భారత్ లో ఇక ఆ కార్లను అమ్మరు!
భారత్ లో ఇక ఆ కార్లను అమ్మరు!
Published Thu, May 18 2017 2:15 PM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM
అమెరికన్ మల్టినేషనల్ కార్పొరేషన్ జనరల్ మోటార్స్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివరి నుంచి భారత్ లో జనరల్ మోటార్స్ కార్లను అమ్మకూడదని నిర్ణయించింది. ప్రపంచంలో అత్యంత పోటీతత్వ మార్కెట్లలో ఒకటైన భారత్ లో ఈ కంపెనీ ప్యాసెంజర్ కారు అమ్మకాలు ఒకశాతం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఇటు అమ్మకాలు పెంచుకోలేని జనరల్ మోటార్స్ భారత్ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించింది. పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ తెలిపింది. విక్రయాలు ఆపివేసినా.. దేశీయంగా తయారీ కొనసాగిస్తామని కంపెనీ పేర్కొంది. ఇక్కడ తయారీని పెంచి, ఇతర దేశాల్లో ఈ కార్లను విక్రయించనుంది.
భారత్ నుంచి ఎక్కువగా మెక్సికో, లాటిన్ అమెరికా దేశాలకు జనరల్ మోటార్స్ తన కార్లను ఎగుమతి చేస్తోంది. ఈ ఏడాది ఎగుమతులు రెట్టింపు చేయాలని జనరల్ మోటార్స్ నిర్దేశించుకుంది. కంపెనీకున్న టలేగావ్ ప్లాంట్ 130,000 వాహనాలను తయారుచేసే సామర్థ్యం కలిగి ఉంది. విక్రయాల నిలిపివేతతో భారత విక్రయ సంస్థ షెవ్రొలే ప్రైవేట్ లిమిటెడ్ ను కంపెనీ మూసివేయనుందని ఈ తయారీసంస్థ భారత అధినేత చెప్పారు. ఈ విషయంపై ఆయన ఇప్పటికే గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి చర్చలు కూడా జరిపినట్టు తెలిసింది. భారత్ లో విక్రయాలను నిలిపివేయాలని తాము తీసుకున్న నిర్ణయం జీఎం ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ప్రదర్శనను మరింత బలోపేతం చేసేందుకు ఓ కీలకమైన మైలురాయి వంటిదని జనరల్ మోటార్స్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మోటార్స్ ఇంటర్నేషనల్ అధినేత స్టీఫన్ జాకోబి తెలిపారు.
Advertisement
Advertisement