జీ-20 సదస్సు తీర్మానాలు
ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 85 శాతం వాటా.. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం వాటా.. ప్రపంచ జనాభాలో 2/3 వంతు వాటా కలిగిన జీ-20 దేశాధినేతల పదో వార్షిక సమావేశం నవంబరు 15, 16 తేదీల్లో టర్కీలోని ఆంటల్యాలో జరిగింది. గతేడాది డిసెంబరు 1న, జీ-20 అధ్యక్ష స్థానాన్ని అధికారికంగా టర్కీ కైవసం చేసుకుంది. 2016లో జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షత వహిస్తుంది. ఆంటల్యా సమావేశంలో 26 దేశాలకు చెందిన 13 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
టర్కీ ప్రాధాన్యతలైన సమ్మిళితం పెట్టుబడి, అమలు వంటి అంశాలతోపాటు సుస్థిర అభివృద్ధి, వాతావరణ అంశాలపై జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు చర్చించింది. సుస్థిర అభివృద్ధికి సంబంధించి 2030 అజెండా, అడిస్ అబాబా కార్యాచరణ అజెండా అమలుకు తాము కట్టుబడి ఉన్నట్లు జీ-20 దేశాధినేతలు ప్రకటించారు. అభివృద్ధిలో సభ్యదేశాలు పాల్పంచుకుంటూ, చర్చలు కొనసాగించటానికి ‘జీ-20, అల్పాదాయ అభివృద్ధి చెందుతున్న దేశాల విధివిధాన ప్రక్రియ’ను సదస్సు రూపొందించింది. సుస్థిర అభివృద్ధికి సంబంధించి 2030 అజెండాను అమలు చేసేందుకు జీ-20 దేశాలు అవలంబించాల్సిన విధానాలు రూపొందించటానికి 2016లో కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని సదస్సులో దేశాధినేతలు తెలిపారు.
ఉగ్రవాదాన్ని సహించేది లేదు
వాతావరణానికి సంబంధించి భూతాపం పెరుగుదలను రెండు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పరిమితం చేసేందుకు కట్టుబడి ఉన్నామని జీ-20 నాయకులు ప్రకటించారు. శక్తి సామర్థ్యం పెంపు, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలో పెట్టుబడుల పెంపు, వాతావరణ మార్పులు, వాటి ప్రభావాలను తట్టుకునేందుకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు మద్దతును సదస్సు గుర్తించింది. వృథా వినియోగాన్ని ప్రోత్సహించే అసమర్థ శిలాజ ఇంధనాల సబ్సిడీలను తొలగించేందుకు కట్టుబడి ఉన్నట్లు దేశాధినేతలు తెలిపారు.
అవినీతిని, ఉగ్రవాదాన్ని సహించబోమని, విధానపరమైన సాధనాలన్నింటినీ వినియోగించటం ద్వారా అసమానతలతో కూడిన ఆర్థిక వృద్ధిని నిర్మూలించటానికి తాము ప్రయత్నిస్తామని జీ-20 దేశాలు ప్రతిజ్ఞ చేశాయి.సదస్సుకు సంబంధించి జీ-20 దేశాధినేతల సంయుక్త ప్రకటన విడుదలకు ముందు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా మీడియాతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీలను తొలగించేందుకు భారత్ కృషిచేసిందని, అయితే ఎరువులు, విద్యుత్ వంటివి రాజకీయంగా సున్నితమైన అంశాలని పేర్కొన్నారు.
సదస్సు తీర్మానాలు
ఈ ఏడాది అక్టోబరు 10న అంకారాలో, నవంబరు 13న పారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడులను సమావేశం ఖండించింది. ఉగ్రవాద దాడిలో మరణించిన కుటుంబాలకు సమావేశం ప్రగాఢ సంతాపాన్ని ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందించే అన్ని సంస్థలపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించటంతోపాటు ఆస్తుల జప్తు లాంటి చర్యలు అవసరం. సంయుక్త కార్యాచరణ ద్వారా ప్రపంచానికి సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి. సంబంధిత ఆర్థిక కార్యాచరణ ప్రణాళిక సభ్యుల సిఫార్సులు, సాధనాలను అమలుచేయటాన్ని కొనసాగిస్తామని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో అంతర్జాతీయ సహకార ఆవశ్యకతను తెలిపింది. ఉగ్రవాదంపై అంతర్జాతీయ ఒప్పందాలను, భద్రతా మండలి తీర్మానాలను పూర్తిస్థాయిలో అమలుచేస్తామని, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటాన్ని నిలువరించాల్సిందేనని తీర్మానించారు.
శరణార్థుల సంక్షోభాన్ని నివారించే చర్యలో భాగంగా అంతర్జాతీయ కృషిలో భాగస్వాములవ్వాలని అన్ని దేశాలను సదస్సు ఆహ్వానించింది. ఆయా దేశాల్లో వ్యక్తులను, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించటం ద్వారా శరణార్థుల సంక్షోభ నివారణకు తగిన సహకారాన్ని అందించాలి. శరణార్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రభావిత దేశాలకు తమ సామర్థ్యానికి అనుగుణంగా తగిన ఆర్థిక సహకారం అందించాలి. శరణార్థుల సమస్యను పరిష్కరించటంలో రాజకీయ జోక్యానికి ప్రాధాన్యమివ్వాలి.
ఆర్థిక ప్రపంచీకరణ, స్థిరత్వ సాధనకు తగిన చర్యలు చేపడతామని సదస్సులో తీర్మానించారు. సూక్ష్మ-ఆర్థిక విధానాలను సహకార ధోరణిలో చేపట్టి, సుస్థిర, సంతులన అభివృద్ధి సాధించటానికి ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిని మరో 2 శాతం పెంచటానికి తమ వంతు కృషి అందించగలమని, సమర్థ, బహుళ, దేశీయ వాణిజ్య వ్యవస్థ తీసుకురావటానికి కట్టుబడినట్లుగా తీర్మానించారు. ఆర్థిక రంగాల వృద్ధి, ఉపాధి కల్పన, సమ్మిళిత విధానాల కోసం ఉమ్మడి యత్నాలను తీవ్రతరం చేస్తామని సదస్సులో తీర్మానించారు. ఆహార భద్రత, సుస్థిర ఆహార వ్యవస్థలపై కార్యాచరణ ప్రణాళికకు కట్టుబడి ఉన్నట్లు తీర్మానించారు.
పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా పన్ను ఎగవేత నిరోధానికి కృషిచేయటంతోపాటు 2017 లేదా 2018 నాటికి పన్ను సమాచార మార్పిడి వ్యవస్థను సిద్ధం చేస్తామని సదస్సులో దేశాధినేతలు తీర్మానించారు. సమర్థత లేని శిలాజ ఇంధనాలపై రాయితీలను ఎత్తివేయటానికి కట్టుబడి ఉన్నామని తెలుపుతూ, పేదలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నామని సదస్సులో తీర్మానించారు.
బాన్ కీ-మూన్
నాలుగు మిలియన్ల సిరియన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించిన టర్కీ, జోర్డాన్, లెబనాన్‌ను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ-మూన్ ప్రశంసించారు. ఇతర దేశాలు కూడా శరణార్థులకు తగిన మద్దతు ఇవ్వాల్సిందిగా జీ-20 దేశాధినేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అవసరంలో ఉన్న ప్రజలకు సహాయపడాలని కోరారు. జీ-20 సదస్సులో ప్రసంగిస్తూ పారిస్‌లో వాతావరణ మార్పులపై జరిగే కాప్-21వ సదస్సు విజయవంతం కావటమనేది నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తక్కువ కర్బన ఉద్గారాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మార్కెట్‌కు తగిన సంకేతాలను సదస్సు అందించాలి.అభివృద్ధి చెందిన దేశాల నాయకత్వ పాత్రకు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెరుగుతున్న బాధ్యతల మధ్య సంతులనం సాధించటం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులను ఒప్పందంలో పొందుపరచాలి. అభివృద్ధి చెందిన దేశాలు 2020 వరకు, వాతావరణ తీవ్రత తగ్గించేందుకు, అనువర్తనాల అమలు కోసం సంవత్సరానికి 100 బిలియన్ డాలర్ల చొప్పున అందించగలమన్న ప్రతిజ్ఞను నిలబెట్టుకోవాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సమీక్ష జరగాలి. 2020 కంటే ముందుగానే మొదటి సమీక్ష నిర్వహించాలి.
టెక్నాలజీతో ఉగ్రవాదంపై పోరు: నరేంద్ర మోదీ
సదస్సులో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక విషయాలపై మాట్లాడారు. అందులో ముఖ్యంగా..
సైబర్ భద్రతకు దేశాల మధ్య సహకారం పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని మోదీ వివరించారు. సామాజిక మాధ్యమాలను వినియోగించి, వారిని నివారించగలమని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఉగ్రవాదమని, సంఘర్షణ ప్రాంతాల నుంచి దూరదేశాల్లోని వీధుల వరకు ఉగ్రవాదం విస్తరించి ప్రాణాంతకంగా పరిణమించిందని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మద్దతునివ్వటంతోపాటు ప్రయోజనం పొందుతున్న వారిని సమాజం నుంచి వేరుచేయాల్సిన ఆవశ్యకతను వ్యక్తం చేశారు.
కొన్ని దేశాలు జాతీయ అధికార విధాన సాధనంగా ఉగ్రవాదాన్ని వినియోగించుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాద ముప్పు అధికంగా ఉన్న దేశాల్లో ఉగ్రవాదం వైపు యువత ఆకర్షితులు కాకుండా ఉండాలంటే సామాజిక ఉద్యమం రావాలని సూచించారు.ఉగ్రవాదులకు ఆయుధాలు, డబ్బు చేరకుండా నివారించే క్రమంలో దేశాల మధ్య సహకారాన్ని పటిష్టపరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై ప్రపంచమంతా సమష్టిగా పోరాడాలని, మతం నుంచి దీన్ని వేరుచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ న్యాయ విధివిధానాలను పునర్‌వ్యవస్థీకరించుకొని, ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో శరణార్థుల సమస్య సవాలుగా పరిణమించటంతో దీర్ఘకాల వ్యూహరచన చేయాలని, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో శాంతి, సుస్థిరత నెలకొల్పితే శరణార్థుల సంక్షోభాన్ని పరిష్కరించుకోవచ్చని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో తయారీ, ఆకర్షణీయ నగరాల పథకాలలో భాగం పంచుకోవాలని టర్కీ, స్పెయిన్‌లను మోదీ కోరారు.
ఇటీవల 15 కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సడలించినందువల్ల భారత్‌లో వ్యాపారానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. వీటిని వినియోగించుకొని ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవాలని టర్కీ, స్పెయిన్‌లకు మోదీ సూచించారు.
వ్యవసాయ, అంతరిక్ష, పౌర అణు ఇంధనం వంటి రంగాల్లో సహకారంపై టర్కీ అధ్యక్షుడితో మోదీ చర్చించారు.రైల్వే వ్యవస్థ విస్తరణలో, వేగవంతమైన రైళ్లను నడపటంలో స్పెయిన్ సహకారాన్ని కోరారు. దేశంలో నల్లధనం నిర్మూలించేందుకు నూతన చట్టాన్ని భారత్ తీసుకురానుందని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారత్‌కు తిరిగి తీసుకు వచ్చే క్రమంలో తమకు సహకరించాలని జీ-20 దేశాలను మోదీ కోరారు.బ్యాంకింగ్ చట్టాల్లో గోప్యత పరంగా ఎదురవుతున్న సమస్యను పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన తెలిపారు. సైబర్ పరిజ్ఞానాన్ని వినియోగించుకొని భారీ పెట్టుబడుల విషయంలో ఎదురవుతున్న అవరోధాలను అధిగమించాలి.
పన్ను సమాచారంపై ఉమ్మడి ప్రమాణాలు రూపొందించుకోవాలని మోదీ ప్రతిపాదించారు.
మతనాయకులు, మేధావులు, విధాన నిర్ణేతలను తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే సామాజిక ఉద్యమంలో భాగస్వాములుగా చేయాలని పిలుపునిచ్చారు.మానవత్వానికి సవాలుగా పరిణమించిన పశ్చిమాసియా సంక్షోభంపై ప్రపంచం దృష్టిసారించాలి. ఈ అంశానికి సంబంధించి దోహా డెవలప్‌మెంట్ రౌండ్ తన లక్ష్యాలను సాధించాలని మోదీ పేర్కొన్నారు. భారత ప్యాకేజీలోని అన్ని అంశాలను పూర్తిగా అమలు పరచాలి. 2022 నాటికి భారత్ 175 గిగావాట్ల అదనపు పునరుత్పాదక శక్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుందని, 2030 నాటికి శక్తిలో పునరుత్పాదక శక్తి వాటా 40 శాతం లక్ష్యాన్ని పెట్టుకుందని ఆయన తెలిపారు.
జీ-20 సభ్యదేశాలు
అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండొనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, అమెరికా, యూకే, ఐరోపా యూనియన్.