G -20 summit
-
G20 Summit: ‘కోణార్క్ చక్రం’ ప్రాధాన్యత ఇదే..
జీ20 సదస్సుకు వచ్చిన ప్రపంచ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రగతి మైదాన్ వేదికగా నూతనంగా నిర్మితమైన భారత్ మండపం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ ప్రపంచ నేతలందరితో కరచాలనం చేసి, వారిని ఘనంగా స్వాగతించారు. ఈ సమయంలో అందరి చూపు ఒడిశాలోని సూర్య దేవాలయంలో కనిపించే చక్రానికి ప్రతిరూపంగా వేదికపై ఏర్పాటు చేసిన నమూనాపై పడింది. ఇది వేదిక అందాన్ని రెండింతలు చేసింది. చరిత్రకారుల తెలిపిన వివరాల ప్రకారం కోణార్క్ చక్రం 13వ శతాబ్దంలో నిర్మితమయ్యింది. దీనిని రాజు నరసింహదేవ్-I పాలనలో నిర్మించారు. కోణార్క్ సూర్య దేవాలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగివుంది. ఈ సూర్య చక్రంలో 24 కమ్మీలు ఉంటాయి. ఈ చక్రం భారతదేశ జాతీయ జెండాలో కూడా కనిపిస్తుంది. ఈ చక్రం భారతదేశ పురాతన విజ్ఞానం, అధునాతన నాగరికత, నిర్మాణ నైపుణ్యానికి చిహ్నంగా నిలుస్తుంది. కోణార్క్ చక్రం పురోగతిని, నిరంతర మార్పును సూచిస్తుందని చెబుతారు. భారత రూపాయి నోట్లపై కూడా ఈ కోణార్క్ చక్రాన్ని మనం చూడచ్చు. ఒకప్పుడు 20 రూపాయల నోటుపై ఇది కనిపించింది. అలాగే ఆపై 10 రూపాయల నోటుపై కూడా దీనిని ముద్రించారు. కోణార్క్ ఆలయంలోని ఈ చక్రాన్ని ఆధారంగా చేసుకుని సమయాన్ని లెక్కిస్తారని చెబుతారు. చక్రం పరిమాణం 9 అడుగుల 9 అంగుళాలు ఉంటుంది. 12 జతల చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తాయని అంటారు. ఆలయంలోని 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయని చెబుతారు. కాగా ఈ ఏడాది ‘వన్ ఎర్త్’ థీమ్‌తో జీ20 సమ్మిట్ మొదటి సెషన్ ప్రారంభమైంది. జీ20 శిఖరాగ్ర సమావేశం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కీలక సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో జరుగుతుంది. ఇది కూడా చదవండి: బెర్లిన్‌లో గణేశుని ఆలయం.. దీపావళికి ప్రారంభం -
జీ20 సదస్సుకు జిన్‌పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్
బీజింగ్: భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మంకంగా నిర్వహిస్తోన్న జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడి స్థానంలో ఆ దేశ ప్రీమియర్ హాజరు కానున్నట్లు తెలిపింది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సదస్సుకు హాజరు కావడం లేదని మొదట రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించగా ఆయనను అనుసరిస్తూ చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ స్పోక్స్‌పర్సన్ మావో నింగ్ కీలక ప్రకటన చేశారు. మావో నింగ్ మాట్లాడుతో.. భారత్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న 18వ జీ20 సమావేశాలకు చైనా ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవుతారని అన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో రెండు దేశాల దౌత్యపరమైన సంబంధాల విషయమై ఏకాభిప్రాయాన్ని సాధించి అభివృద్ధికి దోహద పడతామని అన్నారు. రెండు దేశాల సంబంధాలకు చైనా ఎప్పుడూ అధిక ప్రాధాన్యతనిస్తూనే వచ్చిందని దీనికి సంబంధించి జరిగిన అనేక సమావేశాల్లో కూడా తాము చురుగ్గా పాల్గొన్నామని గుర్తు చేశారు. ముఖ్యంగా ఈ సమావేశాల్లో సమాఖ్య దేశాల ఐక్యతను బలోపేతం చేసి ప్రపంచ ఆర్ధికాభివృద్ధికి మిగతా దేశాలతో కలిసి పనిచేసే విషయమై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ చైనా అభిప్రాయాలను వెల్లడిస్తారని తెలిపారు మావో నింగ్. స్థిరమైన ప్రపంచ ఆర్ధిక పునరుద్ధరణ, సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించేందుకు మిగతా జీ20 భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని ఈ సమావేశాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఇది కూడా చదవండి: ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ కాంతిలో ఉల్కపాతం -
Arunachal Pradesh: మ్యాపులతో మడతపేచీ
నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించడమంటే ఇదే. భారత్‌తో స్నేహసంబంధాలకు కట్టుబడి ఉన్నట్టు తీయటి కబుర్లు చెప్పే చైనా తన వక్రబుద్ధిని మరోసారి వెల్లడించుకుంది. సోమవారం నాడు సరికొత్త అధికారిక ‘ప్రామాణిక పటం’– 2023 విడుదల చేస్తూ, అందులో భారత్‌లోని పలు ప్రాంతాల్ని తమ దేశంలో భాగమన్నట్టు చూపింది. భారత ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్‌లను తన భూభాగాలంటోంది. మొత్తం తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని కూడా ఈ కొత్త జాతీయ పటంలో తమ అంతర్భాగమనేందుకు చైనా తెగించింది. దాదాపు పొరుగు దేశాలన్నిటికీ కోపం తెప్పించడమే కాక, మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. పైపెచ్చు, అంతా సవ్యంగానే ఉన్నదన్నట్టు ‘‘జాతీయ సరిహద్దులను గీయడంలో చైనాతో పాటు వివిధ దేశాలు ఉపయోగించే పద్ధతి ఆధారంగా’’నే ఈ పటాన్ని రూపొందించినట్టు డ్రాగన్ ప్రకటించుకోవడం విచిత్రం. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ ఖండిస్తుంటే, బీజింగ్ మాత్రం మ్యాప్‌ల విడుదల నిత్య కృత్యమేననీ, దీనిపై అతి చేయద్దనీ విషయతీవ్రతను తక్కువ చేసి చెబుతుండడం మరీ విడ్డూరం. చెప్పేదొకటి చేసేదొకటి జిత్తులమారి చైనా నిత్యకృత్యం. అందుకే, ఈ వ్యవహారాన్ని భారత్ తీవ్రంగా తీసుకోక తప్పదు. వారం క్రితం జొహాన్నెస్‌బర్గ్‌లో ‘బ్రిక్స్’ సదస్సు జరిగినప్పుడు భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు సమావేశమై సంభాషించుకున్నారు. సరిహద్దుల వద్ద పరిస్థితిని చక్కదిద్ది, సత్సంబంధాలకు కృషి చేయాలని చర్చించుకున్నారు. మరోపక్క ఈ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే ‘జీ–20’ శిఖరాగ్ర సదస్సుకూ చైనా అధినేత హాజరు కావాల్సి ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఉరుము లేని పిడుగులా డ్రాగన్ దేశ సరిహద్దులు ఈ ‘వక్రీకరించిన’ పటంతో బాంబు పేల్చింది. గమనిస్తే మన ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెడుతూ, మునుపటి పటంలోనూ చైనా ఇదే తెంపరితనం చూపింది. ఆ దేశ పశ్చిమ హద్దుల్లో ఉన్న ప్రాంతాలను తనవిగా చెప్పుకొంది. అక్సాయ్‌చిన్ 1950–60ల నుంచి మన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో భాగం. 1962 యుద్ధంలో చైనా దాన్ని ఆక్రమించుకుంది. అరుణాచల్నేమో దశాబ్దాలుగా తమ దక్షిణ టిబెట్లోది అంటోంది. ఆ రెండూ భారత అంతర్భాగాలని మన ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా, తన మూర్ఖవాదన కొనసాగిస్తోంది. పటంలోని అంశాలు అంతర్జాతీయ అంగీకృత సరిహద్దులను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌ను ‘జంగ్నాన్’ (దక్షిణ టిబెట్) అని పిలుస్తూ, అది తమదేననడం బీజింగ్ సిగ్గు మాలినతనం. చరిత్ర చూస్తే టిబెట్‌కూ, బ్రిటీషు ఇండియాకు మధ్య 1914లో సిమ్లా సమావేశం జరిగింది. అప్పుడే సరిహద్దుగా మెక్‌మోహన్ రేఖను అంగీకరించాయి. చైనా చేస్తున్న ప్రకటనలు, చూపుతున్న పటం ఆ అంగీకరించిన సరిహద్దు రేఖ చట్టబద్ధతను ఉల్లంఘించడమే! అలాగే, ద్వీప దేశమైన తైవాన్ ఏడాదిపైగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా, పట్టువదలని బీజింగ్ ‘వన్ చైనా విధానం’ అంటూ దాన్ని తమ పటంలో చూపడం దురహంకారం. ఇక, పసిఫిక్, హిందూ మహాసముద్రాలకు ప్రధాన నౌకాయాన అనుసంధానమైన దక్షిణ చైనా సముద్ర ప్రాంతం సైనిక, వాణిజ్యపరంగా అతి కీలకం. వివాదాస్పద ద్వీపాలతో సహా ఈ ప్రాంతమంతా చైనా తమ పటంలో కలిపేసుకుంటోంది. ఈ ప్రాంతంలో డ్రాగన్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరిని ఫిలిప్పీన్స్, వియత్నామ్, మలేసియా, జపాన్ తదితర దేశాలు పదే పదే ఎత్తిచూపుతున్నాయి. అయినా అది తన తీరు మార్చుకోలేదు. భౌతికంగా తన అధీనంలో లేకున్నా ఈ ప్రాంతాలు తనవేననడం చిరకాలంగా చైనా చూపుతున్న మొండివైఖరే. తాజా పటం జారీ వల్ల దానికి కొత్తగా కలిసొచ్చేదేమీ లేదు. పైగా, మిగతా ప్రపంచపు సహాయం, సానుభూతి కూడా దక్కవు. అయినా సరే, డ్రాగన్ తన దురహంకారాన్ని చాటుకోవడం గమనార్హం. ఒక్కమాటలో చైనా అధినేత షీ జిన్‌పింగ్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరికి ఈ కొత్త మ్యాప్ ప్రతీక. అధికారిక జాతీయ పటాల జారీ చైనాలో దాదాపు ఏటా జరిగే తంతు అయినా... భారత్ వరకు తీసుకుంటే చంద్రయాన్–3 విజయం, రానున్న జీ–20 సదస్సు నేపథ్యంలో ఇప్పుడీ పటాన్ని ఎందుకు విడుదల చేసినట్టు? ఇరుదేశాల మధ్య ఇలాంటి సరిహద్దు వివాదాలే గతంలోనూ సైనిక ప్రతిష్టంభనకు దారితీశాయి. 2017లో తలెత్తిన డోక్లామ్ సంక్షోభం, 2020లో గల్వాన్ లోయలో సైనిక ఘర్షణలే తాజా ఉదాహరణలు. దీంతో దౌత్య సంబంధాలూ దెబ్బతింటున్నాయి. బలగాల్ని వెనక్కి పిలిచి, ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించుకోవాల్సిన వేళ ఇలాంటి తప్పుడు పటం సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ఏ రకంగానూ దోహదపడదు. ఇప్పటికే లద్దాఖ్‌లోని కొంత భాగాన్ని చైనా ఆక్రమించేసుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. వివిధ విదేశీ సర్వేలు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు సైతం భారత సరిహద్దులో చైనా వివాదాస్పద నిర్మాణాల్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అనుమానాలు పోగొట్టేలా మన పాలకులు వాస్తవాలను వెల్లడించాలి. నమ్మడానికి వీల్లేని పొరుగుదేశంతో నిక్కచ్చిగానే వ్యవహరించాలి. సార్వభౌమాధికారం, సమగ్రతల్లో రాజీ లేదని మాటల్లో కన్నా చేతల్లో చూపాలి. జీ–20 అధ్యక్షతతో విశ్వగురువులయ్యామని సంబరపడేకన్నా, అంతర్గత ఘర్షణలున్న అన్ని పక్షాలనూ అర్థవంతమైన సమగ్ర చర్చలతో ఒక తాటిపైకి తేవడమే అసలు విజయమని గ్రహించాలి. చైనాతో సంభాషణకు అన్ని మార్గాల్నీ అన్వేషిస్తూనే, మనకున్న ఆందోళనల్ని కుండబద్దలు కొట్టాలి. అవకాశాన్ని బట్టి అందుకు రానున్న జీ–20ను సైతం వేదికగా చేసుకోవాలి. దౌత్య, వాణిజ్య సంబంధాల మెరుగు దలకు సరిహద్దుల్లో సామరస్య వాతావరణం కీలకమని మరోసారి అందరికీ తలకెక్కేలా చూడాలి. -
మాటలు సరే! చేతల మాటేమిటి?
ప్రపంచంలోని 20 భారీ ఆర్థిక వ్యవస్థలు... అంతా కలిపితే అంతర్జాతీయ వాణిజ్యంలో 75 నుంచి 80 శాతం ఉన్న దేశాలు... ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల జనాభాకూ, ప్రపంచ భూభాగంలో దాదాపు సగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాల అధినేతలు ఒక్కచోట కలిస్తే? ప్రపంచ పరిణామాలు, పర్యావరణ, వాణిజ్య సమస్యలపై రెండు రోజులు చర్చిస్తే? ఐరోపా సమాజం, మరో 19 దేశాల అంతర్ ప్రభుత్వవేదికగా ఏర్పాటైన ‘జి–20’ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు ప్రాధాన్యం అందుకే! ఇటలీ రాజధాని రోమ్‌లో అక్టోబర్ చివర 2 రోజులు జరిగిన ఈ సదస్సులో గత రెండేళ్ళలో తొలిసారిగా దేశాధినేతలు వ్యక్తిగతంగా కలిశారు. మరి, ఈ సదస్సు ఆశించిన ఫలితాలు అందించిందా అంటే అవుననలేం. భూతాప పెరుగుదలను 1.5 డిగ్రీల లోగానే నియంత్రిస్తామంటూ నేతలు లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. కానీ, కర్బన తటస్థతను సాధించేందుకు కచ్చితమైన తుది గడువు పెట్టనే లేదు. కేవలం ఉద్గారాల్ని తగ్గిస్తే చాలదని తెలిసినా, కార్యాచరణ శూన్యం. అందుకే, ‘ప్రజలు, ప్రపంచం, సౌభాగ్యం’ ఇతివృత్తంగా సాగిన ఈ సదస్సుతో కొంత ఆశ, ఎంతో నిరాశ మిగిలాయి. 2015 నాటి ప్యారిస్ వాతావరణ ఒప్పందానికి తగ్గట్టు దీర్ఘకాలిక పర్యావరణ లక్ష్యాలను పెట్టుకోవాలనీ, శుద్ధమైన విద్యుత్ జనకాలకు త్వరితగతిన మారాలనీ సదస్సుకు ఆతిథ్యమిచ్చిన ఇటలీ ప్రధాని పేర్కొన్నారు. కానీ, ప్రపంచంలో మూడింట రెండు వంతులకు పైగా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు కారణమైన ఈ 20 దేశాల గ్రూపు స్పష్టమైన తుది గడువుతో ముందుకు రాలేదు. కోవిడ్‌పై పోరు, ఆరోగ్య వసతుల మెరుగుదల, ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడం లాంటి వివిధ అంశాలపై ప్రపంచ నేతలు చర్చించారు. కానీ, రష్యా, చైనాలు తమ ప్రతినిధుల్ని ఈ సదస్సుకు పంపనే లేదు. వివిధ కారణాలతో మెక్సికో, జపాన్, దక్షిణాఫ్రికా నేతలు హాజరు కానే లేదు. వర్ధమాన దేశాలు పర్యావరణహిత ఇంధన లక్ష్యాన్ని చేరుకొనేలా ఏటా 100 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 7.49 లక్షల కోట్లు) సాయం అందించడానికి కట్టుబడి ఉన్నట్టు ‘జి–20’ ప్రకటించింది. కానీ, బొగ్గుతో నడిచే విద్యుత్కేంద్రాలకు అంతర్జాతీయ ఆర్థిక సాయం ఆపేస్తామన్న నేతలు తమ దేశంలో అలాంటి విద్యుదుత్పత్తికి ఎప్పుడు స్వస్తి పలుకుతారో మాట ఇవ్వనే లేదు. ప్రపంచ నేతలు ఎంతసేపటికీ బరువైన మాటలతో గారడీ చేస్తున్నారన్నది గ్రేటా థన్‌బెర్గ్ లాంటి పలువురు పర్యావరణ ఉద్యమకారుల వాదన. ‘జి–20’ సదస్సులో అధినేతల తుది ప్రకటన సైతం వారి వాదనకు తగ్గట్టే ఉంది. అదే విచారకరం. సదస్సు ముగింపు వేళ... పర్యావరణ సంక్షోభంలో తరచూ విస్మరణకు గురయ్యే మూడు మౌలిక అంశాలను గుర్తు చేస్తూ ఉద్యమకారులు థన్‌బెర్గ్, వానెస్సా నకాటే బహిరంగ లేఖ రాశారు. పర్యావరణ సంక్షోభంపై జాగు చేయడానికి లేదన్నారు. ఏ పరిష్కారమైనా సరే పర్యావరణ మార్పు వల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొంటున్న వారికి న్యాయం చేసేదిగా ఉండాలన్నారు. అత్యంత భారీగా కాలుష్యం చేస్తున్నవారు తమ ఉద్గారాలపై అసంపూర్ణమైన గణాంకాలు చెప్పి, తప్పించుకుంటున్నారని ఆరోపించడం గమనార్హం. ఈ 16వ ‘జి–20’ సదస్సుకు హాజరైన భారత ప్రధాని మోదీ విడిగా పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు, సింగపూర్ ప్రధాని సహా పలువురితో సమావేశమయ్యారు. వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లోని హరిత ప్రాజెక్టులకు అభివృద్ధి చెందిన దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తిలో కనీసం ఒక శాతం ఆర్థిక సాయం అందించడం లక్ష్యంగా పెట్టుకోవాలని మోదీ పేర్కొన్నారు. చైనా వ్యతిరేకించడంతో ఆగిన న్యూక్లియర్ సప్లయిర్స్ గ్రూప్ సభ్యత్వాన్ని భారత్‌కు ఇవ్వాలనీ, అలాగే అవసరమైన సాంకేతికతను అందించాలనీ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను భారత్ చేరుకోవడం వాటితో ముడిపడి ఉందనీ వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తేల్చేశారు. భారత్ అలా తన వాదన వినిపించడం బాగానే ఉంది. సదస్సు ఫలవంతమైందన్న మోదీ మాటలను ఆ మేరకే అర్థం చేసుకోవాలేమో! ఎందుకంటే, పర్యావరణ అంశాలపై పెట్టుకున్న అనేక ఆశలను ‘జి–20’ సదస్సు నెరవేర్చనేలేదని సాక్షాత్తూ ఐరాస ప్రధాన కార్యదర్శే అనేశారు. వెనువెంటనే గ్లాస్గోలో జరుగుతున్న ‘కాప్–26’ సదస్సులోనైనా మెరుగైన ఫలితాలు వస్తాయన్నదే ఇక మిగిలిన ఆశ. ఈ ఏడాది చివరికే జనాభాలో 40 శాతానికి కోవిడ్ టీకాల లాంటి మాటలైతే ‘జి–20’ దేశాధినేతలు అన్నారు. ధనిక, బీద దేశాల మధ్య టీకాల అందుబాటులో తేడాలను తగ్గించే వ్యూహం లేదు. ప్రస్తుతం ప్రపంచం ముంగిట ఉన్న పర్యావరణ అత్యవసర పరిస్థితి పరిష్కారంలోనూ అదే ధోరణి. రోమ్ నుంచి నేరుగా గ్లాస్గోలో ‘కాప్–26’కు వారు హాజరవుతున్నారు. అక్కడ 100కు పైగా దేశాల నేతలతో రెండు రోజులు చర్చలు... గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించే బృహత్ ప్రణాళికపై రెండు వారాల పాటు అధికారుల మల్లగుల్లాలు. కానీ, పర్యావరణ సంక్షోభంపై విజయం సాధించాలంటే ప్రగాఢమైన వాంఛ, మరింత పకడ్బందీ కార్యాచరణ అవసరం. వివిధ దేశాధినేతల సమష్టి రాజకీయ సంకల్పంతోనే అది సాధ్యం. అందుకు ప్రధాన భాగస్వామ్యదేశాల మధ్య నమ్మకం కీలకం. కానీ, ప్రపంచంలో అత్యధిక స్థాయిలో కర్బన ఉద్గారాలకు కారణమైన చైనా పక్షాన అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ‘కాప్–26’కు హాజరవడం లేదు. లిఖితపూర్వక ప్రకటనతోనే సరిపెడుతున్నారు. ఇలాంటివి ఎన్నో. అందుకే, నిన్నటి ‘జి–20’ లానే, నేటి ‘కాప్–26’లోనూ అద్భుతమైన ఫలితాలు ఆశించడం కష్టమే. సదస్సులన్నీ అరుదైన ఫోటో సందర్భాలుగానే మిగిలితే, అసలు సమస్యలు తీరేదెలా? -
తెలంగాణ వనితకు అరుదైన అవకాశం
హైదరాబాద్: ప్రపంచ దేశాలన్నీ సభ్యులుగా ఉన్న కూటమి అది. ఈ కూటమి నిర్వహించిన సదస్సులో హైదరాబాద్‌కు చెందిన తెలుగుతేజం షర్మిలా సిసుధాన్ ప్రసంగించారు. భారత్ నుంచి ఇటువంటి అద్భుతమైన అవకాశం అందుకున్న ఒకే ఒక మహిళ కావటం గమనార్హం. జపాన్‌లో ఇటీవల జరిగిన జీ–20 సమ్మిట్ షర్మిల...‘‘ప్రపంచ సుస్ఠిరాభివృద్ధి – లక్ష్యాలు – ఆహారోత్పత్తి , వినియోగం ’’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. షర్మిల స్వస్థలం హైదరాబాద్‌లోని మణికొండ. తండ్రి సుధాకర్‌రావు వైద్యుడు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో పోషక విలువలపై షర్మిల గతంలో అధ్యయనం చేశారు. బెంగుళూరులోని ఐటీసీ హోటల్లో పనిచేశారు. ఢిల్లీలోని రాయ్ విశ్వవిద్యాలయంలో హాస్పిటాలిటీ అండ్ టూరిజం కాలేజ్ అధ్యాపకురాలిగా చేరి, తర్వాత అదే కాలేజ్ డీన్ స్థాయికి ఎదిగారు. గురుగ్రామ్ క్యాంపస్‌కు అసోసియేషన్ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. ఇదిలాఉంచితే వరల్డ్ ఇటాలజీ ఫోరంను జపాన్‌కు చెందిన గంగ్విలివ్ అనే వ్యక్తి ప్రారంభించాడు. ఆహార ప్రమాణాలే ప్రాతిపదికగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ ఫోరంను యూఎన్ సస్టెయినబుల్ కౌన్సిల్లో భాగం చేశారు. ఈ ఐరాస కౌన్సిల్ ద్వారానే జీ–20 సదస్సులో పాల్గొనే అవకాశం షర్మిలకు దక్కింది. దీంతో ఆమె పేరు మార్మోగిపోతోంది. -
పాకిస్తాన్ వల్లే అశాంతి
♦ మరోసారి దాయాదిపై విరుచుకుపడ్డ మోదీ ♦ శాంతికి భంగం కలిగిస్తున్నారని తూర్పు ఆసియా దేశాల సదస్సులో వ్యాఖ్య వియంతైన్: జీ-20 సదస్సులో పాక్‌పై పరోక్షంగా నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ.. తూర్పు ఆసియా సదస్సులోనూ అదే విమర్శల జడిని కొనసాగించారు. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న పాక్‌పై అంతర్జాతీయ సమాజం ఆంక్షలు విధించాలని మోదీ కోరారు. ‘మా పొరుగున ఓ దేశం ఉంది. వారికి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటం, పక్కదేశాలకు ఎగుమతి చేయటమే తెలుసు’ అని అన్నారు. పాక్ కారణంగా ప్రపంచంలో అశాంతి పెరిగిపోతోందన్నారు. అంతకుముందు 14వ ఆసియాన్-భారత సదస్సులోనూ ఉగ్రవాదం కేంద్రంగానే ప్రధాని ప్రసంగించారు. పాకిస్తాన్ వల్ల మొత్తం ఆసియా భద్రతకే ముప్పు ఏర్పడిందన్నారు. ఆసియాన్ దేశాలన్ని అభివృద్ధి, వాణిజ్యంతోపాటు వివిధ రంగాల్లోనూ పరస్పర సహకారంతో ముందుకెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ ద్వారా.. తూర్పు ఆసియా ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు పెంపొందేలా ప్రయత్నిస్తోందన్నారు. అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందానికి తూర్పు ఆసియా సదస్సు అంగీకరించగా.. దీనికి భారత్ కూడా సిద్ధమేనన్నారు. ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా దేశాల సదస్సుల్లోనూ ప్రాంతీయ స్థిరత్వం, పరస్పర సహకారం అందించుకోవాలన్నారు. లీ, సూచీతో వేర్వేరుగా మోదీ భేటీ తూర్పు ఆసియా దేశాల సదస్సు సందర్భంగా మోదీ.. చైనా ప్రధాని కెకియాంగ్‌తో భేటీ అయ్యారు. రాజకీయ సమస్యలను కారణంగా చూపి ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా వ్యవహరించకూడదని.. వ్యూహాత్మక ఆసక్తులకు అనుగుణంగా భారత్-చైనా కలిసి ముందుకెళ్లాలన్నారు. పీఓకేలో చైనా ఆర్థిక సాయంతో నిర్మిస్తున్న చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్‌పై చర్చించారు. మయన్మార్ ప్రజాస్వామ్య నేత ఆంగ్‌సాన్ సూచీతోనూ భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య సానుకూల ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు. మయన్మార్‌లో శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆమె వివరించారు. మయన్మార్‌కు అన్ని విధాలా సాయం అందించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధమేనని భరోసా ఇచ్చారు. సదస్సులను ముగించుకుని మోదీ భారత్ చేరుకున్నారు. భారత్‌కు సాయానికి ముందుంటాం వియంతైన్: భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా తూర్పు ఆసియా దేశాల సదస్సు తర్వాత ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత్-అమెరికా దేశాల తక్షణ ప్రాధాన్యతలు, వ్యూహాత్మ ద్వైపాక్షిక భాగస్వామ్యంపై వీరు చర్చించారు. పౌర అణు సహకారం, వాతావరణ మార్పులపై పోరాటంపైనా మాట్లాడుకున్నారు. భారత్‌లో ఆర్థిక సంస్కరణల కోసం మోదీ చేస్తున్న ప్రయత్నాలను ఒబామా ప్రశంసించారు. జీఎస్టీ అమల్లోకి వస్తే.. ఆర్థిక వ్యవస్థపై క్రియాశీల ప్రభావం ఉంటుందన్నారు. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. అమెరికా ఎప్పటికీ భారత్‌కు మిత్రదేశమేనని.. బలమైన భాగస్వామిగా భారత్‌కు ఏ సహాయమైనా చేసేందుకు సిద్ధమన్నారు. అణు శక్తి రంగంలో భారత-అమెరికా భాగస్వామ్యం పురోగతిపై సమీక్ష చేశారు. ఇరుదేశాల బంధాలు బలపడటంలో ఒబామా తీసుకుంటున్న చొరవను మోదీ ప్రశంసించారు. మరోసారి భారత పర్యటనకు రావాలని ఒబామాను ఆహ్వానించారు. గత పర్యటనలో తాజ్‌మహల్ పర్యటను రద్దుచేసుకున్నందున.. మరోసారి భారత్‌కు వస్తానని ఒబామా తెలిపారు. -
ఉద్దీపనలు కాదు... ఉపాధిపై దృష్టి!
♦ దేశాలకు ఐఎంఎఫ్ చీఫ్, జీ-20 ప్రముఖుల పిలుపు ♦ సంస్కరణాత్మక చొరవతోనే సవాళ్లను అధిగమించాలని సూచన షాంఘై: మందగమనంలో ఉన్న వృద్ధికి ఊపునివ్వటానికి ఉద్దీపన చర్యలపై ఆధారపడ కుండా... ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టినా లగార్డ్, జీ-20 దేశాల అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్న సదస్సు పిలుపునిచ్చింది. వ్యవస్థాగత సంస్కరణలపై జరిగిన ఈ కీలక సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని... ప్రపంచ వృద్ధిపై కీలక సూచనలు చేశారు. సమావేశంలో క్రిస్టినా మాట్లాడుతూ, ఉపాధి కల్పనకు సంబంధించి 2014 జీ-20 సదస్సులో తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నియంత్రణల సరళీకరణ, వాణిజ్య వృద్ధి, సాంకేతిక రంగం పురోగతి వంటి దాదాపు 800 అంశాల అమలుపై అప్పట్లో ఒక ఉమ్మడి అంగీకారం కుదిరిందని పేర్కొన్న ఆమె... వాటిలో చాలా వరకూ ఇప్పటికీ అమలుకునోచుకోలేదని ఆందోళన వ్యక్తంచేశారు. వృద్ధి అవకాశాలపై నీలినీడలు: ఓఈసీడీ ప్రపంచ ఆర్థిక వృద్ధి అవకాశాలపై నీలినీడలు కొనసాగుతున్నాయని ఆర్థిక విశ్లేషణా సంస్థ- ఓఈసీడీ తాజా నివేదికలో పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం తమ సత్తాను కోల్పోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపింది. భారత్ విషయంలో వ్యవస్థాగత సంస్కరణలు ప్రస్తుతం వృద్ధికి కీలకమని తెలిపింది. -
జీ-20 సదస్సు తీర్మానాలు
ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 85 శాతం వాటా.. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం వాటా.. ప్రపంచ జనాభాలో 2/3 వంతు వాటా కలిగిన జీ-20 దేశాధినేతల పదో వార్షిక సమావేశం నవంబరు 15, 16 తేదీల్లో టర్కీలోని ఆంటల్యాలో జరిగింది. గతేడాది డిసెంబరు 1న, జీ-20 అధ్యక్ష స్థానాన్ని అధికారికంగా టర్కీ కైవసం చేసుకుంది. 2016లో జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షత వహిస్తుంది. ఆంటల్యా సమావేశంలో 26 దేశాలకు చెందిన 13 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. టర్కీ ప్రాధాన్యతలైన సమ్మిళితం పెట్టుబడి, అమలు వంటి అంశాలతోపాటు సుస్థిర అభివృద్ధి, వాతావరణ అంశాలపై జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు చర్చించింది. సుస్థిర అభివృద్ధికి సంబంధించి 2030 అజెండా, అడిస్ అబాబా కార్యాచరణ అజెండా అమలుకు తాము కట్టుబడి ఉన్నట్లు జీ-20 దేశాధినేతలు ప్రకటించారు. అభివృద్ధిలో సభ్యదేశాలు పాల్పంచుకుంటూ, చర్చలు కొనసాగించటానికి ‘జీ-20, అల్పాదాయ అభివృద్ధి చెందుతున్న దేశాల విధివిధాన ప్రక్రియ’ను సదస్సు రూపొందించింది. సుస్థిర అభివృద్ధికి సంబంధించి 2030 అజెండాను అమలు చేసేందుకు జీ-20 దేశాలు అవలంబించాల్సిన విధానాలు రూపొందించటానికి 2016లో కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని సదస్సులో దేశాధినేతలు తెలిపారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదు వాతావరణానికి సంబంధించి భూతాపం పెరుగుదలను రెండు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పరిమితం చేసేందుకు కట్టుబడి ఉన్నామని జీ-20 నాయకులు ప్రకటించారు. శక్తి సామర్థ్యం పెంపు, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలో పెట్టుబడుల పెంపు, వాతావరణ మార్పులు, వాటి ప్రభావాలను తట్టుకునేందుకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు మద్దతును సదస్సు గుర్తించింది. వృథా వినియోగాన్ని ప్రోత్సహించే అసమర్థ శిలాజ ఇంధనాల సబ్సిడీలను తొలగించేందుకు కట్టుబడి ఉన్నట్లు దేశాధినేతలు తెలిపారు. అవినీతిని, ఉగ్రవాదాన్ని సహించబోమని, విధానపరమైన సాధనాలన్నింటినీ వినియోగించటం ద్వారా అసమానతలతో కూడిన ఆర్థిక వృద్ధిని నిర్మూలించటానికి తాము ప్రయత్నిస్తామని జీ-20 దేశాలు ప్రతిజ్ఞ చేశాయి.సదస్సుకు సంబంధించి జీ-20 దేశాధినేతల సంయుక్త ప్రకటన విడుదలకు ముందు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా మీడియాతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీలను తొలగించేందుకు భారత్ కృషిచేసిందని, అయితే ఎరువులు, విద్యుత్ వంటివి రాజకీయంగా సున్నితమైన అంశాలని పేర్కొన్నారు. సదస్సు తీర్మానాలు ఈ ఏడాది అక్టోబరు 10న అంకారాలో, నవంబరు 13న పారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడులను సమావేశం ఖండించింది. ఉగ్రవాద దాడిలో మరణించిన కుటుంబాలకు సమావేశం ప్రగాఢ సంతాపాన్ని ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందించే అన్ని సంస్థలపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించటంతోపాటు ఆస్తుల జప్తు లాంటి చర్యలు అవసరం. సంయుక్త కార్యాచరణ ద్వారా ప్రపంచానికి సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి. సంబంధిత ఆర్థిక కార్యాచరణ ప్రణాళిక సభ్యుల సిఫార్సులు, సాధనాలను అమలుచేయటాన్ని కొనసాగిస్తామని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో అంతర్జాతీయ సహకార ఆవశ్యకతను తెలిపింది. ఉగ్రవాదంపై అంతర్జాతీయ ఒప్పందాలను, భద్రతా మండలి తీర్మానాలను పూర్తిస్థాయిలో అమలుచేస్తామని, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటాన్ని నిలువరించాల్సిందేనని తీర్మానించారు. శరణార్థుల సంక్షోభాన్ని నివారించే చర్యలో భాగంగా అంతర్జాతీయ కృషిలో భాగస్వాములవ్వాలని అన్ని దేశాలను సదస్సు ఆహ్వానించింది. ఆయా దేశాల్లో వ్యక్తులను, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించటం ద్వారా శరణార్థుల సంక్షోభ నివారణకు తగిన సహకారాన్ని అందించాలి. శరణార్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రభావిత దేశాలకు తమ సామర్థ్యానికి అనుగుణంగా తగిన ఆర్థిక సహకారం అందించాలి. శరణార్థుల సమస్యను పరిష్కరించటంలో రాజకీయ జోక్యానికి ప్రాధాన్యమివ్వాలి. ఆర్థిక ప్రపంచీకరణ, స్థిరత్వ సాధనకు తగిన చర్యలు చేపడతామని సదస్సులో తీర్మానించారు. సూక్ష్మ-ఆర్థిక విధానాలను సహకార ధోరణిలో చేపట్టి, సుస్థిర, సంతులన అభివృద్ధి సాధించటానికి ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిని మరో 2 శాతం పెంచటానికి తమ వంతు కృషి అందించగలమని, సమర్థ, బహుళ, దేశీయ వాణిజ్య వ్యవస్థ తీసుకురావటానికి కట్టుబడినట్లుగా తీర్మానించారు. ఆర్థిక రంగాల వృద్ధి, ఉపాధి కల్పన, సమ్మిళిత విధానాల కోసం ఉమ్మడి యత్నాలను తీవ్రతరం చేస్తామని సదస్సులో తీర్మానించారు. ఆహార భద్రత, సుస్థిర ఆహార వ్యవస్థలపై కార్యాచరణ ప్రణాళికకు కట్టుబడి ఉన్నట్లు తీర్మానించారు. పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా పన్ను ఎగవేత నిరోధానికి కృషిచేయటంతోపాటు 2017 లేదా 2018 నాటికి పన్ను సమాచార మార్పిడి వ్యవస్థను సిద్ధం చేస్తామని సదస్సులో దేశాధినేతలు తీర్మానించారు. సమర్థత లేని శిలాజ ఇంధనాలపై రాయితీలను ఎత్తివేయటానికి కట్టుబడి ఉన్నామని తెలుపుతూ, పేదలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నామని సదస్సులో తీర్మానించారు. బాన్ కీ-మూన్ నాలుగు మిలియన్ల సిరియన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించిన టర్కీ, జోర్డాన్, లెబనాన్‌ను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ-మూన్ ప్రశంసించారు. ఇతర దేశాలు కూడా శరణార్థులకు తగిన మద్దతు ఇవ్వాల్సిందిగా జీ-20 దేశాధినేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అవసరంలో ఉన్న ప్రజలకు సహాయపడాలని కోరారు. జీ-20 సదస్సులో ప్రసంగిస్తూ పారిస్‌లో వాతావరణ మార్పులపై జరిగే కాప్-21వ సదస్సు విజయవంతం కావటమనేది నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తక్కువ కర్బన ఉద్గారాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మార్కెట్‌కు తగిన సంకేతాలను సదస్సు అందించాలి.అభివృద్ధి చెందిన దేశాల నాయకత్వ పాత్రకు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెరుగుతున్న బాధ్యతల మధ్య సంతులనం సాధించటం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులను ఒప్పందంలో పొందుపరచాలి. అభివృద్ధి చెందిన దేశాలు 2020 వరకు, వాతావరణ తీవ్రత తగ్గించేందుకు, అనువర్తనాల అమలు కోసం సంవత్సరానికి 100 బిలియన్ డాలర్ల చొప్పున అందించగలమన్న ప్రతిజ్ఞను నిలబెట్టుకోవాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సమీక్ష జరగాలి. 2020 కంటే ముందుగానే మొదటి సమీక్ష నిర్వహించాలి. టెక్నాలజీతో ఉగ్రవాదంపై పోరు: నరేంద్ర మోదీ సదస్సులో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక విషయాలపై మాట్లాడారు. అందులో ముఖ్యంగా.. సైబర్ భద్రతకు దేశాల మధ్య సహకారం పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని మోదీ వివరించారు. సామాజిక మాధ్యమాలను వినియోగించి, వారిని నివారించగలమని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఉగ్రవాదమని, సంఘర్షణ ప్రాంతాల నుంచి దూరదేశాల్లోని వీధుల వరకు ఉగ్రవాదం విస్తరించి ప్రాణాంతకంగా పరిణమించిందని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మద్దతునివ్వటంతోపాటు ప్రయోజనం పొందుతున్న వారిని సమాజం నుంచి వేరుచేయాల్సిన ఆవశ్యకతను వ్యక్తం చేశారు. కొన్ని దేశాలు జాతీయ అధికార విధాన సాధనంగా ఉగ్రవాదాన్ని వినియోగించుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాద ముప్పు అధికంగా ఉన్న దేశాల్లో ఉగ్రవాదం వైపు యువత ఆకర్షితులు కాకుండా ఉండాలంటే సామాజిక ఉద్యమం రావాలని సూచించారు.ఉగ్రవాదులకు ఆయుధాలు, డబ్బు చేరకుండా నివారించే క్రమంలో దేశాల మధ్య సహకారాన్ని పటిష్టపరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై ప్రపంచమంతా సమష్టిగా పోరాడాలని, మతం నుంచి దీన్ని వేరుచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ న్యాయ విధివిధానాలను పునర్వ్యవస్థీకరించుకొని, ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో శరణార్థుల సమస్య సవాలుగా పరిణమించటంతో దీర్ఘకాల వ్యూహరచన చేయాలని, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో శాంతి, సుస్థిరత నెలకొల్పితే శరణార్థుల సంక్షోభాన్ని పరిష్కరించుకోవచ్చని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో తయారీ, ఆకర్షణీయ నగరాల పథకాలలో భాగం పంచుకోవాలని టర్కీ, స్పెయిన్‌లను మోదీ కోరారు. ఇటీవల 15 కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సడలించినందువల్ల భారత్‌లో వ్యాపారానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. వీటిని వినియోగించుకొని ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవాలని టర్కీ, స్పెయిన్లకు మోదీ సూచించారు. వ్యవసాయ, అంతరిక్ష, పౌర అణు ఇంధనం వంటి రంగాల్లో సహకారంపై టర్కీ అధ్యక్షుడితో మోదీ చర్చించారు.రైల్వే వ్యవస్థ విస్తరణలో, వేగవంతమైన రైళ్లను నడపటంలో స్పెయిన్ సహకారాన్ని కోరారు. దేశంలో నల్లధనం నిర్మూలించేందుకు నూతన చట్టాన్ని భారత్ తీసుకురానుందని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారత్‌కు తిరిగి తీసుకు వచ్చే క్రమంలో తమకు సహకరించాలని జీ-20 దేశాలను మోదీ కోరారు.బ్యాంకింగ్ చట్టాల్లో గోప్యత పరంగా ఎదురవుతున్న సమస్యను పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన తెలిపారు. సైబర్ పరిజ్ఞానాన్ని వినియోగించుకొని భారీ పెట్టుబడుల విషయంలో ఎదురవుతున్న అవరోధాలను అధిగమించాలి. పన్ను సమాచారంపై ఉమ్మడి ప్రమాణాలు రూపొందించుకోవాలని మోదీ ప్రతిపాదించారు. మతనాయకులు, మేధావులు, విధాన నిర్ణేతలను తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే సామాజిక ఉద్యమంలో భాగస్వాములుగా చేయాలని పిలుపునిచ్చారు.మానవత్వానికి సవాలుగా పరిణమించిన పశ్చిమాసియా సంక్షోభంపై ప్రపంచం దృష్టిసారించాలి. ఈ అంశానికి సంబంధించి దోహా డెవలప్మెంట్ రౌండ్ తన లక్ష్యాలను సాధించాలని మోదీ పేర్కొన్నారు. భారత ప్యాకేజీలోని అన్ని అంశాలను పూర్తిగా అమలు పరచాలి. 2022 నాటికి భారత్ 175 గిగావాట్ల అదనపు పునరుత్పాదక శక్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుందని, 2030 నాటికి శక్తిలో పునరుత్పాదక శక్తి వాటా 40 శాతం లక్ష్యాన్ని పెట్టుకుందని ఆయన తెలిపారు. జీ-20 సభ్యదేశాలు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండొనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, అమెరికా, యూకే, ఐరోపా యూనియన్.