సదస్సులో గ్రూప్ ఫొటో సందర్భంగా స్టేజీ ఎక్కుతున్న మయన్మార్ విదేశాంగ మంత్రి ఆంగ్ సాన్ సూచీకి సాయం చేస్తున్న ప్రధాని మోదీ
♦ మరోసారి దాయాదిపై విరుచుకుపడ్డ మోదీ
♦ శాంతికి భంగం కలిగిస్తున్నారని తూర్పు ఆసియా దేశాల సదస్సులో వ్యాఖ్య
వియంతైన్: జీ-20 సదస్సులో పాక్‌పై పరోక్షంగా నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ.. తూర్పు ఆసియా సదస్సులోనూ అదే విమర్శల జడిని కొనసాగించారు. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న పాక్‌పై అంతర్జాతీయ సమాజం ఆంక్షలు విధించాలని మోదీ కోరారు. ‘మా పొరుగున ఓ దేశం ఉంది. వారికి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటం, పక్కదేశాలకు ఎగుమతి చేయటమే తెలుసు’ అని అన్నారు. పాక్ కారణంగా ప్రపంచంలో అశాంతి పెరిగిపోతోందన్నారు. అంతకుముందు 14వ ఆసియాన్-భారత సదస్సులోనూ ఉగ్రవాదం కేంద్రంగానే ప్రధాని ప్రసంగించారు. పాకిస్తాన్ వల్ల మొత్తం ఆసియా భద్రతకే ముప్పు ఏర్పడిందన్నారు.
ఆసియాన్ దేశాలన్ని అభివృద్ధి, వాణిజ్యంతోపాటు వివిధ రంగాల్లోనూ పరస్పర సహకారంతో ముందుకెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ ద్వారా.. తూర్పు ఆసియా ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు పెంపొందేలా ప్రయత్నిస్తోందన్నారు. అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందానికి తూర్పు ఆసియా సదస్సు అంగీకరించగా.. దీనికి భారత్ కూడా సిద్ధమేనన్నారు. ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా దేశాల సదస్సుల్లోనూ ప్రాంతీయ స్థిరత్వం, పరస్పర సహకారం అందించుకోవాలన్నారు.
లీ, సూచీతో వేర్వేరుగా మోదీ భేటీ
తూర్పు ఆసియా దేశాల సదస్సు సందర్భంగా మోదీ.. చైనా ప్రధాని కెకియాంగ్‌తో భేటీ అయ్యారు. రాజకీయ సమస్యలను కారణంగా చూపి ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా వ్యవహరించకూడదని.. వ్యూహాత్మక ఆసక్తులకు అనుగుణంగా భారత్-చైనా కలిసి ముందుకెళ్లాలన్నారు. పీఓకేలో చైనా ఆర్థిక సాయంతో నిర్మిస్తున్న చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్‌పై చర్చించారు. మయన్మార్ ప్రజాస్వామ్య నేత ఆంగ్‌సాన్ సూచీతోనూ భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య సానుకూల ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు. మయన్మార్‌లో శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆమె వివరించారు. మయన్మార్‌కు అన్ని విధాలా సాయం అందించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధమేనని భరోసా ఇచ్చారు. సదస్సులను ముగించుకుని మోదీ భారత్ చేరుకున్నారు.
భారత్‌కు సాయానికి ముందుంటాం
వియంతైన్: భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా తూర్పు ఆసియా దేశాల సదస్సు తర్వాత ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత్-అమెరికా దేశాల తక్షణ ప్రాధాన్యతలు, వ్యూహాత్మ ద్వైపాక్షిక భాగస్వామ్యంపై వీరు చర్చించారు. పౌర అణు సహకారం, వాతావరణ మార్పులపై పోరాటంపైనా మాట్లాడుకున్నారు. భారత్‌లో ఆర్థిక సంస్కరణల కోసం మోదీ చేస్తున్న ప్రయత్నాలను ఒబామా ప్రశంసించారు. జీఎస్టీ అమల్లోకి వస్తే.. ఆర్థిక వ్యవస్థపై క్రియాశీల ప్రభావం ఉంటుందన్నారు.
ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వానికి మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. అమెరికా ఎప్పటికీ భారత్‌కు మిత్రదేశమేనని.. బలమైన భాగస్వామిగా భారత్‌కు ఏ సహాయమైనా చేసేందుకు సిద్ధమన్నారు. అణు శక్తి రంగంలో భారత-అమెరికా భాగస్వామ్యం పురోగతిపై సమీక్ష చేశారు. ఇరుదేశాల బంధాలు బలపడటంలో ఒబామా తీసుకుంటున్న చొరవను మోదీ ప్రశంసించారు. మరోసారి భారత పర్యటనకు రావాలని ఒబామాను ఆహ్వానించారు. గత పర్యటనలో తాజ్‌మహల్ పర్యటను రద్దుచేసుకున్నందున.. మరోసారి భారత్‌కు వస్తానని ఒబామా తెలిపారు.