండటం, గిరాకీకి డోకా లేని ప్రాంతాలు కావడం, సరళీకృతమైన అద్దె నిబంధనల కారణంగా హబ్సిగూడ, చందానగర్ నుంచి మదీనాగూడ, ఎల్బీనగర్, దిల్‌సుఖ్ నగర్ వంటి ప్రాంతాల్లో రిటైల్ స్పేస్ విశేషంగా అభివృద్ధి చెందుతోంది. ఎల్బీ నగర్‌లో 5.5 లక్షల చ.అ.ల్లో ప్రజయ్ ఇంజనీర్స్ ప్రజయ్ ప్రిస్టన్ పేరతో భారీ షాపింగ్ మాల్, హోటల్‌ను నిర్మించింది. ఇందులో రిటైల్ కోసమే 1.30 లక్షల చ.అ. స్థలాన్ని కేటాయించింది.
పచ్చదనంతోనే రక్ష
2022 నాటికి హైదరాబాద్ పరిధిలో 12,600 హెక్టార్లలో పార్కులు అవసరం. అభివృద్ధితో పాటు ఆర్యోగం కూడా నగరవాసులకు అవసరమే. ఇందుకోసం పచ్చని ప్రకృతిలో జీవించడమే మార్గం. కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్‌లో ప్రస్తుతం అది అసాధ్యంగా మారింది. పర్యావరణ సమతూకం ఉండాలంటే 33 శాతం విస్తీర్ణంలో అడవులు అవసరం. మన రాష్ట్రంలో అది 21 శాతం ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దీని సగటు 9.5 శాతమే. అదీ రంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతలను కలుపుకుంటేనే. దాన్ని మినహాయిస్తే గ్రేటర్ హైదరాబాద్‌లో 2-3 శాతం మించదు.
జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 625 చ.కి.మీ. ఒకవైపు అపార్ట్‌మెంట్లు ఆకాశాన్ని తాకుతుంటే మరోవైపు మరుగుజ్జు మొక్కలే దిక్కవుతున్నాయి. సుందరీకరణ కోసం నాటే మొక్కలు తప్ప పక్షులకు ఆవాసంగా మారే భారీ వృక్షాలు లేవు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 142 హెక్టార్లలో, రంగారెడ్డిలో 70,295.87 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. 2022 నాటికి పెరిగే నగర జనాభాను దృష్టిలో పెట్టుకుంటే మరో 12,600 హెక్టార్లలో పార్కులు అవసరమని జేఎల్‌ఎల్ రిపోర్ట్ పేర్కొంది. నిజానికిపుడు నగరంలో విస్తరించి ఉన్న కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలే పర్యావరణానికి అడ్రస్‌గా మారాయి. నగరంలో ఎన్‌జీఆర్‌ఐ, సీసీఎంబీ, ఇక్రిశాట్, ఎన్‌ఐఎన్, డీఆర్‌డీఏ, నైపర్ వంటి సుమారు 30 వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలున్నాయి. వీటిలో చాలావరకు చెట్లు ఉండటం గమనార్హం.
స్కూళ్లు,ఆసుపత్రులు కూడా..
2022 నాటికి నగర జనాభా అవసరాల దృష్ట్యా ఇప్పుడున్న వాటి కంటే రెండింతల సంఖ్యలో పాఠశాలలు, ఆసుపత్రులు, ఆడిటోరియంలు అవసరముంటాయని జేఎల్‌ఎల్ పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం హైదరాబాద్‌లో రిజిస్టర్ చేసుకున్న ఆసుపత్రుల సంఖ్య 200 పైనే ఉండగా.. 2022 నాటికి సుమారు 1.09 కోట్ల చ.అ. బిల్టప్ ఏరియాలో మరో 9,100 ఆసుపత్రి పడకలు అవసరముంటాయని పేర్కొంది. అలాగే 5. కోట్ల చ.అ. బిల్టప్ ఏరియా విస్తీర్ణంలో మరో 3,838 పాఠశాలలు, 2.7 కోట్ల చ.అ. బిల్టప్ ఏరియాలో మరో 6 ఆడిటోరియంలు అవసరముంటాయని వివరించింది.