కోవిడ్-19 పేషంట్లకు వినియోగించేందుకు వీలుగా రెమ్‌డెసివిర్ ఔషధానికి యూరోపియన్ ఔషధ నియంత్రణ సంస్థ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. యూఎస్ దిగ్గజం గిలియడ్ సైన్సెస్స్ రూపొందించిన ఈ ప్రయోగాత్మక ఔషధాన్ని వ్యాధి తీవ్రతతో ఇబ్బందిపడుతున్న రోగులకు మాత్రమే వినియోగించేందుకు యూరోపియన్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఓకే చెప్పింది. తద్వారా కోవిడ్-19 చికిత్సకు యూరోపియన్ యూనియన్‌లో తొలిసారిగా ఔషధ వినియోగానికి అధికారిక ఆమోదం లభించినట్లయ్యిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికాలో కోవిడ్-19 బారినపడి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న పేషంట్లకు రెమ్‌డెసివిర్‌ను వినియోగించేందుకు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతించింది.
అత్యవసరమైతేనే
కోవిడ్-19 సోకడంతో న్యుమోనియో తలెత్తి ఆక్సిజన్ అవసరమైన పేషంట్లకు మాత్రమే రెమ్‌డెసివిర్ ఔషధాన్ని వినియోగించాలని ఈయూ రెగ్యులేటరీ స్ఫష్టం చేసింది. అదికూడా 12 ఏళ్ల వయసుపైబడిన వారికి మాత్రమే వినియోగించేందుకు పర్మిషన్ ఇచ్చింది. తద్వారా పలు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. కరోనా వైరస్ సోకి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు అత్యవసర ప్రాతిపదికన రెమ్‌డెసివిర్‌ను వినియోగించేందుకు గత నెలలో యూఎస్ ఔషధ నియంత్రణ సంస్థ సైతం అనుమతించిన విషయం విదితమే. ఆరోగ్యం క్షీణిస్తున్న పేషంట్లలో మాత్రమే ఈ ఔషధం ఫలితాలనిస్తున్నట్లు తొలి అధ్యయనాల్లో వెల్లడైనట్లు ఫార్మా వర్గాలు పేర్కొంటున్నాయి. తొలి దశ రోగుల్లో ప్రభావం అంతంతమాత్రమేనని వివరించాయి. ప్రస్తుతం ఈ ఔషధం క్లినికల్ పరీక్షలలో ఉన్నట్లు తెలియజేశాయి. దేశీయంగా రెమ్‌డెసివిర్ ఔషధానికి పలు ఫార్మా కంపెనీలు నాన్‌ఎక్స్‌క్లూజివ్ లైసెన్స్‌లను పొందాయి. జాబితాలో దేశీ ఫార్మా దిగ్గజాలు సిప్లా, హెటెరో ల్యాబ్స్, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ జైడస్ కేడిలా ఉన్నాయి. ఈ బాటలో ఇటీవల సుమారు 127 దేశాలలో ఈ ఔషధ మార్కెటింగ్ కోసం డాక్టర్ రెడ్డీస్ సైతం లైసెన్స్‌ను పొందింది.
Comments
Please login to add a commentAdd a comment