ఉద్దీపనలు కాదు... ఉపాధిపై దృష్టి!
♦ దేశాలకు ఐఎంఎఫ్ చీఫ్, జీ-20 ప్రముఖుల పిలుపు
♦ సంస్కరణాత్మక చొరవతోనే సవాళ్లను అధిగమించాలని సూచన
షాంఘై: మందగమనంలో ఉన్న వృద్ధికి ఊపునివ్వటానికి ఉద్దీపన చర్యలపై ఆధారపడ కుండా... ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టినా లగార్డ్, జీ-20 దేశాల అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్న సదస్సు పిలుపునిచ్చింది. వ్యవస్థాగత సంస్కరణలపై జరిగిన ఈ కీలక సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని... ప్రపంచ వృద్ధిపై కీలక సూచనలు చేశారు. సమావేశంలో క్రిస్టినా మాట్లాడుతూ, ఉపాధి కల్పనకు సంబంధించి 2014 జీ-20 సదస్సులో తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నియంత్రణల సరళీకరణ, వాణిజ్య వృద్ధి, సాంకేతిక రంగం పురోగతి వంటి దాదాపు 800 అంశాల అమలుపై అప్పట్లో ఒక ఉమ్మడి అంగీకారం కుదిరిందని పేర్కొన్న ఆమె... వాటిలో చాలా వరకూ ఇప్పటికీ అమలుకునోచుకోలేదని ఆందోళన వ్యక్తంచేశారు.
వృద్ధి అవకాశాలపై నీలినీడలు: ఓఈసీడీ
ప్రపంచ ఆర్థిక వృద్ధి అవకాశాలపై నీలినీడలు కొనసాగుతున్నాయని ఆర్థిక విశ్లేషణా సంస్థ- ఓఈసీడీ తాజా నివేదికలో పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం తమ సత్తాను కోల్పోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపింది. భారత్ విషయంలో వ్యవస్థాగత సంస్కరణలు ప్రస్తుతం వృద్ధికి కీలకమని తెలిపింది.